సీమాంద్రా నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారా

 

నిన్నహోంమంత్రి సుషీల్ కుమార్ షిండే మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన తాజా ప్రకటనలతో, ఇంత కాలం రాష్ట్ర విభజన ప్రక్రియకు తామే బ్రేకులు వేసి నిలిపివేశామని గొప్పలు చెప్పుకొంటున్న సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు, గత యాబై రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్న ప్రజల, ఉద్యోగుల ముందు దోషులుగా నిలబడవలసిన పరిస్థితి ఏర్పడింది.

 

ఇంత కాలంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు తాము తెలంగాణా నోట్ పై అడ్డుపడ్డామని చెప్పుకొంటున్నారు. అయితే, నిన్నహోంమంత్రి షిండే, టీ-నోట్ పై డ్రాఫ్ట్ ఎప్పుడో తయారయిందని, ఇంత కాలం తను ఆరోగ్య కారణాల వలన కార్యాలయానికి రాలేక పోయినందునే దానిని పరిశీలించలేకపోయాయని, త్వరలో దాని పని పూర్తి చేస్తానని ఆయన ప్రకటించడంతో ఇంతకాలంగా వారు ప్రజలకు అబద్దం చెప్పినట్లయింది.

 

ఇక దిగ్విజయ్ సింగ్ నిన్న రాత్రి తనను కలిసిన సీమాంద్ర యంపీలతో మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే వారికి ఊరట కలిగించేందుకు అంటోనీ కమిటీ తన నివేదికను సమర్పించిన తరువాతనే టీ-నోట్ ను క్యాబినెట్ ముందుకు వెళుతుందని హామీ ఇచ్చారు.

 

ఇక సీమాంద్రాలో పర్యటించాలనే వారి డిమాండ్ కు పూర్తిగా తలొగ్గ కుండా, అలాగని నిరాకరించకుండా త్వరలోనే రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో పర్యటించి రాష్ట్రవిభజనపై ప్రజల అభిప్రాయం తెలుసుకొంటానని హామీ ఇచ్చారు. తద్వారా అటు తెలంగాణా నేతలను ప్రజలను సంతృప్తి పరుస్తూనే, మరో వైపు తమను సంప్రదించకుండా రాష్ట్ర విభజన ఎలా చేస్తారని అడుగున్నసమైక్యవాదులను సంప్రదించి ఆ మొక్కుబడి తంతు కూడా పూర్తిచేయవచ్చును.

 

ఇదంతా గమనిస్తే సీమాంద్రా ప్రజాప్రతినిధులు ప్రజలను మభ్య పెడుతున్నారా? లేక వారినే కాంగ్రెస్ అదిష్టానం మభ్యపెడుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రవిభజన ఖాయమని తేటతెల్లం చేస్తున్నప్పుడు, ఇంకా ఈ తంతు కొనసాగించడం అనవసరమని కొందరు యంపీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలిసి కూడా వారు ఇంకా పదవులు పట్టుకొని ఎందుకు వ్రేలాడుతున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. బహుశః ఈ రోజు విజయవాడలో జరుగనున్న ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఈ విషయాల్లన్నీప్రస్తావనకు రావచ్చును.

 

ఏమయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ తెలంగాణా ఏర్పాటుకి ఇంత దృడనిశ్చయం కనబరచడం తెలంగాణవాదులకు చాలా ఆనందం కలిగిస్తోంది.