నమ్మకాన్ని పొగొట్టుకుంటున్న టిఆర్‌ఎస్?
posted on Aug 18, 2012 @ 3:07PM
ఒకవైపు ఆందోళనలు చేస్తేనే తెలంగాణా సాధ్యమవుతుందని సూచనలొస్తున్నాయి. మరోవైపు స్వాతంత్య్రసమర యోధులందరూ ప్రత్యేక తెలంగాణా అవసరాన్ని తెలియజేసి జనసమీకరణ చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణాపై ఒక నిర్ణయానికి రాలేకపోతోంది రాజ్యసభలో తెలంగాణాపై పెట్టిన ప్రైవేట్ బిల్లు వీగిపోయింది. అనుకోకుండా సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకుని హోదాలో ప్రత్యేక తెలంగాణాకు తమ అభ్యంతరం ఉండబోదంటూ లేఖ కూడా రాస్తామంటున్నారు. ఇన్ని ఘటనలు ఒకదాని తరువాత ఒకటి జరుగుతుంటే టిఆర్‌ఎస్ పార్టీ అసలు తామేమి చేయాలనే దానిపై తలలు పట్టుకుంటోంది. ఒకవైపు జెఎసి, మరోవైపు తెలంగాణావాదులు టిఆర్‌ఎస్ నేతలను నమ్మటం లేదు. అందుకే ఎవరికి తోచినదారిలో వారు టిఆర్‌ఎస్‌ను మినహాయించి తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణారాష్ట్రసమితి (టిఆర్‌ఎస్) అధినేత కె.చంద్రశేఖరరావు తన ప్రకటనల్లో చెప్పిన గడువు ఎప్పుడో దాటేసింది. దీంతో మరోసారి ఆయన తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ప్రకటనకు ఇంకో ముహుర్తం ప్రకటించే అవకాశాలూ కనిపిస్తున్నాయి.
రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ పదవీప్రమాణస్వీకారం చేసిన రోజునే ప్రత్యేకరాష్ట్ర బిల్లు అమోదం పొందినా అమలు జరగదని నిపుణులు తేల్చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనటం లేదని ప్రకటించినప్పుడే టిఆర్‌ఎస్ కూడా అదేవిధమైన ప్రకటన జారీ చేసింది. టిడిపి ఎందుకు ఎన్నికల్లో పాల్గొనలేదంటే తమ పార్టీపై ఉన్న అసమ్మతినాయకుల గుట్టువిప్పేందుకే అన్నది జగమెరిగిన సత్యం. అటువంటి అవసరమే లేకపోయినా టిఆర్‌ఎస్ గొప్పగా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకపోవటం వల్ల ప్రణబ్‌కు టిఆర్‌ఎస్‌పై ఎటువంటి సాఫ్ట్‌కార్నర్ ఉండదని తేలుతోంది. ఉద్యమం చేసేద్దామంటున్న తెలంగాణాలోని విద్యార్థి సంఘాలూ టిఆర్‌ఎస్‌ను పట్టించుకోవటం లేదు. తమ సొంత బలంపై ఆ సంఘాలు ఆధారపడ్డాయి. దీంతో టిఆర్‌ఎస్‌ను తెలంగాణాలో అందరూ ఏకాకిని చేసేసి వాతావరణం కనబడుతోంది. కేసిఆర్ ఎప్పుడు ఏం ప్రకటన చేసి ఇంకా పార్టీపై నమ్మకం పోగొడతారో అని కూడా ఆ పార్టీనేతలే తలలు పట్టుకుంటున్నారు. ఇంకోసారి అటువంటి గడువుతో కూడిన ప్రకటనలు చేయోద్దని బిజెపి నేతలతో వార్నింగ్ ఇప్పించినా కేసిఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. అలానే ఇప్పటి దాకా తెలంగాణా తెస్తారన్న నమ్మకంతో టిఆర్‌ఎస్ వెనుక ఉన్న కార్యకర్తలు కూడా ఆ తెచ్చింది ఇక చాల్లే అని తప్పుకోవటం కూడా ప్రారంభించారు. బాలకృష్ణ ప్రకటన వల్ల తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు తెలంగాణాలో కొత్తగా ఆదరణ లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీలు చేయాల్సిన పని టిఆర్‌ఎస్ చేస్తానంటే అది అవుతుందా అన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వేసిన ప్రశ్న ఇప్పుడు తెలంగాణావాదులను ఆలోచింపజేస్తోంది. 2014ఎన్నికల్లో తమను ఆదరిస్తే ఖచ్చితంగా తెలంగాణా ఇస్తామన్న కిషన్‌రెడ్డి భరోసా గురించి కూడా తెలంగాణాప్రాంతంలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా నమ్మకాన్ని కోల్పోయి టిఆర్‌ఎస్ ఎదురీతలో ఎంతవరకూ నెట్టుకురాగలదో తెరపైనే చూడాలి.