పాక్ ఉగ్రవాదానికి భారీ మూల్యం చెల్లిస్తున్నప్రపంచ దేశాలు

 

ఏ విత్తనము వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది తప్ప వేరే మొక్క మొలవదు. ఉగ్రవాదానికి బీజం వేసిన పాకిస్తాన్లో ఇప్పుడు అది మర్రి చెట్టులా వ్యాపించి పొరుగునున్న భారత్, నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలనే కాక స్వయంగా పాకిస్తాన్ ప్రజల ప్రాణాలని కూడా బలిగొంటోంది. పాముతో సహవాసం చేసే వ్యక్తి ఏదో ఒకనాడు పాము కాటుకే బలయిపోయినట్లే, ఉగ్రవాద సర్పాన్నిపెంచి పోషిస్తున్నపాకిస్తాన్, అందుకు ప్రతిగా తన ప్రజల ప్రాణాలను పణంగా పెట్టక తప్పడం లేదు.

 

నిన్న పెషావర్ లో ఆల్ సెయింట్స్ చర్చ్ లో ఆదివారం ప్రార్ధనలు ముగించుకొని వస్తున్నక్రీస్టియన్ భక్తులపై ఇద్దరు తాలిబాన్ మానవ బాంబులు జరిపిన దాడిలో దాదాపు 70మంది అక్కడికక్కడే చనిపోగా మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇంతవరకు ముస్లిం ప్రజలపైన చాలా సార్లు దాడులు చేసి వేలాది మందిని పొట్టన బెట్టుకొన్నారు. కానీ ఈసారి పాకిస్తాన్ లో మైనార్టీ వర్గానికి చెందిన క్రీస్టియన్ మతస్థులపై దాడిచేసారు.

 

ఇక శనివారంనాడు కెన్యా రాజధాని నైరోబీలో సోమాలియాకు చెందిన 15 మంది ‘అల్-సబాబ్’ ఉగ్రవాదులు వెస్ట్-గేట్ అనే ఒక షాపింగ్ మాల్ పై చేసిన దాడిలో వివిధ దేశాలకి చెందిన దాదాపు 69మంది ప్రజలు చనిపోగా, మరో 175మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉగ్రవాద ముఠా మూలాలు కూడా పాకిస్తాన్ లోనే ఉన్నాయి. పాకిస్తాన్ దేశానికి చెందిన అబూ మూస మోంబస అనే ఉగ్రవాది సోమాలియా ఉగ్రవాదులకు శిక్షణ, మార్గదర్శకత్వం వహించినట్లు ప్రాధమిక నివేదికలు స్పష్టం చేసాయి.

 

ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ ఉగ్రవాదులు దాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లోనే కనబడుతున్నాయి. ఇటీవల జాతీయ దర్యాప్తు బృందం భారత్ లో పలు బాంబు దాడులు చేసిన ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, తబ్రీజ్ లను అరెస్ట్ చేసినప్పుడు, వారు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు, పాకిస్తానీ గూడ చార సంస్థ ఐ.య.స్.ఐ. ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని స్పష్టం చేసారు.

 

పాకిస్తాన్ 1947లో స్వాతంత్రం పొందిన నాటి నుండి ఇంతవరకు సాధించిన అభివృద్ధి ఏమీ లేకపోయినప్పటికీ, ప్రపంచ ఉగ్రవాద రాజధానిగా ప్రసిద్ధి పొందింది. ఇందుకు ప్రధాన కారణం అక్కడి సైనిక వ్యవస్థ, గూడచార వ్యవస్థలలోగల అతివాదులయిన అధికారులు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వాలపై పెత్తనం చేయడమే. అందువలన ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలు అసమర్ధ ప్రభుత్వాలుగా మిగిలిపోయి, దేశం అభివృద్ధికి నోచుకోలేదు. సైనికుల చెప్పు చేతలలో నడిచే పాకిస్తాన్ ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు వారు ఆడించినట్లే ఆడుతూ ఉగ్రవాద ముటాలను ఉపేక్షించవలసి వస్తోంది. తత్ఫలితంగా స్వయంగా పాకిస్తాన్ తో బాటు ప్రపంచ దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించవలసి వస్తోంది.

 

తన ఆధునిక ఆయుధ సంపత్తితో పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్నిమట్టు బెట్టేయగలనని భ్రమలోఉన్న అమెరికా ఆ దేశానికి ఒక వైపు కోట్లాది డాలర్లు ధన సహాయం చేస్తూనే, మరో వైపు బాంబుల వర్షం కురిపిస్తూ ద్వంద విధానం అవలంభించడం వలన అక్కడి పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. పాకిస్తాన్ లో రాజకీయంగా స్థిరత్వం నెలకొని, అది అబివృద్ధి బాట పట్టే వరకు ప్రపంచ దేశాలకు ఈ ఉగ్రవాద బెడద తప్పదు.