రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరువు హుష్ కాకీ
రాష్ట్ర శాసనసభలో తెలంగాణా బిల్లుని వీలయినంత త్వరగా, వీలయినంత తక్కువ వ్యతిరేఖతతో ఆమోదింపజేసుకొనే ఏకైక లక్ష్యంతో హైదరాబాద్ లో దిగిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ కు, అందుకు అవసరమయిన ఎటువంటి చర్యలయినా తీసుకొనేందుకు సర్వాధికారాలు సోనియాగాంధీ కట్టబెట్టి పంపే ఉంటారు.
తన రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్నివిభజిస్తున్నకాంగ్రెస్ అధిష్టానం, అందుకోసం రాష్ట్రంలో తన స్వంత పార్టీనే పణంగా పెట్టడం ఆశ్చర్యమనుకొంటే, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ప్రాంతాలు, కులాల వారిగా విడదీసి పని చక్కబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ముందుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దారికి తెచ్చుకొనే ప్రయత్నం చేసారు. కానీ అది సఫలం కాకపోవడంతో అధిష్టానానికి విదేయులయిన వారి ద్వారా మిగిలిన వారిపై ఒత్తిళ్ళు తెస్తున్నట్లు సమాచారం.
సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులను నయాన్నోభయాన్నో లొంగ దీసుకొని దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులపై ఆశలున్నవారికి పదవులు, వాటికి లొంగని వారికి క్రమశిక్షణ చర్యల బెదిరింపులు ఉండనే ఉన్నాయి. రాయల సీమకు చెందిన కాంగ్రెస్ సభ్యులను దారికి తెచ్చుకొనగలిగితే, అధిష్టానం విధేయుల ద్వారా మిగిలిన వారిలో చాలా మందిని తనవైపు తిప్పుకోవచ్చని ఆయన వ్యూహం.
ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో సీమాంధ్ర నుండి కాంగ్రెస్-97, టీడీపీ-45 మరియు వైసీపీ-17 కలిపి మొత్తం 159 మంది సభ్యులు ఉండగా, తెలంగాణా నుండి కాంగ్రెస్- 49, టీడీపీ-34, టీఆర్ఎస్-17, బీజేపీ-03, సీపీఐ- 04, సీపీఎం-01, మజ్లిస్-07, ఇతరులు-04 కలిపి మొత్తం 119 మంది మాత్రమే ఉన్నారు.
శాసనసభలో బిల్లుపై ఓటింగ్ జరగకపోయినప్పటికీ, మెజార్టీ సభ్యులు బిల్లుని వ్యతిరేఖించినట్లయితే, బిల్లుపై రాష్ట్రపతి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది గనుక, కనీసం సభలో సగం మంది కంటే ఎక్కువ మంది బిల్లుకి అనూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు కనీసం మరో 50 మంది సభ్యుల మద్దతు అవసరమయినా ఉంటుంది గనుక, ముందుగా రాయలసీమ కాంగ్రెస్ సభ్యులని నయాన్నో భయాన్నో లొంగదీసుకొనే ప్రయత్నం చేయవచ్చును.
అయితే ఇంత కాలంగా శాసనసభకి బిల్లు వస్తే దానికి వ్యతిరేఖంగా ఓటువేస్తామని, ఓడిస్తామని ప్రజల ముందు ప్రగల్భాలు పలికిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆఖరినిమిషంలో దిగ్విజయ్ సింగ్ ఒత్తిళ్లకు లొంగి బిల్లుకి అనుకూలంగా ఓటు వేయకపోవచ్చును. ఒకవేళ అనుకూలంగా మాట్లాడదలచుకొన్నపటికీ, తమ తమ ప్రాంతాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేఖిస్తుంటే, తాము అనుకూలంగా మాట్లాడితే అది రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే గనుక, చాలా మంది సభ్యులు బిల్లుని వ్యతిరేఖించవచ్చును.
నాలుగు రాష్ట్రాలలో ఓటమితో క్రుంగి పోతున్నకాంగ్రెస్ అధిష్టానం, తమ స్వంత పార్టీ యంపీలే అవిశ్వాస నోటీసులు ఈయడంతో సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి. ఇప్పుడు సాక్షాత్ సోనియా దూతగా రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ మాట కూడా నెగ్గకపోతే, ఇక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరువు పూర్తిగా గంగలో కలిసిపోవడం ఖాయం.
అయితే బిల్లుకి సహకరించదలచకున్నవిదేయులయిన కాంగ్రెస్ నేతలు, బిల్లుకి వ్యతిరేఖంగా తమ వాదనలు వినిపించి, దానిపై అభిప్రాయాలు వ్యక్తం చేయవలసిన సమయంలో సభకు మొహం చాటేసి పరోక్షంగా సహకరించవచ్చును. కానీ, బిల్లుని ఏవిధంగానయినా అడ్డుకోవాలనే పట్టుదలతో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన అనుచరులు కూడా అటువంటి వారిని, మీడియా ద్వారా సీమాంధ్ర ద్రోహులనే ముద్ర వేస్తూ తమ దారికి తెచ్చుకొనే ప్రయత్నించవచ్చును.
ఇక ఈ బిల్లుని ఎంత త్వరగా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలా అని తెలంగాణా సభ్యులు ప్రయత్నిస్తే, వీలయినంత జాప్యం చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు గట్టిగా కృషి చేయడం ఖాయం. అందువల్ల రాష్ట్ర విభజన ప్రక్రియతో మొదలయిన ఈ సస్పెన్స్ పార్లమెంటులో ఆమోదం పొందేవరకు కూడా తప్పదు. ఇది ప్రజాభీష్టం మేరకు సాంకేతికంగా జరుగుతున్న ఒక రాజ్యంగా ప్రక్రియలా కాకుండా అనేక పార్టీల, నేతల స్వార్ధ రాజకీయ లబ్ది కోసం జరుగుతున్న పోరాటంలా మారడమే చాలా విషాదకరం.