తెలుగు తేజం జయప్రకాశ్ నారాయణ చొరవ ఫలించేనా

 

రాష్ట్ర విభజన ప్రకటనతో రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. అదేవిధంగా కాంగ్రెస్, తెరాస, తెదేపా, బీజేపీ, వైకాపాల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ సమస్య నుండి బయటపడటానికి రాజకీయ పార్టీలు ఇరుప్రాంత ప్రజల మధ్య మరింత విద్వేష బీజాలు నాటుతున్నాయి తప్ప, వాటిలో ఏ ఒక్కటీ కూడా ఈ సమస్యను శాంతియుతంగా సామరస్యంగా పరిష్కరించేందుకు ముందుకు రాలేదు. తత్ఫలితంగా ఇరుప్రాంతల ప్రజల మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టే సూచనలు కనబడటం లేదు. అంతిమంగా ఈ పరిణామాలన్నీ ప్రజల జీవితాలను దుర్భరం చేయడమే కాకుండా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలను మంటగలుపుతున్నాయి. అయినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు దీనినుండి రాజకీయ లబ్దికోసం ప్రాకులాడుతూనే ఉన్నాయి.

 

ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, అంటూ వ్యాదులు, ఆర్ధిక సమస్యలు వంటివి ఎన్నిటినో ఎదుర్కొని తట్టుకొని నిలబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నేడు రాజకీయ నాయకుల, పార్టీల స్వార్ధ రాజకీయాలు, అనాలోచిత నిర్ణయాలు, సమస్యను పరిష్కరించడంలో ప్రయత్నలోపం కారణంగా అత్యంత దయనీయమయిన స్థితిలో విలవిలాడుతోంది. బహుశః రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దుర్భర పరిస్థితులు ఎన్నడూ ఏర్పడి ఉండవు.

 

నిజాన్ని నిర్భయంగా చెప్పగల దైర్యవంతుడు, నిజాయితీ పరుడు, మేధావి అయిన లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ భాద్యత గల పౌరుడిగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తలపెట్టారు. ఆయన ఈనెల 14 నుండి కోస్తాంధ్ర, రాయలసీమలలో ‘తెలుగు తేజం’ పేరిట యాత్రకు సిద్దమవుతున్నారు. ఆయన తన యాత్రను కర్నూలులో ప్రారంభించి అనంతపురం, కడప, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, విశాఖ, విజయనగరంల మీదుగా సాగి ఈనెల 27న శ్రీకాకుళంలో ముగిస్తారు.

 

ఈ సందర్భంగా ఆయన పలు బహిరంగ సభలు, రౌండ్‌టేబుల్ భేటీలవంటివి నిర్వహించి రాష్ట్ర విభజనలో లోక్ సత్తా పార్టీ గుర్తించిన ఐదు ప్రధాన సమస్యలను ప్రజలకు వివరించి, అందరికీ ఆమోదయోగ్యంగమయిన పరిష్కారాల కోసం కృషి చేస్తారు. ఆయన తన యాత్రలో రాష్ట్ర విభజన అనివార్యమనే సంగతిని ప్రజలకు తెలియజేస్తూనే, దాని వల్ల ఏర్పడే సమస్యలను, వాటికి పరిష్కారాలను ఆయన సూచించే ప్రయత్నం చేస్తారు.

 

సమైక్యాంధ్ర కోరుతూ గత నలబై రోజులుగా ఉద్యమిస్తున్న ప్రజలకు ఈవిధంగా నచ్చజెప్పబోవడం నిజంగా సాహసోపేతమే. అయితే వాస్తవ పరిస్థితులను వివరించి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవలసిన భాద్యత కూడా తమపై ఉందని ఆయన బలంగా నమ్ముతున్నదునే ఈ యాత్రకు సిద్దపడుతున్నారు.

 

మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులకు క్లాసిక్ సినిమాతో మెప్పించడం ఎంత కష్టమో, అదేవిధంగా తెరాస, కాంగ్రెస్, వైకాపా, తెదేపాల పసందయిన ఘాటు విమర్శలతో కూడిన ప్రసంగాలు వినేందుకు అలవాటుపడిన ప్రజలను జయప్రకాశ్ నారాయణ సమస్యలు-పరిష్కారాలు అంటూ మాట్లాడి మెప్పించడం కూడా అంతే కష్టం. అయితే ఇది సరయిన దిశలో వేస్తున్నతొలి అడుగు. గనుక విజ్ఞులయిన ప్రజలు కూడా ఆయన చెప్పే చేదు వాస్తవాలను, వాటికి ఆయన సూచించే పరిష్కారాలను స్వీకరించి తదనుగుణంగా ప్రతిస్పందించితే ఎప్పటికయినా రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.