స్పష్టమయిన సందేశమిచ్చిన ఏపీఎన్జీవో సభ
posted on Sep 7, 2013 @ 9:40PM
అందరూ భయపడినట్లుగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏపీఎన్జీవోల సభ, టీ-జేయేసీ బంద్ ప్రశాంతంగా ముగిసాయి. ఇరువర్గాల నేతలు ప్రజలకు సంయమనం పాటించమని పదే పదే చేసిన విజ్ఞప్తి కారణంగానే ఇది సాధ్యమయిందని చెప్పవచ్చును.
ఇక ఈ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ప్రసంగించిన ఎన్జీవో నేతలు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలకి, తెలంగాణా నేతలకి చాలా స్పష్టమయిన సందేశమే ఇచ్చారు. కేంద్రం రాష్ట్రవిభజన నిర్ణయం వెనక్కు తీసుకొనే వరకు తమ సమ్మె, ఉద్యమం కొనసాగుతాయని స్పష్టం చేసారు. (సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్ర విభజనపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం విశేషం.) సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, తమ రాజీనామాలతో దారికి తేవాలని ఎన్జీవో నేతలు స్పష్టం చేసారు. వారు వెంటనే తమ తమ పదవులకు రాజీనామాలు ఇచ్చి, కేంద్రం తన నిర్ణయం వెనక్కు తీసుకొనేలా ఒత్తిడి చేయాలని వారు కోరారు. ఒకవేళ రాజీనామాలు చేయకుండా పదవులను పట్టుకొని వ్రేలాడినట్లయితే వారికి గట్టిగా బుద్ది చెపుతామని హెచ్చరించారు.
ప్రజాభీష్టం తెలుసుకోకుండా కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయాలను తాము ఆమోదించలేమని స్పష్టం చేసారు. ప్రజలు వారిని ఎన్నుకొనేది పాలించడానికే కానీ విభజించడానికి కాదని అన్నారు. ఉద్యమాల వలన ప్రజలు తప్ప, రాజకీయ నాయకులెవరూ నష్ట పోలేదని వారు అన్నారు. కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయంపై ఇప్పుడు ముందుకు కానీ, వెనక్కు గానీ వెళ్ళలేని స్థితిలో ఉందని అన్నారు.
ఇక సభలో ప్రసంగించిన నేతలందరూ హైదరాబాదుపై తమ హక్కులను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల సమిష్టి కృషి మూలంగా నేడు హైదరాబాదు ఈ స్థితికి వచ్చిందని, అందువల్ల హైదరాబాదుపై అందరికీ సమాన హక్కులు ఉంటాయని, తమను పొమ్మనే అధికారం ఎవరికీ లేవని వారు స్పష్టం చేసారు. అదేవిధంగా హైదరాబాదులో స్థిరపడిన ఆంద్ర ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామనే భరోసా కల్పించారు.
పాలకులు కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలన్నిటినీ నిర్లక్ష్యం చేయడం వలననే నేడు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. అందువల్లే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలయినా హైదరాబాదుపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడిందని, అటువంటప్పుడు తమను ఇప్పుడు అకస్మాత్తుగా బయటకి పొమ్మంటే ఎక్కడికి పోతామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాదును ఎట్టి పరిస్థితుల్లో వదులుకొనే ప్రసక్తి లేదని వారుస్పష్టం చేసారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అప్పటి పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ప్రజల అభిమతం మేరకు ఆ లేఖలు వెనక్కు తీసుకొని సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం తమతో కలిసి ఉద్యమించాలని లేకుంటే వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.
రాజకీయ నాయకులు బస్సు యాత్రలు, రధ యాత్రలు చేస్తూ ప్రజలకు చరిత్ర పాటాలు భోదించనవసరం లేదని, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఇప్పటికయినా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా నిలిస్తే ప్రజలు వారిని క్షమిస్తారని తెలిపారు.
మొత్తం మీద ఎన్జీవో నేతలు విభజనపై దూకుడు ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, పదవులను అంటి పెట్టుకొని నాటకాలు ఆడుతున్న ప్రజా ప్రనిధులకు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న రాజకీయ పార్టీ నేతలకి, హైదరాబాదు నుండి పొమ్మని చెపుతున్న తెలంగాణా నేతలకి ఈ సభ ద్వారా స్పష్టమయిన సందేశం ఇచ్చారు. దీనిపై సదరు వర్గాల ప్రతిస్పందనలు రేపటి నుండి గమనించవచ్చును.