అమెరికా కొత్త అధ్యక్షుడెవరు?

  అమెరికా అధ్యక్షుడిని ఎన్నికకు పోలింగ్ ఈ రోజు జరగబోతోంది. శ్వేత సౌధంలో ఎవరు పాగా వేస్తారన్న విషయం తేలిపోబోతోంది. ఒబామా, రోమ్నీ.. ఇద్దరూ పోటాపోటీగా గట్టిగానే ప్రచారం చేసుకున్నారు. ఓటర్లని భారీ స్థాయిలో ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. యువతకి భారీగా ఉద్యోగాలిప్పిస్తానంటూ ఒబామా చేసిన ప్రామిస్.. ఆయనకు చాలా అనుకూలంగా మారింది. దీనివల్ల ఓటర్ల మద్దతు ఒబామాకి వెల్లువెత్తుతోంది.   బరాక్ ఒబామాకి బిల్ క్లింటన్ తోడుగా నిలిచి ప్రచారానికి మంచి ఊపు తెప్పించారు. రోమ్నీమాత్రం.. అమెరికా బాగుండాలంటే, నిజమైన మార్పు కావాలంటే నాకే ఓటేయండని అడుగుతున్నాడు. తాజా సర్వేల ప్రకారం రోమ్నీతో పోలిస్తే ఒబామాకే కాస్త మద్దతు ఎక్కువగా ఉంది కానీ.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇద్దరి మధ్యా హోరాహోరీ పోరు నడుస్తోంది.   శాండీ తుపాను ఓ రకంగా విలయాన్ని సృష్టించినా, మరో రకంగా ఒబామాకి మేలే చేసినట్టుకనిపిస్తోంది. తుపాను తర్వాత ఒబామా.. సహాయ చర్యల్ని చాలా సమర్ధంగా నిర్వహించారన్న మంచి పేరుకూడా వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశం కోసం ఆరుగురు భారతీయ సంతతికి చెందిన అభ్యర్ధులు పోటీపడుతున్నారు. వీళ్లలో ముగ్గురికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయ్.  

టెక్కీ నెరజాణ మాయాజాలం

బెంగళూరు శివారులో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతదేహం దొరికింది. వంటి మీద గాయాలేం లేవు. పోలీసులు ఆత్మహత్యగా నమోదుచేసుకున్నారు. మృతుడి పేరు నితీష్.. వయసు 22 సంవత్సరాలు.. ఈ మధ్యే సౌమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలంలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. ఎక్కడో ఏదో కొట్టేస్తోందని పోలీసులకు అనుమానమొచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకున్నోడు ఆత్మహత్యెందుకు చేసుకుంటాడబ్బా అన్న అనుమానంతో తీగ లాగారు. మొత్తం విషయం బైటికొచ్చింది. ఏరికోరి ఫేస్ బుక్ లో ప్రేమాయణం నడిపించి చేసుకున్న ముద్దుల పెళ్లామే నితీష్ ప్రాణాలు చాకచక్యంగా తీసిందని తేలింది. పెళ్లైన కొత్తలోనే ఫేస్ బుక్ లో మాయ అనే మరో అమ్మాయితో నితీష్ కి పరిచయమయ్యింది. ఆమెని పిచ్చిపిచ్చిగా ప్రేమించేశాడు. అదెవత్తో దొరికితే నన్ను పట్టించుకోవడంలేదంటూ సౌమ్య నిలదీయడం మొదలుపెట్టింది. రెండు పక్కల్నుంచీ టార్చర్.. నితీష్ కి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది. ఓ రోజు.. నిన్ను కలవాలంటూ  సౌమ్య దగ్గర్నుంచి కాల్ వచ్చింది. వెతుక్కుంటూ సిటీ శివారుకెళ్లిన నితీష్ మళ్లీ తిరిగి రాలేదు.     మాయ సంగతి ఏం చేశావంటూ నిలదీసి, బీపీ పెంచిన సౌమ్య ఓ వోడ్కా బాటిల్ ని చేతికిచ్చింది. గడగడా తాగేసి పడిపోయాడు. ఎందుకంటే వోడ్కా సీసాలో ఉన్న విషం నితీష్ ప్రాణాలు తీసింది. సైకాలజీలో పీజీ చేసిన సౌమ్య మాయచేసి వోడ్కాలో సైనైడ్ కలిపి.. నితీష్ ప్రాణాలు తీసింది. కారణం.. పరాయి మగాడితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడమే.. నితీష్ తో పెళ్లయ్యాక సౌమ్యకి పాత బాయ్ ఫ్రెండ్స్ కలిశారు. పాత స్నేహాలు, శారీరక సంబంధాలు మళ్లీ చిగురించాయి. మొగుడ్ని తేలిగ్గా వదిలించుకునేందుకు ప్లాన్ చేసిన సౌమ్య మాయ అనే మాయపేరుతో ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుంది. మెల్లమెల్లగా తన మత్తులోకి దింపి నితీష్ ని పిచ్చివాణ్ని చేసింది. అటు మాయగా , ఇటు సౌమ్యగా నటిస్తూ మొగుడి మెదడుని బండకేసి బాదేసి పనికిరాకుండా చేసేసింది. వన్ ఫైన్ డే విషమిచ్చి చంపేసి చక్కా పోయింది. మొగుడికి విషమిచ్చి చంపిన క్రిమినల్ బ్రెయిన్ సౌమ్య, చాలా చిన్న పొరపాటువల్ల పోలీసులకు చిక్కింది. నితీష్ వోడ్కా తాగాక తన మూతిని టిష్యూ పేపర్ తో తుడిచి అక్కడ పారేసి పోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు టిష్యూ పేపర్ తో తాపీగా మూతి తుడుచుకోరుకదా.. అన్న అనుమానం పోలీసులకొచ్చింది. గట్టిగా ఆరా తీసేసరికి విషయం బైటపడింది.    

దోస్త్ మేరా దోస్త్

  రాజకీయాల్లో శత్రుత్వం, మిత్రత్వం శాశ్వతం కాదనే సత్యాన్ని ములాయం, అమర్ సింగ్ మరో సారి నిరూపించారు. కొత్తగా పుట్టిన శత్రుత్వాన్ని మర్చిపోయి మళ్లీ పాత మిత్రులుగా మారిపోవాలని నిర్ణయించుకున్నారు. భాయీ భాయీ అంటూ ఇద్దరూ చేయిచేయి కలిపేసరికి మళ్లీ పాతరోజులు గుర్తొచ్చాయ్. కొత్త స్నేహానికి గుర్తుగా, అమర్ సింగ్ పై పెట్టిన మనీ ల్యాండరింగ్ కేసుల్ని ములాయం వెనక్కి తీసుకున్నారు.   ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం యూపీ ముఖ్యమంత్రి. ములాయం జారీ చేసిన ఆదేశాల్ని అఖిలేష్ తో పాటు మొత్తం మంత్రులంతా శిరసావహించక తప్పదుమరి. రెండేళ్లక్రితం ములాయంతో అమర్ సింగ్ స్నేహానికి మిరియాలు పుట్టాయి. జయప్రదతోపాటు చాలామంది నేతలు అమర్ సాన్నిహిత్యాన్ని విడిచిపెట్టిపోయారు. తర్వాత అమర్ ఆరోగ్యంకూడా బాగా దెబ్బతిన్న నేపధ్యంలో పాత స్నేహాన్ని పునరుద్ధరించుకోవడంవల్లే లాభం ఉంటుందని అమర్ సింగ్ భావించారు.

క్షీణిస్తున్న బాల్ థాక్రే ఆరోగ్యం

  శివసేన అధినేత బాల్ థాకరే ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. 86 సంవత్సరాల వయసున్న శివసేన సేనాని కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని చికిత్స చేస్తున్న వైద్యులు చెబుతున్నారు.   కిందటి నెల 24వ తేదీన లీలావతీ ఆసుపత్రిలోకూడా బాల్ థాక్రే చికిత్స చేయించుకున్నారు. ఇంటికెళ్లాక తిరిగి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించారు. అప్పట్నుంచీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్న దాఖలాలు కనిపించనేలేదు. మూడురోజులుగా ఆసుపత్రిలో ఉన్న బాల్ థాక్రే ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోంది. ప్రజా జీవితంనుంచి తాను రిటైరవుతున్నానని, కొడుకు ఉద్ధవ్ థాక్రేకి, మనవడు ఆదిత్య థాక్రేకి మద్దతివ్వాలని కార్యకర్తల్ని కోరుతూ ఆయన ఇచ్చిన ఓ సందేశాన్ని రికార్డ్ చేసి ఉంచారు.   శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాక్రే.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉన్నపళంగా పార్టీనేతలు సమావేశం కావడంపై ముంబైవాసుల్లో అనుమానం పెరుగుతోంది. బాబా గురించి ఎప్పుడు ఏ వార్త వినాల్సొస్తుందోనని ఆందోళన అభిమానుల్లో ఎక్కువైపోతోంది.

చైర్మన్ కీ, ఈవోకీ మధ్య కంకణం జగడం!

టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజుకీ ఈఓ ఎల్.వి.సుబ్రహ్మణ్యానికీ మధ్య పొరపొచ్చాలొచ్చాయని ఆలయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయ్. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేవేళ బంగారు వాకిలిదగ్గర ఈఓ కంకణధారణ చేయడం చాలాకాలంగా ఆనవాయితీ. కంకణ ధారణ చేసిననాటినుంచీ ఉత్సవాలు పూర్తయ్యేవరకూ ఊరి పొలిమేర దాటకూడదని నిమయంకూడా. ఈ నియమానికి కట్టుబడి ఉండలేమేమో అన్న అనుమానంతో గతంలో కొందరు ఈఓలు ఈ బాధ్యతను చైర్మన్ కి అప్పగించిన సందర్భాలుకూడా ఉన్నాయ్. కానీ.. ఈ సారి మాత్రం ఈఓ అలాంటి అప్పగింతలేవీ పెట్టకుండానే చైర్మన్ కనుమూరి బాపిరాజు బంగారు వాకిలి దగ్గరికొచ్చి కంకంణం కట్టించుకున్నారు. ఈఓ సుబ్రహ్మణ్యం మాత్రం అక్కడికి రాకపోవడం విశేషం. తనకు దక్కాల్సిన గౌరవాన్ని బాపిరాజు తన్నుకుపోతున్నరన్న ఉక్రోషంతో సుబ్రహ్మణ్యం కలిసిరాలేదన్నది కొందరు ఉద్యోగులు చెబుతున్న మాట. డాలర్ శేషాద్రితోపాటు ఇతర అధికారుల కోరిక మేరకే తాను కంకణ ధారణం చేశానని కనుమూరి బాపిరాజు చెబుతున్నారు. తిరుమలలో చైర్మన్.. ఫలఫుష్ప ప్రదర్శన శాలను, మీడియా సెంటర్ ని ప్రారంభించినప్పుడు ఈఓ సుబ్రహ్మణ్యం దరిదాపుల్లోకూడా కనిపించకపోవడం, ఇరువురికీ మధ్య విభేధాలు పెరుగుతున్నాయనడానికి సూచనని స్థానికులు అనుకుంటున్నారు.