కులం పేరు చెప్పుకొని...
అగ్రవర్ణస్తులు రాష్ట్ర విభజన జరిగితే తమ పెత్తనం పోతుందనే భయంతోనే విభజనను వ్యతిరేఖిస్తున్నారని కాంగ్రెస్ యంపీ మధుయాష్కీ ఒక సరికొత్త సిద్దాంతం ప్రతిపాదించారు. దానికి సదరు నేతలు అంగీకరిస్తారో లేదో కానీ, రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా ఈ సమస్య ఉంటుందని తెలంగాణా నేతలు ఇప్పటికే గ్రహించారు. అందుకే వారు ఇప్పుడు సామాజిక తెలంగాణా, ఆత్మగౌరవం వంటి పదాలు తరచూ వల్లె వేస్తున్నారు.
వారి ఆవేదన, ఆక్రోశం అర్ధం చేసుకోదగ్గదే. కానీ, వారి బాధ తమ కులస్తులందరికీ అన్యాయం జరుగుతోందని కాదు. కేవలం తమకి అన్యాయం జరుగుతోందని మాత్రమే. తమకు రాజకీయంగా అన్యాయం జరిగినట్లయితే, అది తమ కులస్తులందరికీ అన్యాయంగా మాట్లాడుతారు. తమకు అధికారం, పదవులు దక్కితే తమ కులస్తులందరికీ న్యాయం జరిగినట్లు ప్రజలని భావించమంటారు. దానివల్ల సదరు కులానికి చెందినా ప్రజలకి ఏవిధంగా లాభమో వారే చెప్పాలి.
సదరు వెనుకబడిన కులాలకు చెందిన రాజకీయ నేతలు పదవులు, అధికారం, డబ్బుఅన్నీ ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకొన్నప్పటికీ, కుల ప్రాతిపదికన తమకు రాజకీయ న్యాయం జరగాలని ఆశించడం రాజకీయాలలో రిజర్వేషన్స్ వంటివే. అయితే ఆ రిజర్వేషన్స్ వారి కులస్తులందరికీ కాక కేవలం తమకి, తమ కొడుకులకి మాత్రమే వర్తించాలని వారి ఆరాటం. తమ స్థానంలోకి తమ సంతతికి తప్ప వేరెవరికీ ప్రవేశించే హక్కు ఉండదని వారి దృడ నమ్మకం.
అందుకే ఒక రాజకీయ నేత రాజకీయాలను తప్పుకొనకముందే తన స్థానంలోకి తన కొడుకుని కూర్చోబెట్టి మరీ తప్పుకొంటాడు. మన రాజకీయపార్టీలు కూడా, వారి కొడుకులకి, వారి మనుమలకే టికెట్స్, పదవులు ఇస్తూ తాము అన్ని కులాలవారికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నామని చెపుతూ ప్రజలని మభ్యపెడుతున్నాయి.
అయితే ఇటువంటి స్వార్ధ రాజకీయ నేతలు ఏ కులానికి చెందినవారయినా వారి వల్ల సదరు కులస్తులకి ఎటువంటి ప్రయోజనమూ, ఉపకారము ఉండదు. నిజం చెప్పాలంటే అటువంటి నేతలు ‘స్వార్ధ కులానికి’ చెందిన నేతలగానే ప్రజలు పరిగణించాలి. రాజకీయంగా పైకి ఎదిగిన తరువాత కూడా తాము ఇంకా ఇంకా పైకి ఎదగాలని అనుకొంటారే తప్ప, కటిక దరిద్రం అనుభవిస్తున్న తమ కులస్థుల జీవితాలలో వెలుగులు నింపే ఎటువంటి ప్రయత్నాలు చేయరు. తమ కులస్తులు రాజకీయంగా గానీ, సామాజికంగా గానీ, విద్యా,ఉద్యోగపరంగా గానీ పైకి ఎదిగేందుకు సదరు నేతలు ఎటువంటి సహాయసహకారాలు అందించరు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోబడిన వారు, కనీసం చిత్తశుద్ధితో తమ కర్తవ్యం నిర్వహించి, తమ నియోజక వర్గాల అభివృద్ధి చేయాగలిగినా నేడు మన రాష్ట్రం, దేశం ఈ పరిస్థితిలో ఉండేది కాదు. ఈ కుల ప్రస్తావనలు ఉండేవి కావు. రాష్ట్ర విభజన ప్రస్తావన మొదలయినప్పటి నుండి ప్రజా ప్రతినిధులు తమ కర్తవ్యం పక్కనపెట్టి, ఉద్యమాలు, ఆందోళనలు, సభలు, సమావేశాలు చేసుకొంటూ, డిల్లీ పర్యటనలు చేస్తూ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుంటే వారిని ప్రశ్నించే నాధుడు లేడు.
స్వార్ధమే కులంగా ఎదిగిన నేతలు, ప్రజాప్రతినిధులు, నేటికీ తమ కులం పేరు చెప్పుకొని రాజకీయంగా మరింత ఎదగాలని ప్రయత్నిస్తుంటే, వారికి పదవులు, అధికారం దక్కకపోతే ప్రజలు తమకే అన్యాయం జరిగిందని భావించడం విచారకరం.