టీ-నేతల వైఖరిలోమార్పుతో సమైక్యవాదులకు మేలు!

 

ఇటీవల హైదరాబాదులో ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభతో ఉలిక్కిపడిన తెరాస, టీ-జేఏసీ, టీ-ఎన్జీవో నేతలు మొన్న తెరాస నేత కేశవ్ రావు ఇంట్లో సమావేశమయినప్పుడు, కేంద్రం రాష్ట్ర విభజన చేస్తూ, హైదరాబాదును రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటన చేసినప్పుడు, హైదరాబాదు విషయంలో తాము చాలా సానుకూలంగా స్పందించడం వలననే, సీమాంధ్ర నేతలు, యన్జీవోలు ఇంత దైర్యంగా హైదరాబాదులో సభ పెట్టి హైదరాబాదుపై హక్కులు కోరగలిగారని అభిప్రాయపడ్డారు. అందువలన హైదరాబాద్ విషయంలో మునుపటి వైఖరిని మార్చుకొని, హైదరాబాదులో సీమాంధ్ర ప్రభుత్వం నడుపుకొనేందుకు కేటాయించబడే బిల్డింగ్స్ ఉన్నపరిమిత ప్రాంతాన్నిమాత్రమే ఉమ్మడి ప్రాంతంగా చేసి, హైదరాబాదులో మిగిలిన ప్రాంతాలను బేషరతుగా తెలంగాణా రాష్ట్రానికే చెందేలా చేయమని కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధాని విషయంలో కేంద్రం చేసే ఎటువంటి ప్రతిపాదనలను అంగీకరించకూడదని నిర్ణయించుకొన్నారు. తద్వారా, ఇక ముందు హైదరాబాద్ విషయంలో సీమాంధ్ర నేతలు, ఉద్యమాకారులు ఎవరూ కూడా ఎటువంటి డిమాండ్స్ చేయకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకొన్నారు.

 

అయితే, ఇటీవల హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ గురించి తమ వద్ద మూడు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒకటి లేదా రెండు అమలుచేసే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై చాలా లోతుగా అధ్యయనం చేసామని చెపుతున్న కేంద్రానికి, హైదరాబాద్ పీటముడి గురించి తెలిసి ఉన్నపటికీ, జరుగుతున్నఈ పరిణామాలన్నిటినీ చూస్తే చాలా అనాలోచితంగా ముందుకు సాగినట్లు అర్ధమవుతోంది. కనీసం ఇప్పటికయినా ఈ సమస్యను సామరస్యంగా ఏవిధంగా పరిష్కరించాలనే విషయంపై కేంద్రానికి ఎటువంటి అవగాహన లేనట్లు షిండే మాటల ద్వారా అర్ధం అవుతోంది.

 

ఇక ఇప్పుడు తెలంగాణా నేతలు హైదరాబాదుపై తమ వైఖరి మార్చుకోవాలని నిశ్చయించుకోవడంతో ఈ సమస్య మరింత జటిలం కాకమానదు. ఇటీవల ఏపీఎన్జీవోల సభ తెలంగాణావాదులలో ఐఖ్యతకు దోహదపడినట్లే, ఇప్పుడు వారు తీసుకొన్నఈ కొత్త నిర్ణయం, విభజనను వ్యతిరేఖిస్తున్న సమైక్యవాదులకు పరోక్షంగా మేలు చేస్తుందని చెప్పవచ్చును.

 

హైదరాబాదుపై సమాన హక్కులు కోరుతున్న సీమాంధ్ర నేతలు, యన్జీవోలు, ప్రజలు ఇప్పుడు తెలంగాణా నేతలు తీసుకొన్నఈ నిర్ణయంతో రాష్ట్ర విభజనను మరింత గట్టిగా వ్యతిరేఖించడం ఖాయం. హైదరాబాదు అంశం తేలేవరకు విభజన జరుగకుండా వారు కేంద్రంపై ఒత్తిడి తేవడం ఖాయం. గనుక, రాష్ట్ర విభజన ప్రక్రియకు మళ్ళీ బ్రేకులుపడినా ఆశ్చర్యం లేదు.

 

ఈ పరిణామాలు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించవచ్చును. రానున్న ఎన్నికలలోగా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనను అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించలేకపోయినట్లయితే అందుకు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాలలో భారీ మూల్యం చెల్లించక తప్పదు.