కంట తడిపెట్టిస్తున్నఉల్లి రాజకీయాలు

 

కొండెక్కిన ఉల్లి ధర ఎన్నాళయినా దిగిరాక పోవడంతో ప్రజలు కంట తడిపెడుతున్నారు. ఒకప్పుడు కిలో పది-పదిహేను రూపాయలున్న ఉల్లి ధరలు నేడు రూ50-70మధ్యలో సెటిలయిపోయింది. సరయిన పంట దిగుబడి లేకపోవడం వలననే ధరలు పెరిగాయా? లేక దళారుల, నల్ల బజారు వ్యాపారుల చేతివాటం వలన పెరిగాయా? లేక ప్రస్తుతం ప్రభుత్వం నిద్రపోతుండటం వలననే పెరిగాయా?అని సామాన్యుడు ఆలోచిస్తుంటే, అంతకంటే ఇంకా పెద్ద కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.

 

కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ నాలుగు రోజుల క్రితం మరో నెల వరకు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని అన్నారు. ఆయన ఆ మాట అన్నకొద్ది గంటలలోపే ఉల్లి హోల్ సేల్ ధరలు రూ.47 నుండి అమాంతం రూ.58కి ఎగ బ్రాకాయి. తదనుగుణంగా రిటైల్ మార్కెట్లో రూ.65 నుండి 70కి పెరిగింది. అందుకు కారణం ఏమిటంటే, ఉల్లి, చెరుకు పంటలకు తల్లి వంటిదిగా చెప్పబడే మహారాష్ట్రలో శరద్ పవర్ కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది.

 

ధరల నియంత్రణ, సరఫరా తదితర అంశాలన్నీ దాని అదుపాజ్ఞలలోనే సాగుతుంటాయని, ప్రముఖ ఉల్లి మరియు దుంపల మార్కెట్ వ్యాపారి అశోక్ వాలున్జ్ మీడియాకు తెలియజేసారు. అందువల్లే శరద్ పవార్ మాటలు వ్యవసాయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఉల్లి రైతుకు కేజీకి రూ50 లాభం రావాలంటే రూ.60కి అమ్మకాలు జరుగుతాయని అతను తెలిపాడు.

 

మహారాష్ట్రలో శరద్ పవార్ తన పార్టీని బలపరచుకోవడానికే ఉల్లి రైతులకు పెద్ద ఎత్తున లాభాలు దక్కేందుకు ఈవిధంగా మార్కెట్ నియంత్రణ చేస్తుండవచ్చును. ఉల్లి ధరలు ఎంత పెరుగుతున్నపటికీ ఎగుమతులపై నిషేధం విదించబోమని ఆయన చెప్పడం కూడా బహుశః తన పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకొన్న రాజకీయ నిర్ణయమేనని భావించవచ్చును. శరద్ పవార్ ఇటీవల బియ్యం, పాల ఉత్పత్తులపై చేసిన వ్యాఖ్యల వలన, చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతున్న బియ్యం మరియు పాల ధరలు కూడా అకస్మాత్తుగా పెరిగాయి.

 

అంతిమంగా ఇది జాతీయ రాజకీయాలపై సైతం పెను ప్రభావం చూపబోతోంది. ఈ డిశంబరు నెలలో జరుగనున్న ఐదు రాష్ట్రల ఎన్నికలలో పెరిగిన ఉల్లి ధరలు అధికార పార్టీలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. గతంలో(1998) బీజేపీ ప్రభుత్వం కూడా ఉల్లి ఘాటు తట్టుకోలేక కుప్పకూలింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్నిఎన్నికల ముందు పెరిగిన ఉల్లి ఘాటు చాల కలవర పెడుతోంది. అందుకే వెంటనే ఉల్లి ధరలను నియంత్రించేందుకు తగు చర్యలు చేప్పటింది.