ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యమేనా
posted on Sep 10, 2013 @ 12:09PM
సీమంద్రాలో గత నలబై రోజులుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు, ఇటీవల హైదరాబాదులో ఏపీ యన్జీవోలు పెద్ద ఎత్తున నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి జారీ అయిన హెచ్చరికల నేపధ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం ఏప్రిల్లో జరుగనున్నసాధారణ ఎన్నికలలోగా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేస్తుందా లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి.
రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణాలో విజయం ఖాయం అనుకొన్నపటికీ, సీమాంధ్రలో మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని, సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ హెచ్చరిస్తున్నందున, కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల ముందుగానే రాష్ట్రవిభజన చేసే సాహసం చేయకపోవచ్చును. మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమయిన దాదాపు 30 సీట్లను అందించే సీమాంధ్రాను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయలేదు.
అలాగని విభజన చేయకపోతే తెలంగాణాలో దెబ్బ తినడం ఖాయం. ఎన్నికలలోగా విభజన ప్రక్రియ పూర్తిచేయకపోయినట్లయితే, అది తెరాసకు చాలా మేలు చేకూర్చడం ఖాయం. అందువల్లనే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన తరువాతనే తెరాస విలీనం అని మెలిక పెడుతున్నాడు. ఒకవేళ ఏ కారణంగానయినా కాంగ్రెస్ పార్టీ గనుక పార్లమెంటులో బిల్లు పెట్టలేకపోయినట్లయితే, కేసీఆర్, తెలంగాణా సెంటిమెంటుతో ఎన్నికల బరిలోకి దూకి తను కోరుకొంటున్నట్లుగా 15/100 యంపీ, యంయల్యే సీట్లను కైవసం చేసుకొనే ప్రయత్నాలు తప్పక చేస్తాడు. తద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారి మరింత ఇబ్బందికరమయిన పరిస్థితులను సృష్టించే ప్రమాదం ఉంది.
అందువలన రెండు ప్రాంతాలలో విజయం సాధించేందుకుగాను తెలంగాణా ప్రక్రియను మెల్లగా కొనసాగిస్తూ, షిండే, దిగ్విజయ్ సింగ్ వంటి వారితో తెలంగాణా ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు ఒకవైపు ప్రకటనలు చేయిస్తూనే, పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టకుండానే తెరాసను విలీనం కోసం ప్రయత్నించి, ఆ తరువాతనే కాంగ్రెస్ ఎన్నికలకి సిద్దపడవచ్చును. మరోవైపు సీమాంద్రా నేతలకు ఇప్పుడప్పుడే రాష్ట్ర విభజన ఉండబోదని నమ్మకం కలిగించేందుకు అంటోనీ కమిటీకి అదనంగా మరో కమిటీ కూడా వేసి వాటితో ఎన్నికలు పూర్తయ్యేవరకు కాలక్షేపం చేయవచ్చును. ఏమయినప్పటికీ ఎన్నికలు పూర్తయ్యేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరుగకపోవచ్చును.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో గెలిస్తే, తెలంగాణా ఏర్పాటు చేసిన ఖ్యాతిని స్వంతం చేసుకోగలదు. ఒకవేళ బీజేపీ చేతిలో ఓడిపోయినట్లయితే, రాష్ట్ర విభజనను వ్యతిరేఖంగా సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, తన పార్టీ నేతలు చేస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలను మరింత ఉదృతంగా సాగేలా ప్రోత్సహిస్తూ, తాను ఇంతకాలం ఎదుర్కొన్న సంకట పరిస్థితులనే బీజేపీకి కూడా కల్పించే ప్రయత్నమే చేయవచ్చును.
ఆంధ్రా, తెలంగాణా రెండు ప్రాంతాల ప్రజలు కూడా గత రెండు మూడేళ్ళుగా రాష్ట్రంలో అస్తవ్యస్తంగా సాగుతున్నకాంగ్రెస్ పార్టీ పాలనతో చాలా విసుగెత్తిపోయున్నారు. గనుక, ఆ పార్టీ రాష్ట్ర విభజన చేసినా చేయకున్నాతిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. తెలంగాణాలో తెరాసకు, సీమాంధ్ర లో తెదేపా, వైకాపాలకు ఈ సారి ప్రజలు అవకాశం ఇవ్వవచ్చును. తెదేపా, తెరాసాలు గెలిస్తే బీజేపీతో, తెరాస, వైకాపాలు గెలిస్తే కేంద్రంలో బలాబలాలను బట్టి కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టవచ్చును.