ఏపీఎన్జీవో సమ్మెకు ముగింపు ఎప్పుడు

 

గత 50 రోజులుగా సాగుతున్నసమైక్యాంధ్ర ఉద్యమాలు, ఏపీయన్జీవో ఉద్యోగుల సమ్మెలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో ఎవరూ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ విజయవంతం అవడంతో ఏపీయన్జీవో నేతలు కూడా సమైక్యాంధ్ర కోసం మరింత గట్టిగా పోరాడాలని నిర్ణయించుకొన్నారు. అదేవిధంగా ఆ సభ తరువాత తెలంగాణావాదులు కూడా హైదరాబాద్ అంశంపై మరింత బిగుసుకు పోవడంతో సమస్య మరింత జటిలమయ్యింది.

 

ఏపీయన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు తాము రాష్ట్రవిభజనపై వచ్చే సమస్యల గురించి టీ-యన్జీవో నేతలతో చర్చించేందుకు సిద్దమని, అందుకోసం ఈ నెలాఖరులోగా హైదరాబాదులో సోదర సద్భావన సమావేశం ఏర్పరిచి దానికి టీ-యన్జీవోనేతలను కూడా ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఆ సమావేశంలో రాష్ట్రం సమైక్యంగా ఉండవలసిన అవసరం గురించి తోటి తెలంగాణా ఉద్యోగులకు తెలియజెపుతామని అన్నారు. ఇక నిన్న టీ-ఎన్జీవో సంఘాల అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ “తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేఖించే వారెవరయినా సరే, బయటకు నడవాల్సిందే” అని తెరాస నేతల పద్దతిలోనే హెచ్చరించారు. ఈవిధంగా ఇరు ప్రాంతాల ఉద్యోగ నేతలు ఎవరికివారు నిర్దిష్టమయిన ఎజెండాలతో సమావేశం అవడం వలన ఒరిగేది శూన్యం.

 

ఇక, ఆర్.టీ.సి.ఉద్యోగ సంఘనేతలు నిన్న రవాణాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణతో జరిపిన చర్చలు కూడా విఫలమయిన్నట్లు సమాచారం. నెలరోజులుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నపటికీ, వారు వెనక్కి తగ్గకపోవడం చూస్తే వారు కూడా ఇప్పుడుడప్పుడే సమ్మె విరమించే ఆలోచనలో లేరని అర్ధం అవుతోంది.

 

అయితే, హైకోర్టు నిన్న ఏపీయన్జీవోల సమ్మెను తప్పుపట్టింది. అదేవిధంగా వారిని ఉపేక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్నికూడా తప్పుపట్టింది. అందువల్ల ఈ రోజు హైకోర్టు తీర్పు ఏవిధంగా ఉండబోతోందో చూచాయగా అర్ధం అవుతోంది. హైకోర్టును కాదని ఏపీయన్జీవోలు సమ్మె కొనసాగిస్తే, హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నరాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకోవలసి వస్తుంది. బహుశః ప్రభుత్వము, ఉద్యోగులు కూడా ఇటువంటి పరిస్థితిని ఇష్టపడకపోవచ్చును. గనుక ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించదలిస్తే, మరో మార్గం ఎంచుకోక తప్పదు.

 

ఏపీయన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఈ నెల30వరకు తమ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులకున్న నిబద్దత రాజకీయనేతలలో కనబడకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇప్పటికయినా పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని ఆయన నిన్న మరోమారు విజ్ఞప్తి చేసారు. అంటే ఏపీయన్జీవోలు సుదీర్గ పోరాటానికే సిద్దపడుతున్నట్లు అర్ధం అవుతోంది.