ఏపీ ఎన్జీవోలు, తెలంగాణావాదుల పోరాటం దేనికోసం

 

రేపు హైదరాబాదులో ఏపీ యన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట సభ నిర్వహించాలనుకోవడం, దానిని అడ్డుకొనేందుకు తెలంగాణావాదులు బంద్ కు పిలుపునీయడం వారివారి అందోళనలకు అద్దం పడుతున్నాయి. ఏపీ యన్జీవోలు హైదరాబాదులోనే సభ నిర్వహించాలనుకోవడానికి ప్రధాన కారణం అక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులకు, నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలకు దైర్యం కలిగించడం, తెలంగాణవాదులకు తమ శక్తిని ప్రదర్శించి తాము ఎవరి బెదిరింపులకీ భయపడమని తెలియజేయడానికేనని భావించవచ్చును. కేవలం ఉద్యోగుల సమస్యలను చర్చించడానికే అయితే, ఈ సభను ఆంధ్ర ప్రాంతంలో మరెక్కడయినా పెట్టుకోవచ్చును.

 

రాష్ట్ర విభజన జరిగిన తరువాత తమకు ఉద్యోగపరంగా అనేక సమస్యలు వస్తాయని ఏపీ యన్జీవోలు ఆందోళన చెందడం సహజమే. ఒక ప్రభుత్వ హయాములో పని చేస్తున్నపుడే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక విభజన జరిగితే రెండు ప్రభుత్వాలు తమ జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకొంటాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో టీ-యన్జీవోలు కూడా వారి పరిస్థితి పట్ల సానుకూలంగానే ప్రవర్తిస్తున్నారు.

 

అయితే, ఏపీ యన్జీవో నేతలు రాజకీయంగా వాదిస్తుండటంతో వారి సభకు అభ్యంతరం చెపుతున్నారు. ఏపీ యన్జీవోలు ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించకుండా, ఆ సాకుతో రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని చెప్పడం వారి ఆగ్రహానికి కారణం అవుతోంది. కొందరు సీమంధ్ర రాజకీయ నేతల ప్రోద్బలంతో, వారి వ్యూహంలో భాగంగానే ఏపీ యన్జీవోల ఈ సభ జరుగుతోందని తెలంగాణావాదులు అనుమానిస్తున్నారు.

 

ఏపీ యన్జీవోలకు రాష్ట్ర విభజనను అడ్డుకొనేంత శక్తి లేదనే సంగతి ఇరుప్రాంత యన్జీవోలకి బాగా తెలుసు. అయినా, ఒకరు విభజనను అడ్డుకొంటామని హుంకరించడం, దానికి అంతే ధీటుగా మరొకరు జవాబు చెప్పడం కేవలం ఇరువర్గాల నేతల భేషజాల వల్లనే జరుగుతోంది.

 

వారిరువురి వాదనలలో ‘రాష్ట్ర విభజన’, ‘ఉద్యోగుల హక్కులు’ అనే రెండు అంశాలు మాత్రమే పైకి వినిపిస్తున్నపటికీ, వారి అసలు పోరాటం మాత్రం హైదరాబాద్ గురించేనన్నది బహిరంగ రహస్యమే. హైదరాబాదు, దాని ఆదాయంపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని భావిస్తున్న సీమంద్రా ప్రాంత ఉద్యోగులు, ప్రజలు ఆవిషయాన్నీ మరింత బలంగా నొక్కి చెప్పడానికే ఈ సభను నిర్వహిస్తున్నారనేది కాదనలేని విషయం. సరిగ్గా ఇదే అంశంపై వారిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నతెలంగాణావాదులు ఏపీ యన్జీవోల సభను అడ్డుకోవాలని భావిస్తున్నారు.

 

ఇటువంటి ఆలోచనలను మొగ్గ దశలో త్రుంచి వేయకపోయినట్లయితే, సీమంధ్ర రాజకీయ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హైదరాబాదుపై వారికి అనుకూల నిర్ణయం వచ్చేలా ఒప్పించే ప్రమాదం ఉందని తెలంగాణావాదుల ఆందోళన చెందుతున్నారు. అంటే, ఇరువర్గాల నేతలు నిర్వహించదలచిన ఈ పోటాపోటీ కార్యక్రమాల వెనుక అసలు కారణం కేవలం హైదరాబాదు అంశమేనని అర్ధం అవుతోంది.

 

అయితే ఇటువంటి సంక్లిష్టమయిన అంశంపై పోటాపోటీగా బహిరంగ సభలు,ర్యాలీలు, బందులు చేయడంవలన సమస్య మరింత జటిలం అవుతుంది తప్ప ఎటువంటి పరిష్కారం దొరకదు. ఇటువంటి సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకోవలసి ఉంటుందని వారికీ తెలుసు.

 

ఇంత కాలం యావత్ రాష్ట్రాన్ని ఎంతో సమర్ధంగా నడిపిన ప్రభుత్వోద్యోగులు, తమ పంతాలను, భేషజాలను పక్కన బెడితే ఇప్పుడు తమ స్వంత సమస్యలను కూడా అవలీలగా పరిష్కరించుకోగలరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఇరుప్రాంత ఉద్యోగులు చిరకాలం కలిసి పనిచేయక తప్పదనే సంగతి వారికీ తెలుసు. ఇంతకాలం ఒకే కుటుంబ సభ్యులవలే కలిసిమెలిసి పనిచేసిన వారు, స్వార్ధ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడే రాజకీయ చదరంగంలో పావులుగా మారకుండా జాగ్రత్త పడాలి.

 

అదేవిధంగా ఇరు ప్రాంతాల ఎన్జీవో నేతలలో సమస్యలు సృష్టిస్తున్నకొందరు అతివాదులను గుర్తించి అటువంటి వారిని దూరంగా పెట్టగలిగితే సమస్యలు చాల వరకు సానుకూలంగా పరిష్కరించుకొనే అవకాశముంటుంది.