రాజకీయాలతో పొద్దుపుచ్చుతున్న కిరణ్ సర్కార్
రాష్ట్రంలో ప్రజలని తామే ఉద్దరించేస్తున్నట్లు తమ భుజాలు తామే చరుచుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆపదలో చిక్కుకొన్న తెలుగువారిని రక్షించడానికి మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రలో చిక్కుకొన్న గుప్పెడు తెలుగు ప్రాణాలు రక్షించడం కంటే, రాబోయే ఎన్నికలలో తమకు ఓట్లు రాల్చే ‘బంగారు తల్లి’ వంటి పధకాలను ఆమోదించుకోవడమే ఎక్కువ లాభాదాయకమనే ఆలోచనతో, ఆ బాధ్యతలను అధికారులకు వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం తాపీగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకొంది. అధికారులు కూడా తన సహజ సిద్దమయిన నిర్లక్ష్య వైఖరితో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్నప్పుడు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తే గానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అధికారులలో కదలిక రాలేదు.
ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ముందుగా చొరవ తీసుకొని భాదితులకు అండగా నిలబడటంతో, మండిపడిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇటువంటి విషయాలలో రాజకీయాలు చేయడం తగదంటూ ఒక ఉచిత సలహా పడేసి చేతులు దులుపుకొన్నారు. “బాధితులకు వారి కష్ట కాలంలో సహాయం చేయడం రాజకీయమే అయితే, అటువంటి రాజకీయం చేయడానికి తామెప్పుడు ముందుంటామని” యువనాయకుడు లోకేష్ ధీటుగా బదులిచ్చారు. ఆయన మాటలు అన్నిపార్టీలకు అక్షరాల ఆచరణాత్మకం.
తెదేపా సహాయ కార్యక్రమాల వెనుక రాజకీయ ఆలోచనలు ఉన్నాయా లేవా? అనే సంగతిని పక్కన బెడితే, ఆపదలో ఉన్న సాటి తెలుగువారిపట్ల ఆ పార్టీ నేతలు కార్యకర్తలు చూపుతున్న ఔదార్యం ప్రశంసనీయం.
ప్రతిపక్షాల పోరు పడలేకనో, లేక విమర్శలకు జడిసో మొత్తం మీద శాసన సభ సమావేశాలు ముగిసిన తరువాత, పరిస్థితిని సమీక్షించేందుకు తాపీగా ముగ్గురు మంత్రులను పంపి చేతులు దులుపుకొంది ప్రభుత్వం. వారు డిల్లీ వెళ్లి చేసింది ఏమిలేదు. ఇప్పటికీ, వారు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు.
ఈ లోగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన అనుచరులు బాధితులకు యధా శక్తిన సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్న ఆంధ్రా భవన్ లో ఉన్నభాధితులకువారు అండగా నిలబడటమే కాకుండా ఒక్కొకరికీ రూ.10,000 చొప్పున మొత్తం 74మందికి రూ.ఏడున్నర లక్షలు వారి మందులు, ఆహరం, ప్రయాణ ఖర్చుల నిమితం అందజేశారు.
శాసన సభ సమావేశాలు ముగిసిన తరువాత ఒక్కో శాసన సభ్యుడికి రూ.47,000 విలువ చేసే టాబ్లెట్ పీసీలు, దాదాపు 20,000 విలువ చేసే ఇతర బహుమానాలు అందజేసిన ప్రభుత్వం, బాధితులకి మాత్రం ఒక్కొకరికి రూ.2000 చొప్పున విదిలింఛి చేతులు దులుపుకొంది. ఇటువంటి సమయంలో కూడా రాజకీయాల గురించి మాట్లాడుతూ సమీక్షలతో కాలక్షేపం చేస్తూ ప్రభుత్వం అందులో పెద్దలు అత్యంత అమానవీయంగా, చాలా క్యాజువల్ గా ప్రవర్తిస్న్నారు.
అక్కడ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా డిల్లీలో నిలబడి సహాయ చర్యలు పర్యవేక్షిస్తూ, బాధితులకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ హైదరాబాదు తరలిస్తుంటే, హైదరాబాదు వస్తున్న బాధితులని రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయంలో రిసీవ్ చేసుకొంటున్న తెదేపా యువనాయకుడు లోకేష్ మరియు పార్టీ కార్యకర్తలు వారికి ప్రత్యేక బస్సులు, వ్యానులు ఏర్పాటు చేసి వారి వారి స్వస్థలాలకు తరలిస్తూ వారి అభిమానం చురగగొంటున్నారు.
ఇటువంటి ఆపద సమయంలో కూడా ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ నేతలు గానీ కనీస స్పందన చూపకపోవడం చాలా ఘోరం. తెదేపా తన యన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్య బృందాన్ని డిల్లీ పంపితే వారిని అనుమతించకుండా అడ్డుపడటం మరీ దారుణం. పార్టీలకతీతంగా అందరూ చేతులు కలిపి భాదితులను ఆదుకోవలసిన ఈ తరుణంలో ఈవిధంగా డిల్లీలో చేరి రాజకీయాలు చేయడం చాలా హేయం. అధికారంలో ఉండి తాము చేయలేని పనిని తెదేపా చొరవ తీసుకొని చేస్తున్నపుడు, ఆ పార్టీ నేతలతో చేతులు కలిపి సహాయ కార్యక్రమాలలో పాల్గొనకపోయినా, కనీసం వారికి అడ్డుపడకుండా ఉంటే అదే పది వేలని హైదరాబాద్ చేరుకొంటున్న బాధితులు అనడం కాంగ్రెస్ నైజానికి అద్దం పడుతోంది.
తెదేపా రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తుంటే, తెదేపా నేతలు మాత్రం ఉడత భక్తిగా సహాయ కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. ప్రార్దించే పెదవుల కంటే, సాయం చేసే చేతులే మిన్న అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తుకు చేసుకొంటే మంచిది.