బొగ్గు ప్రైవేటుపాలు, నుసి ప్రభుత్వపాలు
posted on Aug 19, 2012 @ 9:46AM
అదేమి చిత్రమో కాని యుపిఎ ప్రభుత్వం పాలనలో అంతులేని అవినీతి, కుంభకోణాలు బయటపడుతూ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. అయితే వీటిల్లో ఉన్నది చిన్నస్థాయి అధికారులు కాక, ప్రభుత్వానికి తోడ్పాటు అందించేవారో, లేదా మంత్రివర్గంలోని మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కావడం విశేషతను సంపాదించుకుంటోంది. తాజాగా రూ.1.85 లక్షల కోట్లు బొగ్గు స్కాం జరిగినట్లు కాగ్ నివేదిక తెలిపింది. బొగ్గు గనుల కేటాయింపుకు పోటీయుత బిడ్డింగ్ విధానాన్ని సకాలంలో అమలు చేయకపోవడం వల్ల... వాటిని దక్కించుకున్న ప్రైవేటు సంస్థలకు రూ.1.85 లక్షల కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఈ కేటాయింపులను పోటీయుత, పారదర్శక, నిష్పాక్షిక బిడ్డింగ్ ద్వారా జరిపి ఉంటేపైన పేర్కొన్న లబ్ధిలో అధిక భాగం ప్రభుత్వ ఖజానాకు చేరివుండేద’ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపింది.
అంతేకాక బొగ్గు శాఖ ప్రధాని చేతిలో ఉన్నప్పుడే ఈ కేటాయింపులు జరిగినట్లు ఆరోపణలు. దీంతో ఏ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడని ప్రతిపక్షాలు ప్రధాని తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే, అంతా పాదరర్శకంగానే జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బొగ్గుగనులను ఇష్టారాజ్యంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంతో ఆయా సంస్థలు లాభపడగా, ప్రభుత్వానికి అంతమేర నష్టం వచ్చింది. ఏం ఆశించి ఆయా సంస్థలకు గనులను కేటాయించారో అధికార వర్గాలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కాంలతో ప్రజల్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తే యుపిఎ పాలనలో ఇంకొన్ని రోజులకు మరో స్కాం బయటపడితే ఈ స్కాం కొంత కాలానికి మరుగున పడిపోతుంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చిప్...!ప్రభుత్వ ఖజానాకు పడిన గండిని పూడ్చాలంటే మళ్ళీ ప్రజలపై పన్నుల రూపంలో బాదుడు తప్పదు. ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే బొగ్గు అమ్మగా వచ్చిన లాభాలు సంబంధిత లబ్ధిదారులు పొందితే, మిగిలిపోయిన మసి, నుసి పన్నుల రూపంలో ప్రజల ముఖాలకు రాసేందుకు పథకాలు సిద్ధం చేస్తారు. సర్‌ఛార్జీ వెసులుబాటు ఉన్నదందుకే కాబోలు...!