సోనియాపై అంత కోపమేలనయా బాబు
posted on Sep 5, 2013 @ 12:29PM
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రలోవిభజనపై తన పార్టీ వైఖరిని ప్రజలకు వివరించి, తమపార్టీపై కాంగ్రెస్, వైకాపాలు చేస్తున్న దుష్ప్రచారాన్నిఅడ్డుకొనే ప్రయత్నం చేస్తారని అందరూ ఊహించారు. కానీ ఆయన తన యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, ఆమె కుమారుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర పదజాలంతో దాడిచేస్తు అసలు సంగతి పక్కన బెడుతున్నారు.
“బ్రిటిష్ వారిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చినకాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల నెత్తిన ఇటలీ పాలనను రుద్దుతోందని, ఆమె దేశాన్ని కొల్లగొట్టి సంపదను ఇటలీకి విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. రూపాయి పతనానికి ఆమె ముఖ్య కారణమని, దేశాన్ని సర్వ విధాల భ్రష్టుపట్టించిన ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మన రాష్ట్రాన్ని కూడా ముక్కలు చెక్కలు చేసి, అన్నదమ్ములవంటి తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిందని ఆరోపించారు. ఆమె తన కొడుకు రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రిగా పట్టం కట్టేందుకే, రాష్ట్రాన్ని రెండుగా చీల్చి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేశాన్ని, రాష్రాన్ని సర్వ నాశనం చేస్తున్నకాంగ్రెస్ పార్టీని రెండు ప్రాంతాలలో ప్రజలు తరిమికొట్టాలని” ఆయన పిలుపునిచ్చారు.
ఆయన చేస్తున్నఈ ఉపన్యాసాలు వింటే ఎవరికయినా ఇటీవల హైదరాబాదులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసం గుర్తుకు రాకమానదు. తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ తారక రామారావు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖించేవారని, తెదేపా కూడా ఆయన అడుగుజాడలలో నడిచి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి పారద్రోలాలని మోడీ కోరారు. తద్వారా బీజేపీ తెదేపాతో ఎన్నికల పోత్తులకు ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేసారు. అయితే తెదేపా వెంటనే స్పందించక పోయినప్పటికీ, ఆయన ప్రతిపాదనను ఖండించలేదు కూడా. ఇప్పుడు చంద్రబాబు సరిగ్గా మోడీ రూట్ లోనే పయనిస్తున్నారు.
ఇక చంద్రబాబు ఆగ్రహం వెనుక అందరికీ తెలిసిన మరో బలమయిన కారణం కూడా ఉంది. అదే రాష్ట్ర విభజన. ఏడెనిమిది మాసాలు ఎంతో ప్రయాసపడి పాదయాత్ర చేసి రాష్ట్రంలో పార్టీని మళ్ళీ బలపరుచుకొంటే, కాంగ్రెస్ ఒకే ఒక ప్రకటనతో ఆయన శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చింది. ఇక విభజన వల్ల రెండు ప్రాంతాలలో పార్టీ ఉనికికి కూడా ప్రమాదం ఏర్పడింది. కాంగ్రెస్, తెరాసలు చేతులు కలిపితే తెలంగాణాలో తెదేపా పరిస్థితి మరీ దయనీయంగా మారనుంది.
ఇక సీమంధ్రలో చాలా బలంగా ఉన్నామని భావిస్తున్నతరుణంలో విభజన ప్రకటనతో, వైకాపాతో పోటీ పడవలసిన అగత్యం ఏర్పడింది. సరిగ్గా ఎన్నికల ముందు తమ పార్టీని అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్ మీద, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మీద చంద్రబాబుకి ఆగ్రహం కలగడం సహజమే.