3వ ఫ్రంట్ లేదా యుపీఏకు వైకాపా మద్దతు: షర్మిల
కొన్ని నెలల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో ‘తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని’ చెప్పడం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిజగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుపాలు చేసిందని నిత్యం దూషిస్తూనే, మరోపక్క అదే పార్టీ నేతృత్వంలో నడుస్తున్న యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని ఆమె చెప్పడంతో, ‘ఏనాటికయినా తల్లీ పిల్లా కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయని’ తెదేపా చేస్తున్న ఆరోపణలను ఆమె నిజం చేసినట్లయింది.
కానీ, ఆ తరువాత కిరణ్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టడంతో వైకాపా మాటలకి చేతలకి ఎక్కడా పొంతన ఉండదని రుజువయింది. ఆపార్టీ కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవడానికి లేదా ఆ పార్టీలో కలిసిపోవడానికి ఆలోచన కనుక చేస్తుంటే, అది అవిశ్వాసం పెట్టి ఉండకూడదు. కానీ, పెట్టింది. గనుక, ఆ పార్టీతో జతకట్టే ఆలోచనలేదనుకోవాలి. పైగా తెదేపా కాంగ్రెస్ పార్టీతో కుమక్కవడం వలననే తాము కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయామని ఆరోపించింది కూడా. అంటే, వైకాపా, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తునట్లు భావించవచ్చును.
అయితే, ఇటీవల షర్మిల 2000కి.మీ. పాదయాత్ర పూర్తి చేసుకొన్నసందర్భంగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ, గతంలో తన తల్లి చెప్పినట్లుగానే 'తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని' స్పష్టం చేసారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి నట్లయితే, దానికి మద్దతు ఇస్తామని, కానీ, కేంద్రంలో 3వ ఫ్రంట్ ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలోఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ పార్టీ అయిన బీజేపీ నేతృత్వంలో సాగే ఎన్డీయే ప్రభుత్వానికి మాత్రం మద్దతు ఈయబోదని ఆమె స్పష్టం చేసారు.
షర్మిల చేసిన ఈ తాజా ప్రకటనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తునట్లు అర్ధం అవుతోంది. లేకుంటే, ఇటువంటి అసందర్భ పరిస్థితుల్లో ఆమె ఈ ప్రసక్తి తేవలసిన అవసరం లేదు. ఆమె ఈ విధంగా మాట్లాడటానికి వెనుక ఆమె పార్టీపై, ఆమె కుటుంబంపై నానాటికి పెరుగుతున్న ఒత్తిళ్ళే కారణమని చెప్పవచ్చును.
సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిలు తిరస్కరిస్తు తీర్పు వెలువరించేటపుడు, దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలను అణచివేయవలసి ఉందని అభిప్రాయపడింది. తీవ్ర ఆర్ధిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు మరియు పార్టీకి కోర్టు వెలువరచిన అభిప్రాయాలు కలవరపాటు కలిగించడం సహజమే.
పైగా, మరో కేసు సందర్భంలో సీబీఐ విచారణలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించడంతో, జగన్ మోహన్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు మరింత బలంగా బిగుసుకొనే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే జైలునుండి విడుదల కాకపోవచ్చుననే సంకేతాలు, ఆ పార్టీ పరిస్థితిని తలక్రిందులు చేసే అవకాశం ఉంది.
ఇటువంటి నేపద్యంలో, షర్మిల తమ పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ అనుకూలమేనని చెప్పడం, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంగానే భావించవచ్చును. కానీ, ఎన్నికలకి ఇంకా పది నెలలు సమయం ఉన్నందున, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తొందరేమి లేదు, కనుక ఆ పార్టీ ఇప్పుడు వెంటనే స్పందించక పోవచ్చును. మున్ముందు రాజకీయ పరిస్థితులు, పార్టీ అవసరాలను బట్టి అప్పుడు వైకాపాతో ఏవిధంగా వ్యవహరించాలో కాంగ్రెస్ నిర్ణయించుకోవచ్చును.
ఈలోగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ, జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి గానీ తారుమారయి, ఎవరిదయినా మరింత దిగజారితే, అప్పుడు రెండో వారిది పైచేయి అవుతుంది కనుక, తదనుగుణంగా వారి వారి వ్యూహాలు ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. ఏమయినప్పటికీ షర్మిల తెలిపిన తాజా అభిప్రాయాలతో ఆమె, ఆమె పార్టీ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని పైకి తిడుతున్నపటికీ, అవసరమయితే అదే పార్టీతో చేతులు కలపడానికి కూడా సిద్ధమని స్పష్టమయింది.
ఇక, కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానిలో తప్పనిసరిగా తమ బద్ధ విరోధి చంద్రబాబు ఉంటారు. మరి అటువంటప్పుడు 3వ ఫ్రంట్ కి వైకాపా ఏవిధంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొందో కూడా తెలియదు. ఆ పార్టీకి సరయిన దిశా నిర్దేశం చేయగలవారు లేకపోవడం వలననే, ఇటువంటి పొంతనలేని నిర్ణయాల గురించి మాట్లాడుతోందని చెప్పవచ్చును.