విభజన కొరివితో తల గోక్కొంటున్న కాంగ్రెస్
posted on Sep 16, 2013 @ 5:06PM
రాష్ట్ర విభజనపై మూడడుగులు ముందుకి ఆరడుగులు వెనక్కన్నట్లు వ్యవహరిస్తున్నకాంగ్రెస్, రాష్ట్రాన్నిరావణ కాష్టంగా మార్చి,అందులోతను కూడా తగలబడిపోతోందని రాష్ట్రంలో ఉభయ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఏమి చేస్తే ఏమవుతుందో అనే భయంతో విభజన ప్రకటన చేసిన 45 రోజుల తరువాత కూడా కాంగ్రెస్ అధిష్టానం అడుగు ముందుకు కదపలేకపోతోంది.
విభజన ప్రకటన చేసి రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలను చావు దెబ్బ తీయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తను త్రవ్వుకొన్నగోతిలో తనే పడినట్లయింది. ప్రకటన చేయగానే రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల నుండి తమ పార్టీలోకి భారీగావలసలు మొదలవుతాయని, అప్పుడు రెండు రాష్ట్రాలలో తమ పార్టీకి తిరుగుఉండదని భావించింది.
కానీ ఊహించని విధంగా వైకాపా సమైక్య ఉద్యమం రాజేయడం, ప్రజలు, ఉద్యోగులు కూడా ఉద్యమబాట పట్టడం, స్వంత పార్టీలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరూ తిరుగుబాటు జెండా ఎగురవేయడం వంటివి కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసల సంగతి దేవుడెరుగు ముందు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగులుతుందా? అనే అనుమానాలు స్వయంగా ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు అయితే మరో అడుగు ముందుకు వేసి, వచ్చే ఎన్నికలలో తెదేపా భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇదేవిధంగా తెలంగాణా ప్రక్రియను మరింత జాప్యం చేసినట్లయితే త్వరలో తెలంగాణాలోను పార్టీ మూతపడటం ఖాయమని అక్కడి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు.
తెలంగాణాపై నిర్ణయం తీసుకొంటున్నసమయంలో తెరాసను పక్కనబెట్టడం ద్వారా దానిపై పూర్తి ఆధిక్యత సంపాదించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రక్రియలో జరుగుతున్నజాప్యంతో మళ్ళీ క్రమంగా తెరాస బలపడుతోందని, అదే జరిగితే రేపు కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటు చేసినా కూడా దాని ప్రయోజనం తెరాసకే దక్కుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉండబోదని, అప్పుడు ఇటు తెలంగాణాలో, అటు సీమాంధ్రలో రెండు ప్రాంతాలలో పార్టీకోలుకొని విధంగా దెబ్బతినడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు.
అయితే, హైదరాబాద్ వంటి సంక్లిష్టమయిన అంశాలపై ఎటువంటి ప్రణాళిక, ముందు చూపు లేకుండా మొండిగా ముందుకు సాగినందుకు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకొని కూర్చొంది.
కానీ ఈ జాప్యానికి కారణం తమ ఒత్తిడేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలతో కాంగ్రెస్ మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కేవలం సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు లొంగిపోవడం వలననే జాప్యం జరుగుతోందని ఇప్పుడు తెరాస నేతలతో బాటు టీ-కాంగ్రెస్ ఎంతలలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. తత్ఫలితంగా మళ్ళీ తెలంగాణా లో ఉద్యమాలు మొదలవుతున్నాయి. టీ-కాంగ్రెస్ నేతల సమావేశాలు, తీర్మానాలు కూడా మళ్ళీ మొదలయ్యాయి.
మరి కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికయినా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించగలదా? రాష్ట్రాన్ని ఈ సమస్యల నుండి బయటపడేసి, తను బయటపడగలదా? లేకపోతే కళ్ళు మూసుకొని దైర్యంగా ముందుకో వెనక్కో వెళ్లి, ఏదో ఒక ప్రాంతాన్నిపణంగా పెట్టబోతోందా? లేక ఇదే పరిస్థిని కొనసాగిస్తూ రెండు ప్రాంతాలలో దుఖాణం మూసుకొంటుందా? వంటి ధర్మసందేహాలకి కాంగ్రెస్ జవాబు చెప్పలేకపోవచ్చును, కానీ కాలం మాత్రం తప్పక చెపుతుంది.