రాష్ట్రానికి యూరియా కొరత చోద్యం చూస్తున్న ఎంపీలు
posted on Aug 18, 2012 @ 9:57AM
ఖరీఫ్ సాగు రైతులకు శాపంగా పరిణమించింది. ఒకవైపు ముఖం చాటేసిన వర్షాలు మరొక వైపు ఎంతకి తమ వైపు చూడని పాలకులు వెరసి సాగు ముందుకు సాగని పరిస్థితులు. యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా రైతులను వేధిస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద యుద్దం చేసినా బస్తా యూరియా దొరకని పరిస్థితి. వరి నాటులో యూరియా తప్పని సరి. దానికోసం రైతులు సీజన్ ఆరంభం నుండి ఎదురు చూపులు చూస్తుంటారు. సీజన్ ఆరంభమైనెలలు గడుస్తున్నా అన్నదాత నిరీక్షణ ఫలించ లేదు. ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయవల్సి ఉండగా కేవలం 1 లక్ష టన్నుల యూరియాను మాత్రమే రాష్ట్రంలో పంపిణీ జరిగింది.అంటే 3 లక్షల టన్నుల యూరియా కొరత ఉందన్న మాట. యూరియాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కెటాయిస్తుంది. ఈ కేటాయింపుల్లో కూడా మనకు సక్రమంగా జరగటం లేదని దీనివల్ల తెలుస్తుంది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాత్రం మన రాష్ట్రానికే ప్రాధాన్యత నిస్తుంది కేంద్రం అంటారు కాని చేతల్లో మాత్రం శూన్యం. ఎరువుల కోసం ఎంపీలందరూ కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు రావాలని వ్యవసాయ అధికారులు, రైతులు కోరుతున్నారు. కేంద్ర ఎరువుల సహాయక మంత్రి ఒడిశ్శాకు చెందినవారవటంతో ఒడిశ్శా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలలో ఎరువుల కొరతలేవని చెబుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లోనూ ఎరువుల కొరత లేదు. అందరికన్నా ఎక్కువ ఎంపీలు మనరాష్ట్రంలో నుండి ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.