అవినీతిసొమ్ము కలెక్షన్లల్లో ఆర్‌టిఓ సిబ్బంది ఫస్ట్!
posted on Aug 18, 2012 @ 3:22PM
దేశంలో అత్యున్నత ఆదాయం,సంపాదన ఉన్న దేవాలయం ఏదీ? అని ఇప్పుడు ఎవరినడిగినా టక్కున అనంతపద్మనాభస్వామి గురించి గుర్తు చేస్తున్నారు. అలానే మామూళ్ల వసూళ్లలో వేగవంతమైన శాఖ ఏదీ అని ప్రశ్నిస్తే అందరూ ఇక నుంచి ఆర్‌టిఓ కార్యాలయంను చూపుతారు. ఎందుకంటే ఈ కార్యాలయంలో ఏసిబి అధికారులు రెండు గంటల పాటు తిష్టవేసి మామూళ్ల వసూళ్లును లెక్కిస్తే రూ.20,050 ఆదాయం వచ్చింది. దీంతో నొరెళ్లబెట్టడం ఏసిబి వంతైంది. చిత్తూరు జిల్లాలో ఒక్కరోజు ఏసిబి పూర్తిస్థాయి దాడులకు వ్యూహరచన చేసింది.
ఆ వ్యూహంలో భాగంగానే 20మంది ఏసిబి సిబ్బంది నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని రెండు చెక్‌పోస్టులపైన, ఆర్టీఓ కార్యాలయం పైన ఏకకాలంలో దాడులు చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఏడుగురి నుంచి లక్షా 20వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది. నెల్లూరు జిల్లా తడమండలం భీములవారిపాళెం ఉమ్మడి చెక్‌పోస్టులో ఏసిబి సోదాలు నిర్వహించగా, రూ.56,975 అక్రమసొమ్ము లభించింది. ఆర్టీఓ కార్యాలయం ముందు నిలబడిన ఇద్దరు ఏజెంట్లలో ఒకరిని పట్టుకోగా అతని వద్ద రూ.13వేలు దొరికాయి. అలానే కార్యాలయంలో రెండు గంటల పాటు వసూలు చేసిన మామూళ్లను లెక్కిస్తే అది రూ.20,050 వచ్చింది. అక్కడి వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో రూ.15,325, మిగతాచోట్ల రూ.8,600 స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ల ఫిర్యాదుల నేపథ్యంలో తాము ఈ దాడులు చేశామని ఏసిబి డిఎస్పీ భాస్కరరావు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో సిసికెమేరాలు అమరుస్తున్నామని, ఏసిబి దాడుల్లో దొరికిన సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తున్నామని రవాణాశాఖ కమిషనరు సంజయ్‌కుమార్ తెలిపారు. కంప్యూటర్లు ద్వారా టాక్స్ చెల్లించేలా వేయింగ్‌మిషన్లు కూడా అమరుస్తున్నామని వివరించారు.