షర్మిల బస్సుయాత్ర సమైక్యం కోసమా పార్టీ కోసమా

 

ఈ రోజు షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనల చేసిన తరువాత, తిరుపతి వెళ్లి అక్కడి నుండి తన ‘సమైక్య శంఖారవం’ బస్సుయాత్ర మొదలుపెడతారు. ఆమె సీమాంధ్రలో 13 జిల్లాలో దాదాపు నెలరోజుల పాటు యాత్ర చేసే అవకాశం ఉంది. ఆమె తన యాత్రను ఈ రోజు తిరుపతిలోజరిగే బహిరంగ సభతో మొదలుపెట్టి రేపటి నుండి తన యాత్రను కొనసాగిస్తారు.

 

షర్మిల ఇటీవల పూర్తి చేసుకొన్నతన పాదయాత్ర ద్వారా ప్రజలలో వైయస్సార్ సెంటిమెంటును సజీవంగా నిలుపుతూ, జైల్లో ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిపట్ల ప్రజలలో సానుభూతి ఏర్పరిచేందుకు కృషిచేసారు. తమ ఈ కష్టాలన్నిటికీ కాంగ్రెస్, తెదేపాలే కారణమని ప్రజలకు వివరిస్తూ పార్టీకి ప్రజల సానుభూతి సంపాదించే ప్రయత్నం చేసారు. అయితే కాంగ్రెస్ రాష్ట్ర విభజన ప్రకటనతో ఆమె పడ్డ ఈ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయింది.

 

కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుకి పైఎత్తు వేస్తూ వైకాపా మళ్ళీ సరికొత్త వ్యూహ రచన చేసుకోక తప్పలేదు. ఆ వ్యూహంలో భాగంగానే వైకాపా తెలంగాణాను పూర్తిగా వదులుకొని, సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకొంది. సీమాంధ్రలోకాంగ్రెస్, తెదేపాలకు సంకట పరిస్థితి కల్పించి తద్వారా తను బలపడాలని వైకాపా నిశ్చయించుకొంది. ఆ ప్రయత్నంలో వైకాపా చాలా వరకు విజయం సాధించింది కూడా. ప్రజా ఉద్యమాలకి తోడు, వైకాపా అద్వర్యంలో నిర్వహిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యమాలతో తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

 

అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు భావించవచ్చును. అదేవిధంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య చంద్రబాబు కూడా ఆత్మగౌరవ యాత్రతో ప్రజల మధ్యకి రాక తప్పలేదు.

 

ఈ రోజు షర్మిల మొదలుపెట్టబోతున్న బస్సుయాత్ర ‘సమైక్యాంధ్ర లేదా సమన్యాయం’ కోసమని ఆ పార్టీ చెప్పుకొంటున్నపటికీ నిజానికి ఆ మిషతో తెదేపా, కాంగ్రెస్ పార్టీలను రాజకీయంగా దెబ్బతీసి, సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకోనేందుకేనని చెప్పవచ్చును. సమైక్యాంధ్ర కోసం గత నెలరోజులుగా సీమంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నఉద్యమాలను, ఉద్యోగుల నిరవధిక సమ్మెతో స్తంభించిపోయిన రాష్ట్రాన్నిచూసి కూడా తెలంగాణా విషయంలో వెనక్కుతగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నకాంగ్రెస్ అధిష్టానం, తను చేపడుతున్నబస్సు యాత్రకు జడిసి వెనక్కు తగ్గుతుందని షర్మిల కూడా భావించట్లేదు. అయినప్పటికీ ఆమె సమైక్య శంఖారావం పూరిస్తూ బస్సుయాత్ర మొదలుపెట్టడం, కేవలం ఈ సమైక్య ఉద్యమాల ద్వారా పార్టీని సీమంధ్రలో బలోపేతం చేసుకోవడానికే తప్ప మరొకందుకు కాదు.

 

షర్మిల చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆమె ఎంతవరకు విజయం సాధిస్తారో, ఆమెను తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఏవిధంగా ఎదుర్కొంటాయో ప్రజలే ప్రత్యక్షంగా చూడవచ్చును.