ఇక రాష్ట్రంలో ప్రాంతీయపార్టీలదే హవానా?
posted on Aug 17, 2012 @ 4:25PM
నిన్నటిదాకా(2012 ఉప ఎన్నికలకు ముందు) రాష్ట్రంలో హంగ్ ఖాయమని అందరూ భావించారు. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భవించి ఉప ఎన్నికల్లో 18స్థానాలకు 15స్థానాలు కైవసం చేసుకుని రాష్ట్రరాజకీయాల్లో హంగ్ ఊసే ఎత్తనక్కర్లేదనింపించింది. అయితే ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా చంచల్‌గూడజైలులో ఉన్నారు. ఈయనకు రాష్ట్రంలో లభించిన ఆదరణ తాజాగా కొత్తపార్టీలు, కొత్త సంస్థలను ఆకర్షిస్తోంది. దీంతో ప్రాంతీయపార్టీలు పుట్టుకొస్తున్నాయి.
ఇవి 2014నాటికి ఎన్నికల్లో ప్రధానపార్టీలను ప్రభావితం చేస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకూ సంఘసేవకుడిగా పేరు గడిరచిన హైకోర్టు న్యాయవాది కళ్యాణ్‌రామకృష్ణ నవభారత్‌పార్టీని స్థాపించారు. అదీ 65ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేళ పార్టీ రాష్ట్ర అథ్యక్షునిగా ప్రకటించుకుని కొత్తపార్టీని రాజకీయతెరపైకి తీసుకువచ్చారు. ఇది రాజకీయంగా ఎటువంటి పరిణామమైనా భవిష్యత్తులో మరిన్ని కొత్తపార్టీలు ఆవిర్భవించగలవన్న సంకేతాలు దీనితో ప్రారంభమయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా రాష్ట్రీయప్రజాకాంగ్రెస్ పార్టీ నడుస్తోంది. దీనికి మేడాశ్రీనివాస్ పార్టీ అథ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఈ రెండు పార్టీల్లో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన నవభారత్ ఇంకా కార్యకర్తల కోసం ఎదురు చూడాలి. రాష్ట్రీయప్రజాకాంగ్రెస్‌కు ఆ అవసరం లేదు. ఎందుకంటే ఆల్‌రెడీ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి సేవలందించే నాయకులే అందులో ఉన్నారు.
అయితే చిత్రంగా ఈ రెండు పార్టీల అథినేతలు మనస్సులు కలిసినట్లు ప్రకటనలు కూడా ఒకటే అయ్యాయి. రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్ ప్రారంభసమయంలో మేడాశ్రీనివాస్ ఇచ్చిన ఉపన్యాసమే కళ్యాణ్‌రామకృష్ణ కూడా చేయటం గమనార్హం. పదేళ్ల క్రితం మేడా చేసిన ఆ ప్రసంగం చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు కళ్యాణ్‌రామకృష్ణ కూడా అదే స్టయిల్‌లో ప్రసంగించారు. సమాజంలో ప్రజలకు రక్షణ కరువైందని, రాజకీయంలో అవినీతి చోటు చేసుకుందని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నివర్గాలకు న్యాయం చేసేందుకే తాను పార్టీ నెలకొల్పానని ఆయన తెలిపారు. అయితే ఇది తొలిఅడుగుగా మాత్రమే రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.