మూస ఫార్ములాలను పట్టుకు వ్రేలాడుతున్న రాజకీయ పార్టీలు
posted on Sep 3, 2013 9:28AM
అటు షర్మిల, ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీని, ఆ తరువాత ఒకరినొకరు వేలెత్తి చూపుకొంటూ తమ పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు దుష్ట పార్టీలేనని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిరువురూ చేస్తున్న ఈ ఆరోపణలను కాంగ్రెస్, తెరాసలు ఖండిస్తూ వారు చేసిన తప్పులనే ఎత్తి చూపుతున్నాయి. పేరేదయినా రాజకీయ పార్టీలన్నీకూడా ఒక తానులోముక్కలేనని అర్ధం అవుతోంది.
స్వంత డబ్బా కొట్టుకొంటూ, ప్రత్యర్ధ పార్టీలను ఆడిపోసుకోవడమే రాజకీయమనే ఫార్ములాను అందరూ గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అదేవిధంగా రాజకీయాలలో నీతి నియమాలకు తావులేదనే నిశ్చితాభిప్రాయం కూడా వారిలో ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ‘గ్యారంటీ హిట్’ కోసం మూస ఫార్ములాతో సినిమాలు నిర్మించి బోర్లాపడుతున్నట్లుగానే, మన రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి కొన్ని మూస ఫార్ములాలతో తప్పక విజయం సాధించవచ్చనే భ్రమలో ముందుకు వెళ్లి బోర్లాపడుతున్నాయి.
మన రాజకీయ నేతలు ‘ప్రజలకి అన్నీ తెలుసు’ అని పైకి చెపుతున్నపటికీ, వారి మనసులో మాత్రం ప్రజల పట్ల చాల చులకన భావం ఉంది. వారికి ఏమీ అర్ధం కాదు. వారికి ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. వారిని మాటలతో మాయ చేసి తమకనుకూలంగా మలుచుకోవచ్చుననే నిశ్చితాభిప్రాయం వారిలో ఉండబట్టే ఈవిధంగా బాధ్యతారాహిత్యంగా రాజకీయాలు చేస్తున్నారు. అటువంటి నేతలకి, పార్టీలకి ప్రజలు చాలా సార్లు బుద్ధి చెప్పారు. అయినా వారు తమ రాజకీయ ఫార్ములాలను మాత్రం ఏమాత్రం మార్చుకోకుండా అదే పంధాలో ముందుకు సాగితే మున్ముందు కూడా వారికి ప్రజల చేతిలో భంగపాటు తప్పదు.
కాంగ్రెస్, తెదేపా, తెరాస, వైకాపా, భాజాపాలలో ఏ ఒక్క పార్టీ కూడా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, అరాచక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. మిగిలిన పార్టీల కంటే తాము ఈ రాష్ట్ర విభజన రేసులో ఎలాగ ముందుకు దూసుకుపోవాలనే తాపత్రయమే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ఉద్యమాల కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు గానీ పట్టించుకొనే స్థితిలో లేవు. కానీ ప్రజల కోసం, రాష్ట్రం కోసం అవి మొసలి కన్నీళ్లు కార్చడం మాత్రం మరిచిపోలేదు. దానిని ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారని భ్రమలో ఉన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికి బయలుదేరిన నేతలే ముందుగా తమ ఈ భ్రమలలోంచి బయటపడితే మేలు.
నిజంగా వారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోరేవారయితే, సీమంధ్రపై ఆధిపత్యం కోసం చేస్తున్నఈ పోరాటాలను ఆపేసి, విభజన అనివార్యం గనుక అది సజావుగా జరిగేందుకు ఏమిచేయవలసి ఉంటుందో అది చేయాలి. ఇప్పటికయినా విజ్ఞత ప్రదర్శించి ఇరుప్రాంత ప్రజలు నష్టపోకుండా విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు తమవంతు సహకారం అందించాలి. వీలయినంత త్వరగా రాష్ట్రంలో శాంతి నెలకొల్పే దిశగా ప్రయత్నించాలి. ఈ పని సవ్యంగా చేయగలిగితే ప్రజలే వారికి పట్టం కడతారు.
తమకు మేలుచేసేవారిని గుర్తించడంలో ప్రజలెన్నడూ పొరపడలేదు, పొరపాటు చేయలేదు. అదేవిధంగా తమని మోసం చేస్తున్న నేతలకి, పార్టీలకి తగిన విధంగా బుద్ధి చెప్పడం మరిచిపోలేదు. మన రాజకీయ నేతలు, వారి పార్టీలు ఈవిషయం ఎంత త్వరగా గ్రహిస్తే అది వారికి అంత మేలు చేస్తుంది.