జగన్ చేతిలో కాంగ్రెస్ హస్తం నలిగిపోనుందా

  రాజాం యంపీ సాయి ప్రతాప్, అమలాపురం యంపీ హర్షకుమార్, విజయవాడ యంపీ లగడపాటి అందరూ నిఖార్సయిన కాంగ్రెస్ వాదులే. అయినా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆదిష్టాన వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సిద్ధాంతాల ప్రకారం ముందుకు సాగల్సిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రానున్నఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓట్లు,సీట్లు ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం చాలా శోచనీయమని సాయి ప్రతాప్ అన్నారు. దీనివలన తాత్కాలికంగా పార్టీ కొంత ప్రయోజనం పొందినా దీర్గ కాలంలో తీవ్రంగా నష్టపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.   ఇక దివాకర్ రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి, రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉంటే కదా! ఎన్నికలలో పోటీ చేయడానికి? అన్నారంటే కాంగ్రెస్ పరిస్థితి అర్ధం అవుతోంది. ఇక హర్షకుమార్ మాట్లాడుతూ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కోసం ఏకంగా పార్టీనే బలి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీకి వైకాపాలు రెండు తెర వెనుక కుమ్మక్కు అయ్యాయా లేదా అనే సంగతి రాష్ట్రంలో ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడని అన్నారు.   సమైక్యాంధ్ర పేరుతో పావులు కదుపుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్నివిడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకే తన పార్టీ యం.ఎల్.ఏ.లతో రాజినామాల డ్రామా మొదలుపెట్టడాని, అతనితో చేతులు కలిపి కాంగ్రెస్ అధిష్టానం పార్టీని రాష్ట్రంలో భ్రష్టు పట్టిస్తోందని, తమ రాజకీయ జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు.   అదేవిధంగా సమైక్యవాదిగా ముద్రపడ్డ లగడపాటి కాంగ్రెస్-వైకాపాల మధ్య ఉన్న అనైతిక బంధం గురించి మీడియా ప్రశ్నించినపుడు ఆ విషయంపై ఇప్పుడేమి మాట్లాడలేనని, కానీ తమ రాజీనామాలు ఆమోదింపజేసుకొన్న తరువాత చాలా విషయాలు బయటపెడతానని అయన అన్నారు. అంటే ఆయన కూడా కాంగ్రెస్-వైకాపాల మధ్య జరిగిన రహస్య ఒప్పందాలను ఖండించడం లేదని, త్వరలోనే ఆయన కూడా అధిష్టానంపై బాంబులు వేయబోతున్నారని స్పష్టం అవుతోంది.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానానికి వ్యతిరేఖంగా మొన్న మరో మారు గళం విప్పారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా, ప్రజాందోళనలను ఖాతరు చేయకుండా ముందుకు సాగితే రాష్ట్రంలో పార్టీ బ్రతికి బట్ట కట్టడం అసాధ్యమని ఆయన మీడియా ముందే మరో మారు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు.   కాంగ్రెస్ అధిష్టానం తలచిందొకటి, కానీ జరుగుతున్నది మరొకటి. రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేద్దామనుకొంటే, ఇప్పుడు పార్టీలోనే తీవ్ర వ్యతిరేఖతను ఎదుర్కోవలసి వస్తోంది. తనను వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సీమంధ్ర నేతలను కట్టడి చేయడానికి, జగన్మోహన్ రెడ్డికి బెయిలు ఇచ్చి రంగంలోకి దింపితే, అది మరింత వ్యతిరేఖతను పెంచింది. ఇంతవరకు కేవలం రాష్ట్ర విభజన కారణంగానే కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా నేరుగా పార్టీ అధిష్టాన్నానే ధిక్కరిస్తున్నారు.   దీనికంతటికీ కారణం కాంగ్రెస్ అధిష్టానం యొక్క రాజకీయ దురాశ, అతి తెలివి తేటలు, రాష్ట్ర సమస్యల పట్ల అవగాహణా లోపమే. అందువల్లే ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరిన్నికొత్త సమస్యలు సృష్టించుకొంటోంది. బహుశః దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అని అనాలేమో!

రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో కాంగ్రెస్ దుఖాణం బంద్ కాబోతోందా

  కాంగ్రెస్ పార్టీ పేరుకి జాతీయ పార్టీ అయినా క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి కుచించుకుపోతోంది. కారణం ఆ పార్టీ వేస్తున్నతప్పటడుగులే తప్ప ప్రతిపక్షాలు బలంగా ఉండటం వలన మాత్రం కాదు. రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నపటికీ రాష్ట్రంలో జరుగుతున్నపరిణామాలు మాత్రం ఆ పార్టీ ఏమాత్రం ముందు చూపు లేకుండా నిర్ణయం తీసుకొందని స్పష్టం చేస్తున్నాయి. విభజన నిర్ణయాన్ని అమలు చేయడంలో జరుగుతున్నజాప్యం వలన తెలంగాణాలో, విభజన చేస్తున్న కారణంగా సీమాంద్రాలో పార్టీ నష్టపోబోతోందని రెండు ప్రాంతాల నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పదేపదే హెచ్చరిస్తున్నారు.   ఈ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకొన్నా మొదట నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే తప్ప అది ఊహించినట్లు ప్రాంతీయ పార్టీలు కావు. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీకి తెలియకపోలేదు. అందుకే తెరాస, వైకాపాలను కాంగ్రెస్ లో విలీనం లేదా పొత్తుల కోసం అంత ఆరాటపడుతోంది. కానీ గత కొంత కాలంగా మళ్ళీ తెలంగాణాలో ఉద్యమ సెగలు రాజుకోవడం చూసిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తులకి కూడా ఇష్టపడటం లేదు. అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఒంటరి పోరు చేయక తప్పదన్నమాట.   ఇక, విభజన ప్రకటన తరువాత సీమాంద్రాలో అకస్మాత్తుగా మారిన పరిస్థితులు చూసిన కాంగ్రెస్ అధిష్టానం చాలా కలవరపడుతోంది. కానీ పైకి మాత్రం తన సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఎన్నికలలో పోటీ చేయడం మాట అటుంచి కాంగ్రెస్ తరపున కనీసం నామినేషన్లు వేయడానికి కూడా చాలా సాహసం ఉండాలని అక్కడి కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ సంకట స్థితి నుండి బయటపడేందుకే కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిని బయటకు తీసుకు వచ్చిరంగంలో దింపిందిప్పుడు.   అయితే ఇంతకాలంగా అతనిని జైలులో నిర్భందించి, ఇప్పుడు తనకు అవసరం పడింది గనుక బయటకు తెచ్చినంత మాత్రాన్నఅతను కాంగ్రెస్ పార్టీని క్షమించేయలేడు. మొదటి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి, సోనియా గాంధీ ముందు చేతులు కట్టుకొని నిలబడి ఆమె కనుసన్నలలో పని చేస్తూ ఆ పార్టీతో అధికారం పంచుకొంటాడని అంతకంటే నమ్మకం లేదు. అందువలన కాంగ్రెస్ పార్టీతో విలీనం కాదు కదా కనీసం పొత్తులకి కూడా అతను ఇష్టపడకపోవచ్చును. అప్పుడు సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా మిగిలిపోవచ్చును.   రాష్ట్ర విభజనతో తెరాసను,తెదేపాలను దెబ్బతీద్దామనుకొన్నకాంగ్రెస్ తన అసమర్ధ, అనాలోచిత నిర్ణయాలతో ఆ రెండు పార్టీలకే మేలు చేయడమే కాకుండా,ఇప్పుడు రాష్ట్రం నుండి జెండా పీకేసుకొనే పరిస్థితి స్వయంగా కల్పించుకొంది. మళ్ళీ ఉద్యమ సెగలు రాజుకొంటున్న నేపధ్యంలో తెలంగాణాలో తెరాస బలపడితే, రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ పార్టీతో వైకాపాకున్నఅనైతిక సంబంధాల కారణంగా ప్రజలు తెదేపా వైపుమొగ్గు చూపే అవకాశాలున్నాయి.   అందువలన రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ మరి కొంత కుచించుకుపోయి తెలంగాణాలో తెరాసకు తోకపార్టీగా, సీమంద్రాలో ఎవరయినా నేతలు గెలిస్తే ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోవచ్చును. ఈ దుస్థితి చేజేతులా సృష్టించుకొన్నదే గనుక ఇక కాంగ్రెస్ ఎవరినీ నిందించవలసిన పనిలేదు కూడా.

జగన్ ఎపీయన్జీవోలతో సయోధ్య కోరితే

  ఇంతవరకు వైకాపా చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాలు ఆశించినంత స్థాయిలో ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయని ఇటీవల షర్మిల పార్టీ అంతర్గత సమావేశంలో అన్నట్లు సమాచారం. సమైక్య ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్నికలిపి ఉంచాలనే ఆశయం కంటే, ఆ ఉద్యమాల ద్వారా తమ పార్టీని సీమాంద్రాలో బలపరుచుకోవాలనే ఆత్రమే వారిలో ఎక్కువ కనిపిస్తోంది. చివరికి ఆ పార్టీ నేతలు, అధ్యక్షుడితో సహా అందరూ తమ పదవులకు రాజీనామాలు చేసినా కూడా ప్రజలు, ఉద్యోగులు కూడా నమ్మడం లేదు. అందుకే వారు ఇంతకాలం వైకాపాను దూరం పెడుతున్నారు. అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విడుదలతో ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది.   రానున్న ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో వైకాపా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. లేకుంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీబీఐ కష్టాలు మొదలవుతాయి. గనుక గెలుపే లక్ష్యంగా అతను ముందుకు సాగనున్నాడు. ప్రస్తుతం అందివచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమాలతో పార్టీని ప్రజలకు మరింత చేరువచేసేలా అతను వ్యూహాలు రచించవచ్చును.   ఇంతవరకు ఏపీయన్జీవోలు, ప్రజలు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న నిరవధిక సమ్మె, ఉద్యమాలను జగన్మోహన్ రెడ్డి తన చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేసినప్పుడు, ఉద్యోగులలో చీలికలు ఏర్పడినట్లయితే, అది ఘర్షణ వాతావరణానికి దారి తీయవచ్చును. అయితే సీమాంద్రాకే పరిమితమయిన వైకాపా రానున్న ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టాలంటే ఏపీయన్జీవోల సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది గనుక వారిని దూరం చేసుకొనే సాహసం చేయకపోవచ్చును.   ఇంతవరకు వైకాపా వారికి దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినప్పటికీ, త్వరలో జగన్మోహన్ రెడ్డి మరోమారు గట్టి ప్రయత్నమే చేయవచ్చును. ఇక రెండు నెలలుగా అవిశ్రాంత పోరాటం చేసి అలిసున్నఏపీయన్జీవోలు కూడా జగన్ సరయిన రీతిలో ముందుకు వస్తే వారు కూడా అతనిని ఆదరించే అవకాశాలున్నాయి. ఇంతవరకు ఏపీయన్జీవోలు తమ నిరవధిక సమ్మెతో రాష్ట్రవిభజనను నిలువరించగలుగుతున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానాన్ని తన నిర్ణయం వెనక్కు తీసుకోనేలా మాత్రం ఒప్పించలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చినట్లయితే వారు అతనిని ఆహ్వానించినా ఆశ్చర్యం లేదు.   ఒకవేళ తమ పోరాటం విఫలమయ్యి రాష్ట్ర విభజన జరిగి, వైకాపా అధికారంలోకి వచ్చేఅవకాశాలున్నట్లు వారు భావిస్తే, అతనికి మద్దతు నీయడం ద్వారా వారి ఉద్యోగ ప్రయోజనాలు కూడా నెరవేరే అవకాశం ఉంది, గనుక వారు వైకాపాను ఉద్యమంలోకి ఆహ్వానించవచ్చును. అయితే, వైకాపా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు లేదా మద్దతుకు అంగీకరించబోదని జగన్ ముందుగా వారికి హామీ ఈయవలసి ఉంటుంది.   ఒకవేళ వారి మధ్య సయోధ్య కుదిరినట్లయితే, ఇది కాంగ్రెస్, తెదేపాలకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది.

పాక్ ఉగ్రవాదానికి భారీ మూల్యం చెల్లిస్తున్నప్రపంచ దేశాలు

  ఏ విత్తనము వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది తప్ప వేరే మొక్క మొలవదు. ఉగ్రవాదానికి బీజం వేసిన పాకిస్తాన్లో ఇప్పుడు అది మర్రి చెట్టులా వ్యాపించి పొరుగునున్న భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలనే కాక స్వయంగా పాకిస్తాన్ ప్రజల ప్రాణాలని కూడా బలిగొంటోంది. పాముతో సహవాసం చేసే వ్యక్తి ఏదో ఒకనాడు పాము కాటుకే బలయిపోయినట్లే, ఉగ్రవాద సర్పాన్నిపెంచి పోషిస్తున్నపాకిస్తాన్, అందుకు ప్రతిగా తన ప్రజల ప్రాణాలను పణంగా పెట్టక తప్పడం లేదు.   నిన్న పెషావర్ లో ఆల్ సెయింట్స్ చర్చ్ లో ఆదివారం ప్రార్ధనలు ముగించుకొని వస్తున్నక్రీస్టియన్ భక్తులపై ఇద్దరు తాలిబాన్ మానవ బాంబులు జరిపిన దాడిలో దాదాపు 70మంది అక్కడికక్కడే చనిపోగా మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇంతవరకు ముస్లిం ప్రజలపైన చాలా సార్లు దాడులు చేసి వేలాది మందిని పొట్టన బెట్టుకొన్నారు. కానీ ఈసారి పాకిస్తాన్ లో మైనార్టీ వర్గానికి చెందిన క్రీస్టియన్ మతస్థులపై దాడిచేసారు.   ఇక శనివారంనాడు కెన్యా రాజధాని నైరోబీలో సోమాలియాకు చెందిన 15 మంది ‘అల్-సబాబ్’ ఉగ్రవాదులు వెస్ట్-గేట్ అనే ఒక షాపింగ్ మాల్ పై చేసిన దాడిలో వివిధ దేశాలకి చెందిన దాదాపు 69మంది ప్రజలు చనిపోగా, మరో 175మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉగ్రవాద ముఠా మూలాలు కూడా పాకిస్తాన్ లోనే ఉన్నాయి. పాకిస్తాన్ దేశానికి చెందిన అబూ మూస మోంబస అనే ఉగ్రవాది సోమాలియా ఉగ్రవాదులకు శిక్షణ, మార్గదర్శకత్వం వహించినట్లు ప్రాధమిక నివేదికలు స్పష్టం చేసాయి.   ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ ఉగ్రవాదులు దాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లోనే కనబడుతున్నాయి. ఇటీవల జాతీయ దర్యాప్తు బృందం భారత్ లో పలు బాంబు దాడులు చేసిన ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రీజ్ లను అరెస్ట్ చేసినప్పుడు, వారు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు, పాకిస్తానీ గూడ చార సంస్థ ఐ.య.స్.ఐ. ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని స్పష్టం చేసారు.   పాకిస్తాన్ 1947లో స్వాతంత్రం పొందిన నాటి నుండి ఇంతవరకు సాధించిన అభివృద్ధి ఏమీ లేకపోయినప్పటికీ, ప్రపంచ ఉగ్రవాద రాజధానిగా ప్రసిద్ధి పొందింది. ఇందుకు ప్రధాన కారణం అక్కడి సైనిక వ్యవస్థ, గూడచార వ్యవస్థలలోగల అతివాదులయిన అధికారులు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాలపై పెత్తనం చేయడమే. అందువలన ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలు అసమర్ధ ప్రభుత్వాలుగా మిగిలిపోయి, దేశం అభివృద్ధికి నోచుకోలేదు. సైనికుల చెప్పు చేతలలో నడిచే పాకిస్తాన్ ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు వారు ఆడించినట్లే ఆడుతూ ఉగ్రవాద ముటాలను ఉపేక్షించవలసి వస్తోంది. తత్ఫలితంగా స్వయంగా పాకిస్తాన్ తో బాటు ప్రపంచ దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించవలసి వస్తోంది.   తన ఆధునిక ఆయుధ సంపత్తితో పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్నిమట్టు బెట్టేయగలనని భ్రమలోఉన్న అమెరికా ఆ దేశానికి ఒక వైపు కోట్లాది డాలర్లు ధన సహాయం చేస్తూనే, మరో వైపు బాంబుల వర్షం కురిపిస్తూ ద్వంద విధానం అవలంభించడం వలన అక్కడి పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. పాకిస్తాన్ లో రాజకీయంగా స్థిరత్వం నెలకొని, అది అబివృద్ధి బాట పట్టే వరకు ప్రపంచ దేశాలకు ఈ ఉగ్రవాద బెడద తప్పదు.

సీమాంద్రా నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారా

  నిన్నహోంమంత్రి సుషీల్ కుమార్ షిండే మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన తాజా ప్రకటనలతో, ఇంత కాలం రాష్ట్ర విభజన ప్రక్రియకు తామే బ్రేకులు వేసి నిలిపివేశామని గొప్పలు చెప్పుకొంటున్న సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు, గత యాబై రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్న ప్రజల, ఉద్యోగుల ముందు దోషులుగా నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది.   ఇంత కాలంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు తాము తెలంగాణా నోట్ పై అడ్డుపడ్డామని చెప్పుకొంటున్నారు. అయితే, నిన్నహోంమంత్రి షిండే, టీ-నోట్ పై డ్రాఫ్ట్ ఎప్పుడో తయారయిందని, ఇంత కాలం తను ఆరోగ్య కారణాల వలన కార్యాలయానికి రాలేక పోయినందునే దానిని పరిశీలించలేకపోయాయని, త్వరలో దాని పని పూర్తి చేస్తానని ఆయన ప్రకటించడంతో ఇంతకాలంగా వారు ప్రజలకు అబద్దం చెప్పినట్లయింది.   ఇక దిగ్విజయ్ సింగ్ నిన్న రాత్రి తనను కలిసిన సీమాంద్ర యంపీలతో మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే వారికి ఊరట కలిగించేందుకు అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాతనే టీ-నోట్ ను క్యాబినెట్ ముందుకు వెళుతుందని హామీ ఇచ్చారు.   ఇక సీమాంద్రాలో పర్యటించాలనే వారి డిమాండ్ కు పూర్తిగా తలొగ్గ కుండా, అలాగని నిరాకరించకుండా త్వరలోనే రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో పర్యటించి రాష్ట్రవిభజనపై ప్రజల అభిప్రాయం తెలుసుకొంటానని హామీ ఇచ్చారు. తద్వారా అటు తెలంగాణా నేతలను ప్రజలను సంతృప్తి పరుస్తూనే, మరో వైపు తమను సంప్రదించకుండా రాష్ట్ర విభజన ఎలా చేస్తారని అడుగున్నసమైక్యవాదులను సంప్రదించి ఆ మొక్కుబడి తంతు కూడా పూర్తిచేయవచ్చును.   ఇదంతా గమనిస్తే సీమాంద్రా ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్య పెడుతున్నారా? లేక వారినే కాంగ్రెస్ అదిష్టానం మభ్యపెడుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రవిభజన ఖాయమని తేటతెల్లం చేస్తున్నప్పుడు, ఇంకా ఈ తంతు కొనసాగించడం అనవసరమని కొందరు యంపీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలిసి కూడా వారు ఇంకా పదవులు పట్టుకొని ఎందుకు వ్రేలాడుతున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. బహుశః ఈ రోజు విజయవాడలో జరుగనున్న ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఈ విషయాల్లన్నీప్రస్తావనకు రావచ్చును.   ఏమయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ తెలంగాణా ఏర్పాటుకి ఇంత దృడనిశ్చయం కనబరచడం తెలంగాణవాదులకు చాలా ఆనందం కలిగిస్తోంది.

కంట తడిపెట్టిస్తున్నఉల్లి రాజకీయాలు

  కొండెక్కిన ఉల్లి ధర ఎన్నాళయినా దిగిరాక పోవడంతో ప్రజలు కంట తడిపెడుతున్నారు. ఒకప్పుడు కిలో పది-పదిహేను రూపాయలున్న ఉల్లి ధరలు నేడు రూ50-70మధ్యలో సెటిలయిపోయింది. సరయిన పంట దిగుబడి లేకపోవడం వలననే ధరలు పెరిగాయా? లేక దళారుల, నల్ల బజారు వ్యాపారుల చేతివాటం వలన పెరిగాయా? లేక ప్రస్తుతం ప్రభుత్వం నిద్రపోతుండటం వలననే పెరిగాయా?అని సామాన్యుడు ఆలోచిస్తుంటే, అంతకంటే ఇంకా పెద్ద కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.   కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ నాలుగు రోజుల క్రితం మరో నెల వరకు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని అన్నారు. ఆయన ఆ మాట అన్నకొద్ది గంటలలోపే ఉల్లి హోల్ సేల్ ధరలు రూ.47 నుండి అమాంతం రూ.58కి ఎగ బ్రాకాయి. తదనుగుణంగా రిటైల్ మార్కెట్లో రూ.65 నుండి 70కి పెరిగింది. అందుకు కారణం ఏమిటంటే, ఉల్లి, చెరుకు పంటలకు తల్లి వంటిదిగా చెప్పబడే మహారాష్ట్రలో శరద్ పవర్ కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది.   ధరల నియంత్రణ, సరఫరా తదితర అంశాలన్నీ దాని అదుపాజ్ఞలలోనే సాగుతుంటాయని, ప్రముఖ ఉల్లి మరియు దుంపల మార్కెట్ వ్యాపారి అశోక్ వాలున్జ్ మీడియాకు తెలియజేసారు. అందువల్లే శరద్ పవార్ మాటలు వ్యవసాయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఉల్లి రైతుకు కేజీకి రూ50 లాభం రావాలంటే రూ.60కి అమ్మకాలు జరుగుతాయని అతను తెలిపాడు.   మహారాష్ట్రలో శరద్ పవార్ తన పార్టీని బలపరచుకోవడానికే ఉల్లి రైతులకు పెద్ద ఎత్తున లాభాలు దక్కేందుకు ఈవిధంగా మార్కెట్ నియంత్రణ చేస్తుండవచ్చును. ఉల్లి ధరలు ఎంత పెరుగుతున్నపటికీ ఎగుమతులపై నిషేధం విదించబోమని ఆయన చెప్పడం కూడా బహుశః తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకొన్న రాజకీయ నిర్ణయమేనని భావించవచ్చును. శరద్ పవార్ ఇటీవల బియ్యం, పాల ఉత్పత్తులపై చేసిన వ్యాఖ్యల వలన, చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతున్న బియ్యం మరియు పాల ధరలు కూడా అకస్మాత్తుగా పెరిగాయి.   అంతిమంగా ఇది జాతీయ రాజకీయాలపై సైతం పెను ప్రభావం చూపబోతోంది. ఈ డిశంబరు నెలలో జరుగనున్న ఐదు రాష్ట్రల ఎన్నికలలో పెరిగిన ఉల్లి ధరలు అధికార పార్టీలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. గతంలో(1998) బీజేపీ ప్రభుత్వం కూడా ఉల్లి ఘాటు తట్టుకోలేక కుప్పకూలింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నిఎన్నికల ముందు పెరిగిన ఉల్లి ఘాటు చాల కలవర పెడుతోంది. అందుకే వెంటనే ఉల్లి ధరలను నియంత్రించేందుకు తగు చర్యలు చేప్పటింది.

ఏపీఎన్జీవో సమ్మెకు ముగింపు ఎప్పుడు

  గత 50 రోజులుగా సాగుతున్నసమైక్యాంధ్ర ఉద్యమాలు, ఏపీయన్జీవో ఉద్యోగుల సమ్మెలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం అవడంతో ఏపీయన్జీవో నేతలు కూడా సమైక్యాంధ్ర కోసం మరింత గట్టిగా పోరాడాలని నిర్ణయించుకొన్నారు. అదేవిధంగా ఆ సభ తరువాత తెలంగాణావాదులు కూడా హైదరాబాద్ అంశంపై మరింత బిగుసుకు పోవడంతో సమస్య మరింత జటిలమయ్యింది.   ఏపీయన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు తాము రాష్ట్రవిభజనపై వచ్చే సమస్యల గురించి టీ-యన్జీవో నేతలతో చర్చించేందుకు సిద్దమని, అందుకోసం ఈ నెలాఖరులోగా హైదరాబాదులో సోదర సద్భావన సమావేశం ఏర్పరిచి దానికి టీ-యన్జీవోనేతలను కూడా ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఆ సమావేశంలో రాష్ట్రం సమైక్యంగా ఉండవలసిన అవసరం గురించి తోటి తెలంగాణా ఉద్యోగులకు తెలియజెపుతామని అన్నారు. ఇక నిన్న టీ-ఎన్జీవో సంఘాల అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ “తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేఖించే వారెవరయినా సరే, బయటకు నడవాల్సిందే” అని తెరాస నేతల పద్దతిలోనే హెచ్చరించారు. ఈవిధంగా ఇరు ప్రాంతాల ఉద్యోగ నేతలు ఎవరికివారు నిర్దిష్టమయిన ఎజెండాలతో సమావేశం అవడం వలన ఒరిగేది శూన్యం.   ఇక, ఆర్.టీ.సి.ఉద్యోగ సంఘనేతలు నిన్న రవాణాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణతో జరిపిన చర్చలు కూడా విఫలమయిన్నట్లు సమాచారం. నెలరోజులుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నపటికీ, వారు వెనక్కి తగ్గకపోవడం చూస్తే వారు కూడా ఇప్పుడుడప్పుడే సమ్మె విరమించే ఆలోచనలో లేరని అర్ధం అవుతోంది.   అయితే, హైకోర్టు నిన్న ఏపీయన్జీవోల సమ్మెను తప్పుపట్టింది. అదేవిధంగా వారిని ఉపేక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్నికూడా తప్పుపట్టింది. అందువల్ల ఈ రోజు హైకోర్టు తీర్పు ఏవిధంగా ఉండబోతోందో చూచాయగా అర్ధం అవుతోంది. హైకోర్టును కాదని ఏపీయన్జీవోలు సమ్మె కొనసాగిస్తే, హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నరాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకోవలసి వస్తుంది. బహుశః ప్రభుత్వము, ఉద్యోగులు కూడా ఇటువంటి పరిస్థితిని ఇష్టపడకపోవచ్చును. గనుక ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించదలిస్తే, మరో మార్గం ఎంచుకోక తప్పదు.   ఏపీయన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఈ నెల30వరకు తమ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులకున్న నిబద్దత రాజకీయనేతలలో కనబడకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇప్పటికయినా పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన నిన్న మరోమారు విజ్ఞప్తి చేసారు. అంటే ఏపీయన్జీవోలు సుదీర్గ పోరాటానికే సిద్దపడుతున్నట్లు అర్ధం అవుతోంది.

విభజన కొరివితో తల గోక్కొంటున్న కాంగ్రెస్

  రాష్ట్ర విభజనపై మూడడుగులు ముందుకి ఆరడుగులు వెనక్కన్నట్లు వ్యవహరిస్తున్నకాంగ్రెస్, రాష్ట్రాన్నిరావణ కాష్టంగా మార్చి,అందులోతను కూడా తగలబడిపోతోందని రాష్ట్రంలో ఉభయ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఏమి చేస్తే ఏమవుతుందో అనే భయంతో విభజన ప్రకటన చేసిన 45 రోజుల తరువాత కూడా కాంగ్రెస్ అధిష్టానం అడుగు ముందుకు కదపలేకపోతోంది.   విభజన ప్రకటన చేసి రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలను చావు దెబ్బ తీయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తను త్రవ్వుకొన్నగోతిలో తనే పడినట్లయింది. ప్రకటన చేయగానే రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల నుండి తమ పార్టీలోకి భారీగావలసలు మొదలవుతాయని, అప్పుడు రెండు రాష్ట్రాలలో తమ పార్టీకి తిరుగుఉండదని భావించింది.   కానీ ఊహించని విధంగా వైకాపా సమైక్య ఉద్యమం రాజేయడం, ప్రజలు, ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టడం, స్వంత పార్టీలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరూ తిరుగుబాటు జెండా ఎగురవేయడం వంటివి కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసల సంగతి దేవుడెరుగు ముందు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగులుతుందా? అనే అనుమానాలు స్వయంగా ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.   గుంటూరు కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు అయితే మరో అడుగు ముందుకు వేసి, వచ్చే ఎన్నికలలో తెదేపా భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇదేవిధంగా తెలంగాణా ప్రక్రియను మరింత జాప్యం చేసినట్లయితే త్వరలో తెలంగాణాలోను పార్టీ మూతపడటం ఖాయమని అక్కడి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు.   తెలంగాణాపై నిర్ణయం తీసుకొంటున్నసమయంలో తెరాసను పక్కనబెట్టడం ద్వారా దానిపై పూర్తి ఆధిక్యత సంపాదించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రక్రియలో జరుగుతున్నజాప్యంతో మళ్ళీ క్రమంగా తెరాస బలపడుతోందని, అదే జరిగితే రేపు కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు చేసినా కూడా దాని ప్రయోజనం తెరాసకే దక్కుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉండబోదని, అప్పుడు ఇటు తెలంగాణాలో, అటు సీమాంధ్రలో రెండు ప్రాంతాలలో పార్టీకోలుకొని విధంగా దెబ్బతినడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు.   అయితే, హైదరాబాద్ వంటి సంక్లిష్టమయిన అంశాలపై ఎటువంటి ప్రణాళిక, ముందు చూపు లేకుండా మొండిగా ముందుకు సాగినందుకు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకొని కూర్చొంది.   కానీ ఈ జాప్యానికి కారణం తమ ఒత్తిడేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో కాంగ్రెస్ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కేవలం సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు లొంగిపోవడం వలననే జాప్యం జరుగుతోందని ఇప్పుడు తెరాస నేతలతో బాటు టీ-కాంగ్రెస్ ఎంతలలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. తత్ఫలితంగా మళ్ళీ తెలంగాణా లో ఉద్యమాలు మొదలవుతున్నాయి. టీ-కాంగ్రెస్ నేతల సమావేశాలు, తీర్మానాలు కూడా మళ్ళీ మొదలయ్యాయి.   మరి కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికయినా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించగలదా? రాష్ట్రాన్ని ఈ సమస్యల నుండి బయటపడేసి, తను బయటపడగలదా? లేకపోతే కళ్ళు మూసుకొని దైర్యంగా ముందుకో వెనక్కో వెళ్లి, ఏదో ఒక ప్రాంతాన్నిపణంగా పెట్టబోతోందా? లేక ఇదే పరిస్థిని కొనసాగిస్తూ రెండు ప్రాంతాలలో దుఖాణం మూసుకొంటుందా? వంటి ధర్మసందేహాలకి కాంగ్రెస్ జవాబు చెప్పలేకపోవచ్చును, కానీ కాలం మాత్రం తప్పక చెపుతుంది.

త్వరలో చంద్రబాబు తెలంగాణా యాత్ర

  సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరుగా సాగుతున్న తరుణంలో రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర పేరిట బస్సుచేసేందుకు సిద్దపడినప్పుడు, ఆయన రాకతో ప్రజలలో తమకు వ్యతిరేఖత ఏర్పడుతుందనే భయంతో స్వయంగా పార్టీ నేతలే వ్యతిరేఖించారు. ఆయనపై సమైక్యవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని వారు ఆయనని వారించే ప్రయత్నం చేసారు. కానీ వారు భయపడినట్లుగా ఆయన యాత్రకి ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదు, పైగా దానివల్లే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పుంజుకొంది.   కానీ, ఈ యాత్ర తెలంగాణాలో తేదేపాకు వ్యతిరేఖ భావనలు ఏర్పడేందుకు కారణమయ్యింది. చంద్రబాబు తన యాత్రలో “తమ పార్టీ సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తుందని, వారి హక్కులకోసం ఎంత పోరాటానికయినా సిద్దమని” గట్టిగా చెప్పడం వలన, తెదేపా కూడా వైకాపాలాగే తెలంగాణాను వదులుకొని, పూర్తి సీమాంధ్ర పార్టీగా మారడం తధ్యమని అందరూ భావించారు. ఒకవేళ చంద్రబాబు కూడా తెలంగాణా విషయంలో ‘మడమ తిప్పినట్లయితే’ తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని పార్టీలోని తెలంగాణా నేతలు కూడా చాలా ఆందోళన చెందారు.   అయితే చంద్ర తన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర పూర్తి చేసుకొని హైదరాబాదు తిరిగి రాగానే వారికి ఉపశమనం కలిగిస్తూ తను తెలంగాణాలో కూడా పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు రోడ్ మ్యాప్ సిద్దం చేయమని చెప్పారు. తెదేపా టీ-ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, త్వరలో చంద్రబాబు తెలంగాణాలో బస్సు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలియజేసారు.   తీవ్ర వ్యతిరేఖ పరిస్థితుల నడుమ సీమాంధ్రలో తను చేసిన బస్సు యాత్ర విజయవంతం అవడంతో, దాదాపు అటువంటి పరిస్థితులే నెలకొన్న తెలంగాణాలో కూడా ఇప్పుడు యాత్ర చేయడం సాధ్యమేనని ఆయనకు నమ్మకం కలిగినందునే ఇందుకు సిద్దపడుతుండవచ్చును. ఆయన తన ఆత్మగౌరవ యాత్ర ద్వారా సీమాంధ్రలో పార్టీ శ్రేణులకు ఏవిధంగా కొత్త ఉత్సాహం కలిగించగలిగారో, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణాలో కూడా పార్టీ శ్రేణులలో పార్టీపట్ల నమ్మకం నిలిపేందుకు యాత్ర చేసి తద్వారా అక్కడ కూడా పార్టీని బలపరచుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నట్లు అర్ధం అవుతోంది.   కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పరచడం ద్వారా అక్కడ పాగా వేయాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ, దానితో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్న తెరాసలు, తీవ్ర ప్రతికూలపరిస్థితులలో సీమాంధ్రలో యాత్ర మొదలుపెట్టి నెగ్గుకొచ్చిన చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణాలో కూడా పర్యటించి మళ్ళీ పార్టీని బలపరచుకోబోతుంటే ఆయనతో ఏవిధంగా వ్యవహరిస్తాయో చూడాలి.

విభజనలో తెలంగాణా రాజకీయాలు

  ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు రాష్ట్రవిభజన వ్యవహారంలో తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసింది కాదని, కేవలం ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నామని కాంగ్రెస్ అధిష్టానం చెపుతూ వస్తోంది. అయితే అది శుద్ధ అబద్ధమని ప్రజలకి తెలుసనే సంగతి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. కానీ విభజన కూడా మీ అభీష్టం మేరకే, మీ సంక్షేమం కోసమే చేస్తున్నామని కాంగ్రెస్ చాలా డిప్లోమేటిక్ గా ప్రజలకు చెపుతోంది.   తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతున్నందున అక్కడి ప్రజలకు ఇది నిజమని నమ్మడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండక పోవచ్చును, కానీ విభజనను వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర ప్రజలకు, విభజనతో రాజకీయంగా దెబ్బ తింటున్నఅక్కడి రాజకీయ పార్టీలకు మాత్రం నమ్మడానికి సిద్ధంగా లేరని స్పష్టం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తమను నిలువునా మోసం చేసిందని ఆగ్రహావేశాలతో ఉన్న సీమాంధ్ర ప్రజలు ఆ పార్టీని తప్పు పట్టడం సహజమే. కానీ తెలంగాణాపై పూర్తి పట్టు సాధించేందుకు కాంగ్రెస్, తెరాసలు చేస్తున్న రాజకీయాలు రాష్ట్ర విభజనలో రాజకీయ కోణాలను పట్టి చూపిస్తున్నాయి.   విభజన ప్రకటన చేస్తున్నపుడే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెరాస విలీనం గురించి మాట్లాడటం ఇందుకు మొదటి ఉదాహరణ అయితే నాటి నుండి నేటి వరకు ఆ రెండు పార్టీల మధ్య జోరుగా సాగుతున్న విలీనం, ఎన్నికల పొత్తుల బేరసారాలు ఈ వ్యవహారంలో ఇమిడి ఉన్న అన్ని రాజకీయ కోణాలను ఒకటొకటిగా బయటపెడుతున్నాయి.   తెలంగాణా ఏర్పాటుతో అక్కడి ప్రజలు లాభపడే సంగతి ఎలాఉన్నా, అధికారం పంచుకొని కాంగ్రెస్, తెరాసలు మాత్రం పూర్తిగా లాభపడటం ఖాయం. అందుకే విభజన ప్రకటన వచ్చిన నాటి నుండి ఆ రెండు పార్టీలు అధికారం ఏవిధంగా పంచుకోవాలనే తపనతో విలీనం, పొత్తుల గురించి మంతనాలు చేస్తు, ఏ ఫార్మాట్ లో ముందుకు వెళితే తాము ఇరువురం లాభాపడుతూనే, తెలంగాణాలో బలంగా ఉన్నతెదేపా, బీజేపీలను పూర్తిగా అడ్డు తొలగించుకోవచ్చునని దురాలోచనలు చేస్తున్నాయి.   విలీనం చేస్తే, అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం తెదేపా లేదా బీజేపీలకి దక్కితే అవి క్రమంగా బలపడే అవకాశం ఉందని గ్రహించిన కాంగ్రెస్, తెరాసలు ఇప్పుడు విలీనం కంటే ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవడానికే ఆసక్తి చూపుతున్నట్లు తాజా సమాచారం.   తద్వారా కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని లోలోన సంతోషపడుతుంటే, తెరాస తన ఉనికిని కోల్పోకుండానే మన్మోహన్ ప్రభుత్వాన్నిసోనియా గాంధీ ఏవిధంగా రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తోందో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నితాము నడిపించవచ్చునని తెరాస ఆనందపడుతోంది. పైగా తమ ఉమ్మడి శత్రువులు తెదేపా, బీజేపీలను అధికారానికి ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంచగలమని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి.

ప్రజారాజ్యం సీక్వెల్ బై పవన్ కళ్యాణ్

  ఎప్పుడు సంచలన వార్తల కోసం పరితపించే మీడియా, మరో సంచలన వార్తతో ముందుకు వచ్చింది. రాష్ట్రంలోనే కాక, పొరుగు రాష్ట్రాలలో, చివరికి ప్రవాస ఆంధ్రులలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరించబోతున్నట్లు తాజా వార్త. అయితే దీనిని ఆయన దృవీకరించక పోయినప్పటికీ, ఆ పార్టీలో పనిచేసిన కొందరు నేతలు ద్రువీకరిస్తుట్లు మీడియా వార్త.   సమాజం పట్ల తనకు బాధ్యత ఉందని భావించే పవన్ కళ్యాణ్ లో కొంచెం ఆవేశం, ఆలోచన రెండూ కూడా ఎక్కువేనని అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల, రాష్ట్ర విభజన ప్రకటనతో అల్లకల్లోలంగా తయారయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు తన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఒక రాజకీయ వేదిక కూడా అవసరముంటుందని మాజీలు ఆయనకు నచ్చజెప్పడంతో, తిరిగి ప్రజారాజ్యం పార్టీకి ప్రాణం పోసి, దానికి తను నేతృత్వం వహించేందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.   చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ‘సామాజిక తెలంగాణా’, ‘సామాజిక న్యాయం’ అంటూ రెండు ప్రాంతాలలో పార్టీకి మద్దతు సంపాదించినప్పటికీ ఆ తరువాత ఆయన సమైక్య రాగం ఆలపించడంతో తెలంగాణాలో ఆ పార్టీ వెంటనే తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అది పవన్ కళ్యాణ్ అభిమానులపై ఎటువంటి ప్రభావం చూపలేదని స్పష్టమయింది.   కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ పోరాటం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే, అప్పుడు తెలంగాణాలో ఉన్న అభిమానులను ఆయన వదులుకొంటారా? లేక అభిమానులే ఆయనని వదులుకొంటారా అనేది పార్టీ ఏర్పరచడం ఖాయమయితే తేలవచ్చును. లేక ఆయన అందరి మనోభావాలు పరిగణనలోకి తీసుకొని ముందుగానే రెండు ప్రాంతాలలో విడివిడిగా శాఖలు తెరుస్తారా? అనేది కూడా ఈ వార్తలను ఆయన దృవీకరించిన తరువాతనే తేలుతుంది.   అయితే ఆయన సమైక్యవాదానికే మొగ్గు చూపుతున్నట్లు కొన్ని రుజువులున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమేరా మ్యాన్ గంగతో రాంబాబు’ సినిమా కూడా రాష్ట్ర ప్రజల మధ్య విభజనను వ్యతిరేఖిస్తూ తీయడం ఆయన వ్యక్తిగత అభిప్రాయాలకి అద్దంపడుతోందని, అందుకే ఇప్పుడు ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించినట్లు సమాచారం.   ఇక ఆ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలోధూర్తులయిన కొందరు రాజకీయ నేతలపై పోరాడేందుకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలని హైదరాబాదుకి రమ్మని పిలుపునిచ్చే సన్నివేశాలను, ఇటీవల హైదరాబాదులో జరిగిన ఏపీయన్జీవోల సభకు ముందు వాడుకోవడం వలన, సభకు వేలాది ప్రజలు స్వచ్చందంగా తరలిరావడం జరిగిందనే ప్రచారం కూడా ఉంది.   ఒకవేళ ఆయన సమైక్యవాదంతో పార్టీ గనుక స్థాపిస్తే, సీమాంధ్రలో గోడ మీద పిల్లులా కూర్చొని చూస్తున్న రాజకీయ పార్టీ నేతలందరూ కూడా ఆనాడు ప్రజారాజ్యం పార్టీలోకి దూకేసినట్లే, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలోకి దూకేయడం ఖాయం. కానీ అదే జరిగితే, చిరంజీవి హయంలో ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే దీనికి పట్టడం కూడా అంతే ఖాయం.   ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పునరుద్దరించదలచుకొంటే, ముందుగా రాష్ట్ర విభజనపై ఎటువంటి వైఖరి అవలంభించాలి, పార్టీలో ఎవరెవరిని తీసుకోవాలి, అభిమానులకే పెద్ద పీట వేయాలా లేక తలపండిన రాజకీయ నేతలకే పెద్ద పీట వేయాలా? తనే నాయకత్వం వహించాలా లేక వేరేవరయిన సమర్ధుడు, నిజాయితీపరుడుకి ఆ భాద్యతలు అప్పగించి తను వెనుకనిలబడి పార్టీని తన ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా నడిపించడమా? వంటి అనేక అంశాలను ముందుగా నిర్ణయించుకోవడం మంచిది. ఏమయినప్పటికీ ఈ వార్తలు నిజమయినట్లయితే, రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్త సంచలనం సృష్టించడం ఖాయం.   కొసమెరుపు: కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రాష్ట్రానికి సరయిన నాయకుడని దర్శకుడు రాం గోపాల్ వర్మకొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసారు!

తెలుగు తేజం జయప్రకాశ్ నారాయణ చొరవ ఫలించేనా

  రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. అదేవిధంగా కాంగ్రెస్, తెరాస, తెదేపా, బీజేపీ, వైకాపాల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ సమస్య నుండి బయటపడటానికి రాజకీయ పార్టీలు ఇరుప్రాంత ప్రజల మధ్య మరింత విద్వేష బీజాలు నాటుతున్నాయి తప్ప, వాటిలో ఏ ఒక్కటీ కూడా ఈ సమస్యను శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకు రాలేదు. తత్ఫలితంగా ఇరుప్రాంతల ప్రజల మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టే సూచనలు కనబడటం లేదు. అంతిమంగా ఈ పరిణామాలన్నీ ప్రజల జీవితాలను దుర్భరం చేయడమే కాకుండా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నాయి. అయినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు దీనినుండి రాజకీయ లబ్దికోసం ప్రాకులాడుతూనే ఉన్నాయి.   ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, అంటూ వ్యాదులు, ఆర్ధిక సమస్యలు వంటివి ఎన్నిటినో ఎదుర్కొని తట్టుకొని నిలబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేడు రాజకీయ నాయకుల, పార్టీల స్వార్ధ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాలు, సమస్యను పరిష్కరించడంలో ప్రయత్నలోపం కారణంగా అత్యంత దయనీయమయిన స్థితిలో విలవిలాడుతోంది. బహుశః రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దుర్భర పరిస్థితులు ఎన్నడూ ఏర్పడి ఉండవు.   నిజాన్ని నిర్భయంగా చెప్పగల దైర్యవంతుడు, నిజాయితీ పరుడు, మేధావి అయిన లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ భాద్యత గల పౌరుడిగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తలపెట్టారు. ఆయన ఈనెల 14 నుండి కోస్తాంధ్ర, రాయలసీమలలో ‘తెలుగు తేజం’ పేరిట యాత్రకు సిద్దమవుతున్నారు. ఆయన తన యాత్రను కర్నూలులో ప్రారంభించి అనంతపురం, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, విశాఖ, విజయనగరంల మీదుగా సాగి ఈనెల 27న శ్రీకాకుళంలో ముగిస్తారు.   ఈ సందర్భంగా ఆయన పలు బహిరంగ సభలు, రౌండ్‌టేబుల్ భేటీలవంటివి నిర్వహించి రాష్ట్ర విభజనలో లోక్ సత్తా పార్టీ గుర్తించిన ఐదు ప్రధాన సమస్యలను ప్రజలకు వివరించి, అందరికీ ఆమోదయోగ్యంగమయిన పరిష్కారాల కోసం కృషి చేస్తారు. ఆయన తన యాత్రలో రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతిని ప్రజలకు తెలియజేస్తూనే, దాని వల్ల ఏర్పడే సమస్యలను, వాటికి పరిష్కారాలను ఆయన సూచించే ప్రయత్నం చేస్తారు.   సమైక్యాంధ్ర కోరుతూ గత నలబై రోజులుగా ఉద్యమిస్తున్న ప్రజలకు ఈవిధంగా నచ్చజెప్పబోవడం నిజంగా సాహసోపేతమే. అయితే వాస్తవ పరిస్థితులను వివరించి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవలసిన భాద్యత కూడా తమపై ఉందని ఆయన బలంగా నమ్ముతున్నదునే ఈ యాత్రకు సిద్దపడుతున్నారు.   మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులకు క్లాసిక్ సినిమాతో మెప్పించడం ఎంత కష్టమో, అదేవిధంగా తెరాస, కాంగ్రెస్, వైకాపా, తెదేపాల పసందయిన ఘాటు విమర్శలతో కూడిన ప్రసంగాలు వినేందుకు అలవాటుపడిన ప్రజలను జయప్రకాశ్ నారాయణ సమస్యలు-పరిష్కారాలు అంటూ మాట్లాడి మెప్పించడం కూడా అంతే కష్టం. అయితే ఇది సరయిన దిశలో వేస్తున్నతొలి అడుగు. గనుక విజ్ఞులయిన ప్రజలు కూడా ఆయన చెప్పే చేదు వాస్తవాలను, వాటికి ఆయన సూచించే పరిష్కారాలను స్వీకరించి తదనుగుణంగా ప్రతిస్పందించితే ఎప్పటికయినా రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.

టీ-నేతల వైఖరిలోమార్పుతో సమైక్యవాదులకు మేలు!

  ఇటీవల హైదరాబాదులో ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభతో ఉలిక్కిపడిన తెరాస, టీ-జేఏసీ, టీ-ఎన్జీవో నేతలు మొన్న తెరాస నేత కేశవ్ రావు ఇంట్లో సమావేశమయినప్పుడు, కేంద్రం రాష్ట్ర విభజన చేస్తూ, హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటన చేసినప్పుడు, హైదరాబాదు విషయంలో తాము చాలా సానుకూలంగా స్పందించడం వలననే, సీమాంధ్ర నేతలు, యన్జీవోలు ఇంత దైర్యంగా హైదరాబాదులో సభ పెట్టి హైదరాబాదుపై హక్కులు కోరగలిగారని అభిప్రాయపడ్డారు. అందువలన హైదరాబాద్ విషయంలో మునుపటి వైఖరిని మార్చుకొని, హైదరాబాదులో సీమాంధ్ర ప్రభుత్వం నడుపుకొనేందుకు కేటాయించబడే బిల్డింగ్స్ ఉన్నపరిమిత ప్రాంతాన్నిమాత్రమే ఉమ్మడి ప్రాంతంగా చేసి, హైదరాబాదులో మిగిలిన ప్రాంతాలను బేషరతుగా తెలంగాణా రాష్ట్రానికే చెందేలా చేయమని కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధాని విషయంలో కేంద్రం చేసే ఎటువంటి ప్రతిపాదనలను అంగీకరించకూడదని నిర్ణయించుకొన్నారు. తద్వారా, ఇక ముందు హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర నేతలు, ఉద్యమాకారులు ఎవరూ కూడా ఎటువంటి డిమాండ్స్ చేయకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకొన్నారు.   అయితే, ఇటీవల హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ గురించి తమ వద్ద మూడు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒకటి లేదా రెండు అమలుచేసే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసామని చెపుతున్న కేంద్రానికి, హైదరాబాద్ పీటముడి గురించి తెలిసి ఉన్నపటికీ, జరుగుతున్నఈ పరిణామాలన్నిటినీ చూస్తే చాలా అనాలోచితంగా ముందుకు సాగినట్లు అర్ధమవుతోంది. కనీసం ఇప్పటికయినా ఈ సమస్యను సామరస్యంగా ఏవిధంగా పరిష్కరించాలనే విషయంపై కేంద్రానికి ఎటువంటి అవగాహన లేనట్లు షిండే మాటల ద్వారా అర్ధం అవుతోంది.   ఇక ఇప్పుడు తెలంగాణా నేతలు హైదరాబాదుపై తమ వైఖరి మార్చుకోవాలని నిశ్చయించుకోవడంతో ఈ సమస్య మరింత జటిలం కాకమానదు. ఇటీవల ఏపీఎన్జీవోల సభ తెలంగాణావాదులలో ఐఖ్యతకు దోహదపడినట్లే, ఇప్పుడు వారు తీసుకొన్నఈ కొత్త నిర్ణయం, విభజనను వ్యతిరేఖిస్తున్న సమైక్యవాదులకు పరోక్షంగా మేలు చేస్తుందని చెప్పవచ్చును.   హైదరాబాదుపై సమాన హక్కులు కోరుతున్న సీమాంధ్ర నేతలు, యన్జీవోలు, ప్రజలు ఇప్పుడు తెలంగాణా నేతలు తీసుకొన్నఈ నిర్ణయంతో రాష్ట్ర విభజనను మరింత గట్టిగా వ్యతిరేఖించడం ఖాయం. హైదరాబాదు అంశం తేలేవరకు విభజన జరుగకుండా వారు కేంద్రంపై ఒత్తిడి తేవడం ఖాయం. గనుక, రాష్ట్ర విభజన ప్రక్రియకు మళ్ళీ బ్రేకులుపడినా ఆశ్చర్యం లేదు.   ఈ పరిణామాలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించవచ్చును. రానున్న ఎన్నికలలోగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించలేకపోయినట్లయితే అందుకు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాలలో భారీ మూల్యం చెల్లించక తప్పదు.

ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యమేనా

  సీమంద్రాలో గత నలబై రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఇటీవల హైదరాబాదులో ఏపీ యన్జీవోలు పెద్ద ఎత్తున నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి జారీ అయిన హెచ్చరికల నేపధ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం ఏప్రిల్లో జరుగనున్నసాధారణ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేస్తుందా లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.   రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో విజయం ఖాయం అనుకొన్నపటికీ, సీమాంధ్రలో మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని, సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ హెచ్చరిస్తున్నందున, కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ముందుగానే రాష్ట్రవిభజన చేసే సాహసం చేయకపోవచ్చును. మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమయిన దాదాపు 30 సీట్లను అందించే సీమాంధ్రాను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయలేదు.   అలాగని విభజన చేయకపోతే తెలంగాణాలో దెబ్బ తినడం ఖాయం. ఎన్నికలలోగా విభజన ప్రక్రియ పూర్తిచేయకపోయినట్లయితే, అది తెరాసకు చాలా మేలు చేకూర్చడం ఖాయం. అందువల్లనే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన తరువాతనే తెరాస విలీనం అని మెలిక పెడుతున్నాడు. ఒకవేళ ఏ కారణంగానయినా కాంగ్రెస్ పార్టీ గనుక పార్లమెంటులో బిల్లు పెట్టలేకపోయినట్లయితే, కేసీఆర్, తెలంగాణా సెంటిమెంటుతో ఎన్నికల బరిలోకి దూకి తను కోరుకొంటున్నట్లుగా 15/100 యంపీ, యంయల్యే సీట్లను కైవసం చేసుకొనే ప్రయత్నాలు తప్పక చేస్తాడు. తద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారి మరింత ఇబ్బందికరమయిన పరిస్థితులను సృష్టించే ప్రమాదం ఉంది.   అందువలన రెండు ప్రాంతాలలో విజయం సాధించేందుకుగాను తెలంగాణా ప్రక్రియను మెల్లగా కొనసాగిస్తూ, షిండే, దిగ్విజయ్ సింగ్ వంటి వారితో తెలంగాణా ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు ఒకవైపు ప్రకటనలు చేయిస్తూనే, పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టకుండానే తెరాసను విలీనం కోసం ప్రయత్నించి, ఆ తరువాతనే కాంగ్రెస్ ఎన్నికలకి సిద్దపడవచ్చును. మరోవైపు సీమాంద్రా నేతలకు ఇప్పుడప్పుడే రాష్ట్ర విభజన ఉండబోదని నమ్మకం కలిగించేందుకు అంటోనీ కమిటీకి అదనంగా మరో కమిటీ కూడా వేసి వాటితో ఎన్నికలు పూర్తయ్యేవరకు కాలక్షేపం చేయవచ్చును. ఏమయినప్పటికీ ఎన్నికలు పూర్తయ్యేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరుగకపోవచ్చును.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గెలిస్తే, తెలంగాణా ఏర్పాటు చేసిన ఖ్యాతిని స్వంతం చేసుకోగలదు. ఒకవేళ బీజేపీ చేతిలో ఓడిపోయినట్లయితే, రాష్ట్ర విభజనను వ్యతిరేఖంగా సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, తన పార్టీ నేతలు చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలను మరింత ఉదృతంగా సాగేలా ప్రోత్సహిస్తూ, తాను ఇంతకాలం ఎదుర్కొన్న సంకట పరిస్థితులనే బీజేపీకి కూడా కల్పించే ప్రయత్నమే చేయవచ్చును.   ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాల ప్రజలు కూడా గత రెండు మూడేళ్ళుగా రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సాగుతున్నకాంగ్రెస్ పార్టీ పాలనతో చాలా విసుగెత్తిపోయున్నారు. గనుక, ఆ పార్టీ రాష్ట్ర విభజన చేసినా చేయకున్నాతిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. తెలంగాణాలో తెరాసకు, సీమాంధ్ర లో తెదేపా, వైకాపాలకు ఈ సారి ప్రజలు అవకాశం ఇవ్వవచ్చును. తెదేపా, తెరాసాలు గెలిస్తే బీజేపీతో, తెరాస, వైకాపాలు గెలిస్తే కేంద్రంలో బలాబలాలను బట్టి కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టవచ్చును.

స్పష్టమయిన సందేశమిచ్చిన ఏపీఎన్జీవో సభ

  అందరూ భయపడినట్లుగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏపీఎన్జీవోల సభ, టీ-జేయేసీ బంద్ ప్రశాంతంగా ముగిసాయి. ఇరువర్గాల నేతలు ప్రజలకు సంయమనం పాటించమని పదే పదే చేసిన విజ్ఞప్తి కారణంగానే ఇది సాధ్యమయిందని చెప్పవచ్చును.   ఇక ఈ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ప్రసంగించిన ఎన్జీవో నేతలు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలకి, తెలంగాణా నేతలకి చాలా స్పష్టమయిన సందేశమే ఇచ్చారు. కేంద్రం రాష్ట్రవిభజన నిర్ణయం వెనక్కు తీసుకొనే వరకు తమ సమ్మె, ఉద్యమం కొనసాగుతాయని స్పష్టం చేసారు. (సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్ర విభజనపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం విశేషం.) సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, తమ రాజీనామాలతో దారికి తేవాలని ఎన్జీవో నేతలు స్పష్టం చేసారు. వారు వెంటనే తమ తమ పదవులకు రాజీనామాలు ఇచ్చి, కేంద్రం తన నిర్ణయం వెనక్కు తీసుకొనేలా ఒత్తిడి చేయాలని వారు కోరారు. ఒకవేళ రాజీనామాలు చేయకుండా పదవులను పట్టుకొని వ్రేలాడినట్లయితే వారికి గట్టిగా బుద్ది చెపుతామని హెచ్చరించారు.   ప్రజాభీష్టం తెలుసుకోకుండా కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయాలను తాము ఆమోదించలేమని స్పష్టం చేసారు. ప్రజలు వారిని ఎన్నుకొనేది పాలించడానికే కానీ విభజించడానికి కాదని అన్నారు. ఉద్యమాల వలన ప్రజలు తప్ప, రాజకీయ నాయకులెవరూ నష్ట పోలేదని వారు అన్నారు. కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయంపై ఇప్పుడు ముందుకు కానీ, వెనక్కు గానీ వెళ్ళలేని స్థితిలో ఉందని అన్నారు.   ఇక సభలో ప్రసంగించిన నేతలందరూ హైదరాబాదుపై తమ హక్కులను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల సమిష్టి కృషి మూలంగా నేడు హైదరాబాదు ఈ స్థితికి వచ్చిందని, అందువల్ల హైదరాబాదుపై అందరికీ సమాన హక్కులు ఉంటాయని, తమను పొమ్మనే అధికారం ఎవరికీ లేవని వారు స్పష్టం చేసారు. అదేవిధంగా హైదరాబాదులో స్థిరపడిన ఆంద్ర ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామనే భరోసా కల్పించారు.   పాలకులు కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలన్నిటినీ నిర్లక్ష్యం చేయడం వలననే నేడు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. అందువల్లే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలయినా హైదరాబాదుపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడిందని, అటువంటప్పుడు తమను ఇప్పుడు అకస్మాత్తుగా బయటకి పొమ్మంటే ఎక్కడికి పోతామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాదును ఎట్టి పరిస్థితుల్లో వదులుకొనే ప్రసక్తి లేదని వారుస్పష్టం చేసారు.   రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అప్పటి పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ప్రజల అభిమతం మేరకు ఆ లేఖలు వెనక్కు తీసుకొని సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం తమతో కలిసి ఉద్యమించాలని లేకుంటే వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.   రాజకీయ నాయకులు బస్సు యాత్రలు, రధ యాత్రలు చేస్తూ ప్రజలకు చరిత్ర పాటాలు భోదించనవసరం లేదని, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఇప్పటికయినా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా నిలిస్తే ప్రజలు వారిని క్షమిస్తారని తెలిపారు.   మొత్తం మీద ఎన్జీవో నేతలు విభజనపై దూకుడు ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, పదవులను అంటి పెట్టుకొని నాటకాలు ఆడుతున్న ప్రజా ప్రనిధులకు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న రాజకీయ పార్టీ నేతలకి, హైదరాబాదు నుండి పొమ్మని చెపుతున్న తెలంగాణా నేతలకి ఈ సభ ద్వారా స్పష్టమయిన సందేశం ఇచ్చారు. దీనిపై సదరు వర్గాల ప్రతిస్పందనలు రేపటి నుండి గమనించవచ్చును.

ఏపీ ఎన్జీవోలు, తెలంగాణావాదుల పోరాటం దేనికోసం

  రేపు హైదరాబాదులో ఏపీ యన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట సభ నిర్వహించాలనుకోవడం, దానిని అడ్డుకొనేందుకు తెలంగాణావాదులు బంద్ కు పిలుపునీయడం వారివారి అందోళనలకు అద్దం పడుతున్నాయి. ఏపీ యన్జీవోలు హైదరాబాదులోనే సభ నిర్వహించాలనుకోవడానికి ప్రధాన కారణం అక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులకు, నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలకు దైర్యం కలిగించడం, తెలంగాణవాదులకు తమ శక్తిని ప్రదర్శించి తాము ఎవరి బెదిరింపులకీ భయపడమని తెలియజేయడానికేనని భావించవచ్చును. కేవలం ఉద్యోగుల సమస్యలను చర్చించడానికే అయితే, ఈ సభను ఆంధ్ర ప్రాంతంలో మరెక్కడయినా పెట్టుకోవచ్చును.   రాష్ట్ర విభజన జరిగిన తరువాత తమకు ఉద్యోగపరంగా అనేక సమస్యలు వస్తాయని ఏపీ యన్జీవోలు ఆందోళన చెందడం సహజమే. ఒక ప్రభుత్వ హయాములో పని చేస్తున్నపుడే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక విభజన జరిగితే రెండు ప్రభుత్వాలు తమ జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకొంటాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో టీ-యన్జీవోలు కూడా వారి పరిస్థితి పట్ల సానుకూలంగానే ప్రవర్తిస్తున్నారు.   అయితే, ఏపీ యన్జీవో నేతలు రాజకీయంగా వాదిస్తుండటంతో వారి సభకు అభ్యంతరం చెపుతున్నారు. ఏపీ యన్జీవోలు ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించకుండా, ఆ సాకుతో రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని చెప్పడం వారి ఆగ్రహానికి కారణం అవుతోంది. కొందరు సీమంధ్ర రాజకీయ నేతల ప్రోద్బలంతో, వారి వ్యూహంలో భాగంగానే ఏపీ యన్జీవోల ఈ సభ జరుగుతోందని తెలంగాణావాదులు అనుమానిస్తున్నారు.   ఏపీ యన్జీవోలకు రాష్ట్ర విభజనను అడ్డుకొనేంత శక్తి లేదనే సంగతి ఇరుప్రాంత యన్జీవోలకి బాగా తెలుసు. అయినా, ఒకరు విభజనను అడ్డుకొంటామని హుంకరించడం, దానికి అంతే ధీటుగా మరొకరు జవాబు చెప్పడం కేవలం ఇరువర్గాల నేతల భేషజాల వల్లనే జరుగుతోంది.   వారిరువురి వాదనలలో ‘రాష్ట్ర విభజన’, ‘ఉద్యోగుల హక్కులు’ అనే రెండు అంశాలు మాత్రమే పైకి వినిపిస్తున్నపటికీ, వారి అసలు పోరాటం మాత్రం హైదరాబాద్ గురించేనన్నది బహిరంగ రహస్యమే. హైదరాబాదు, దాని ఆదాయంపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని భావిస్తున్న సీమంద్రా ప్రాంత ఉద్యోగులు, ప్రజలు ఆవిషయాన్నీ మరింత బలంగా నొక్కి చెప్పడానికే ఈ సభను నిర్వహిస్తున్నారనేది కాదనలేని విషయం. సరిగ్గా ఇదే అంశంపై వారిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నతెలంగాణావాదులు ఏపీ యన్జీవోల సభను అడ్డుకోవాలని భావిస్తున్నారు.   ఇటువంటి ఆలోచనలను మొగ్గ దశలో త్రుంచి వేయకపోయినట్లయితే, సీమంధ్ర రాజకీయ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హైదరాబాదుపై వారికి అనుకూల నిర్ణయం వచ్చేలా ఒప్పించే ప్రమాదం ఉందని తెలంగాణావాదుల ఆందోళన చెందుతున్నారు. అంటే, ఇరువర్గాల నేతలు నిర్వహించదలచిన ఈ పోటాపోటీ కార్యక్రమాల వెనుక అసలు కారణం కేవలం హైదరాబాదు అంశమేనని అర్ధం అవుతోంది.   అయితే ఇటువంటి సంక్లిష్టమయిన అంశంపై పోటాపోటీగా బహిరంగ సభలు,ర్యాలీలు, బందులు చేయడంవలన సమస్య మరింత జటిలం అవుతుంది తప్ప ఎటువంటి పరిష్కారం దొరకదు. ఇటువంటి సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకోవలసి ఉంటుందని వారికీ తెలుసు.   ఇంత కాలం యావత్ రాష్ట్రాన్ని ఎంతో సమర్ధంగా నడిపిన ప్రభుత్వోద్యోగులు, తమ పంతాలను, భేషజాలను పక్కన బెడితే ఇప్పుడు తమ స్వంత సమస్యలను కూడా అవలీలగా పరిష్కరించుకోగలరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఇరుప్రాంత ఉద్యోగులు చిరకాలం కలిసి పనిచేయక తప్పదనే సంగతి వారికీ తెలుసు. ఇంతకాలం ఒకే కుటుంబ సభ్యులవలే కలిసిమెలిసి పనిచేసిన వారు, స్వార్ధ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడే రాజకీయ చదరంగంలో పావులుగా మారకుండా జాగ్రత్త పడాలి.   అదేవిధంగా ఇరు ప్రాంతాల ఎన్జీవో నేతలలో సమస్యలు సృష్టిస్తున్నకొందరు అతివాదులను గుర్తించి అటువంటి వారిని దూరంగా పెట్టగలిగితే సమస్యలు చాల వరకు సానుకూలంగా పరిష్కరించుకొనే అవకాశముంటుంది.

సోనియాపై అంత కోపమేలనయా బాబు

  చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలోవిభజనపై తన పార్టీ వైఖరిని ప్రజలకు వివరించి, తమపార్టీపై కాంగ్రెస్, వైకాపాలు చేస్తున్న దుష్ప్రచారాన్నిఅడ్డుకొనే ప్రయత్నం చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఆయన తన యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర పదజాలంతో దాడిచేస్తు అసలు సంగతి పక్కన బెడుతున్నారు.   “బ్రిటిష్ వారిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చినకాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల నెత్తిన ఇటలీ పాలనను రుద్దుతోందని, ఆమె దేశాన్ని కొల్లగొట్టి సంపదను ఇటలీకి విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రూపాయి పతనానికి ఆమె ముఖ్య కారణమని, దేశాన్ని సర్వ విధాల భ్రష్టుపట్టించిన ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మన రాష్ట్రాన్ని కూడా ముక్కలు చెక్కలు చేసి, అన్నదమ్ములవంటి తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించారు. ఆమె తన కొడుకు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రిగా పట్టం కట్టేందుకే, రాష్ట్రాన్ని రెండుగా చీల్చి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేశాన్ని, రాష్రాన్ని సర్వ నాశనం చేస్తున్నకాంగ్రెస్ పార్టీని రెండు ప్రాంతాలలో ప్రజలు తరిమికొట్టాలని” ఆయన పిలుపునిచ్చారు.   ఆయన చేస్తున్నఈ ఉపన్యాసాలు వింటే ఎవరికయినా ఇటీవల హైదరాబాదులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసం గుర్తుకు రాకమానదు. తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ తారక రామారావు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖించేవారని, తెదేపా కూడా ఆయన అడుగుజాడలలో నడిచి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి పారద్రోలాలని మోడీ కోరారు. తద్వారా బీజేపీ తెదేపాతో ఎన్నికల పోత్తులకు ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేసారు. అయితే తెదేపా వెంటనే స్పందించక పోయినప్పటికీ, ఆయన ప్రతిపాదనను ఖండించలేదు కూడా. ఇప్పుడు చంద్రబాబు సరిగ్గా మోడీ రూట్ లోనే పయనిస్తున్నారు.   ఇక చంద్రబాబు ఆగ్రహం వెనుక అందరికీ తెలిసిన మరో బలమయిన కారణం కూడా ఉంది. అదే రాష్ట్ర విభజన. ఏడెనిమిది మాసాలు ఎంతో ప్రయాసపడి పాదయాత్ర చేసి రాష్ట్రంలో పార్టీని మళ్ళీ బలపరుచుకొంటే, కాంగ్రెస్ ఒకే ఒక ప్రకటనతో ఆయన శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది. ఇక విభజన వల్ల రెండు ప్రాంతాలలో పార్టీ ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడింది. కాంగ్రెస్, తెరాసలు చేతులు కలిపితే తెలంగాణాలో తెదేపా పరిస్థితి మరీ దయనీయంగా మారనుంది.   ఇక సీమంధ్రలో చాలా బలంగా ఉన్నామని భావిస్తున్నతరుణంలో విభజన ప్రకటనతో, వైకాపాతో పోటీ పడవలసిన అగత్యం ఏర్పడింది. సరిగ్గా ఎన్నికల ముందు తమ పార్టీని అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్ మీద, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మీద చంద్రబాబుకి ఆగ్రహం కలగడం సహజమే.

మూస ఫార్ములాలను పట్టుకు వ్రేలాడుతున్న రాజకీయ పార్టీలు

  అటు షర్మిల, ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీని, ఆ తరువాత ఒకరినొకరు వేలెత్తి చూపుకొంటూ తమ పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు దుష్ట పార్టీలేనని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిరువురూ చేస్తున్న ఈ ఆరోపణలను కాంగ్రెస్, తెరాసలు ఖండిస్తూ వారు చేసిన తప్పులనే ఎత్తి చూపుతున్నాయి. పేరేదయినా రాజకీయ పార్టీలన్నీకూడా ఒక తానులోముక్కలేనని అర్ధం అవుతోంది.   స్వంత డబ్బా కొట్టుకొంటూ, ప్రత్యర్ధ పార్టీలను ఆడిపోసుకోవడమే రాజకీయమనే ఫార్ములాను అందరూ గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అదేవిధంగా రాజకీయాలలో నీతి నియమాలకు తావులేదనే నిశ్చితాభిప్రాయం కూడా వారిలో ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ‘గ్యారంటీ హిట్’ కోసం మూస ఫార్ములాతో సినిమాలు నిర్మించి బోర్లాపడుతున్నట్లుగానే, మన రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి కొన్ని మూస ఫార్ములాలతో తప్పక విజయం సాధించవచ్చనే భ్రమలో ముందుకు వెళ్లి బోర్లాపడుతున్నాయి.   మన రాజకీయ నేతలు ‘ప్రజలకి అన్నీ తెలుసు’ అని పైకి చెపుతున్నపటికీ, వారి మనసులో మాత్రం ప్రజల పట్ల చాల చులకన భావం ఉంది. వారికి ఏమీ అర్ధం కాదు. వారికి ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. వారిని మాటలతో మాయ చేసి తమకనుకూలంగా మలుచుకోవచ్చుననే నిశ్చితాభిప్రాయం వారిలో ఉండబట్టే ఈవిధంగా బాధ్యతారాహిత్యంగా రాజకీయాలు చేస్తున్నారు. అటువంటి నేతలకి, పార్టీలకి ప్రజలు చాలా సార్లు బుద్ధి చెప్పారు. అయినా వారు తమ రాజకీయ ఫార్ములాలను మాత్రం ఏమాత్రం మార్చుకోకుండా అదే పంధాలో ముందుకు సాగితే మున్ముందు కూడా వారికి ప్రజల చేతిలో భంగపాటు తప్పదు.   కాంగ్రెస్, తెదేపా, తెరాస, వైకాపా, భాజాపాలలో ఏ ఒక్క పార్టీ కూడా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, అరాచక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. మిగిలిన పార్టీల కంటే తాము ఈ రాష్ట్ర విభజన రేసులో ఎలాగ ముందుకు దూసుకుపోవాలనే తాపత్రయమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ఉద్యమాల కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు గానీ పట్టించుకొనే స్థితిలో లేవు. కానీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం అవి మొసలి కన్నీళ్లు కార్చడం మాత్రం మరిచిపోలేదు. దానిని ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని భ్రమలో ఉన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికి బయలుదేరిన నేతలే ముందుగా తమ ఈ భ్రమలలోంచి బయటపడితే మేలు.   నిజంగా వారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోరేవారయితే, సీమంధ్రపై ఆధిపత్యం కోసం చేస్తున్నఈ పోరాటాలను ఆపేసి, విభజన అనివార్యం గనుక అది సజావుగా జరిగేందుకు ఏమిచేయవలసి ఉంటుందో అది చేయాలి. ఇప్పటికయినా విజ్ఞత ప్రదర్శించి ఇరుప్రాంత ప్రజలు నష్టపోకుండా విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు తమవంతు సహకారం అందించాలి. వీలయినంత త్వరగా రాష్ట్రంలో శాంతి నెలకొల్పే దిశగా ప్రయత్నించాలి. ఈ పని సవ్యంగా చేయగలిగితే ప్రజలే వారికి పట్టం కడతారు.   తమకు మేలుచేసేవారిని గుర్తించడంలో ప్రజలెన్నడూ పొరపడలేదు, పొరపాటు చేయలేదు. అదేవిధంగా తమని మోసం చేస్తున్న నేతలకి, పార్టీలకి తగిన విధంగా బుద్ధి చెప్పడం మరిచిపోలేదు. మన రాజకీయ నేతలు, వారి పార్టీలు ఈవిషయం ఎంత త్వరగా గ్రహిస్తే అది వారికి అంత మేలు చేస్తుంది.

షర్మిల బస్సుయాత్ర సమైక్యం కోసమా పార్టీ కోసమా

  ఈ రోజు షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనల చేసిన తరువాత, తిరుపతి వెళ్లి అక్కడి నుండి తన ‘సమైక్య శంఖారవం’ బస్సుయాత్ర మొదలుపెడతారు. ఆమె సీమాంధ్రలో 13 జిల్లాలో దాదాపు నెలరోజుల పాటు యాత్ర చేసే అవకాశం ఉంది. ఆమె తన యాత్రను ఈ రోజు తిరుపతిలోజరిగే బహిరంగ సభతో మొదలుపెట్టి రేపటి నుండి తన యాత్రను కొనసాగిస్తారు.   షర్మిల ఇటీవల పూర్తి చేసుకొన్నతన పాదయాత్ర ద్వారా ప్రజలలో వైయస్సార్ సెంటిమెంటును సజీవంగా నిలుపుతూ, జైల్లో ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిపట్ల ప్రజలలో సానుభూతి ఏర్పరిచేందుకు కృషిచేసారు. తమ ఈ కష్టాలన్నిటికీ కాంగ్రెస్, తెదేపాలే కారణమని ప్రజలకు వివరిస్తూ పార్టీకి ప్రజల సానుభూతి సంపాదించే ప్రయత్నం చేసారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటనతో ఆమె పడ్డ ఈ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయింది.   కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుకి పైఎత్తు వేస్తూ వైకాపా మళ్ళీ సరికొత్త వ్యూహ రచన చేసుకోక తప్పలేదు. ఆ వ్యూహంలో భాగంగానే వైకాపా తెలంగాణాను పూర్తిగా వదులుకొని, సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొంది. సీమాంధ్రలోకాంగ్రెస్, తెదేపాలకు సంకట పరిస్థితి కల్పించి తద్వారా తను బలపడాలని వైకాపా నిశ్చయించుకొంది. ఆ ప్రయత్నంలో వైకాపా చాలా వరకు విజయం సాధించింది కూడా. ప్రజా ఉద్యమాలకి తోడు, వైకాపా అద్వర్యంలో నిర్వహిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలతో తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.   అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు భావించవచ్చును. అదేవిధంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య చంద్రబాబు కూడా ఆత్మగౌరవ యాత్రతో ప్రజల మధ్యకి రాక తప్పలేదు.   ఈ రోజు షర్మిల మొదలుపెట్టబోతున్న బస్సుయాత్ర ‘సమైక్యాంధ్ర లేదా సమన్యాయం’ కోసమని ఆ పార్టీ చెప్పుకొంటున్నపటికీ నిజానికి ఆ మిషతో తెదేపా, కాంగ్రెస్ పార్టీలను రాజకీయంగా దెబ్బతీసి, సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకోనేందుకేనని చెప్పవచ్చును. సమైక్యాంధ్ర కోసం గత నెలరోజులుగా సీమంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నఉద్యమాలను, ఉద్యోగుల నిరవధిక సమ్మెతో స్తంభించిపోయిన రాష్ట్రాన్నిచూసి కూడా తెలంగాణా విషయంలో వెనక్కుతగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నకాంగ్రెస్ అధిష్టానం, తను చేపడుతున్నబస్సు యాత్రకు జడిసి వెనక్కు తగ్గుతుందని షర్మిల కూడా భావించట్లేదు. అయినప్పటికీ ఆమె సమైక్య శంఖారావం పూరిస్తూ బస్సుయాత్ర మొదలుపెట్టడం, కేవలం ఈ సమైక్య ఉద్యమాల ద్వారా పార్టీని సీమంధ్రలో బలోపేతం చేసుకోవడానికే తప్ప మరొకందుకు కాదు.   షర్మిల చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆమె ఎంతవరకు విజయం సాధిస్తారో, ఆమెను తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఏవిధంగా ఎదుర్కొంటాయో ప్రజలే ప్రత్యక్షంగా చూడవచ్చును.