విభజనలో తెలంగాణా రాజకీయాలు
posted on Sep 14, 2013 @ 9:47AM
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు రాష్ట్రవిభజన వ్యవహారంలో తమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేసింది కాదని, కేవలం ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నామని కాంగ్రెస్ అధిష్టానం చెపుతూ వస్తోంది. అయితే అది శుద్ధ అబద్ధమని ప్రజలకి తెలుసనే సంగతి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. కానీ విభజన కూడా మీ అభీష్టం మేరకే, మీ సంక్షేమం కోసమే చేస్తున్నామని కాంగ్రెస్ చాలా డిప్లోమేటిక్ గా ప్రజలకు చెపుతోంది.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతున్నందున అక్కడి ప్రజలకు ఇది నిజమని నమ్మడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండక పోవచ్చును, కానీ విభజనను వ్యతిరేఖిస్తున్న సీమాంధ్ర ప్రజలకు, విభజనతో రాజకీయంగా దెబ్బ తింటున్నఅక్కడి రాజకీయ పార్టీలకు మాత్రం నమ్మడానికి సిద్ధంగా లేరని స్పష్టం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తమను నిలువునా మోసం చేసిందని ఆగ్రహావేశాలతో ఉన్న సీమాంధ్ర ప్రజలు ఆ పార్టీని తప్పు పట్టడం సహజమే. కానీ తెలంగాణాపై పూర్తి పట్టు సాధించేందుకు కాంగ్రెస్, తెరాసలు చేస్తున్న రాజకీయాలు రాష్ట్ర విభజనలో రాజకీయ కోణాలను పట్టి చూపిస్తున్నాయి.
విభజన ప్రకటన చేస్తున్నపుడే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తెరాస విలీనం గురించి మాట్లాడటం ఇందుకు మొదటి ఉదాహరణ అయితే నాటి నుండి నేటి వరకు ఆ రెండు పార్టీల మధ్య జోరుగా సాగుతున్న విలీనం, ఎన్నికల పొత్తుల బేరసారాలు ఈ వ్యవహారంలో ఇమిడి ఉన్న అన్ని రాజకీయ కోణాలను ఒకటొకటిగా బయటపెడుతున్నాయి.
తెలంగాణా ఏర్పాటుతో అక్కడి ప్రజలు లాభపడే సంగతి ఎలాఉన్నా, అధికారం పంచుకొని కాంగ్రెస్, తెరాసలు మాత్రం పూర్తిగా లాభపడటం ఖాయం. అందుకే విభజన ప్రకటన వచ్చిన నాటి నుండి ఆ రెండు పార్టీలు అధికారం ఏవిధంగా పంచుకోవాలనే తపనతో విలీనం, పొత్తుల గురించి మంతనాలు చేస్తు, ఏ ఫార్మాట్ లో ముందుకు వెళితే తాము ఇరువురం లాభాపడుతూనే, తెలంగాణాలో బలంగా ఉన్నతెదేపా, బీజేపీలను పూర్తిగా అడ్డు తొలగించుకోవచ్చునని దురాలోచనలు చేస్తున్నాయి.
విలీనం చేస్తే, అప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం తెదేపా లేదా బీజేపీలకి దక్కితే అవి క్రమంగా బలపడే అవకాశం ఉందని గ్రహించిన కాంగ్రెస్, తెరాసలు ఇప్పుడు విలీనం కంటే ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవడానికే ఆసక్తి చూపుతున్నట్లు తాజా సమాచారం.
తద్వారా కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని లోలోన సంతోషపడుతుంటే, తెరాస తన ఉనికిని కోల్పోకుండానే మన్మోహన్ ప్రభుత్వాన్నిసోనియా గాంధీ ఏవిధంగా రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తోందో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నితాము నడిపించవచ్చునని తెరాస ఆనందపడుతోంది. పైగా తమ ఉమ్మడి శత్రువులు తెదేపా, బీజేపీలను అధికారానికి ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంచగలమని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి.