సిఎం గాలి వాగ్థానాలు
ముఖ్యమంత్రి జిల్లాల్లో ఇందిరమ్మ బాట ద్వారా ఎస్‌సి, ఎస్టీ హాస్టల్స్‌లో నిద్రించినా విద్యార్ధుల వెతలు తీరలేదు. హాస్టళ్లలో మెరుగైన వసతులు నాణ్యమైన ఆహారం అందించి ఉత్తమ విద్యార్దులను అందిస్తామని అదికారులు, నాయకులు చెప్పే మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ఒక్కో విద్యార్ధికీ 1 నుండి 7 తరగతి వరకూ ఇచ్చేది కేవలం 15 రూపాయలు, 7 నుండి 10 తరగతి విద్యార్దులకు 17 రూపాయలు. దీంతో మెనూ ప్రకారం మూడు రోజులు గుడ్లు, మూడు రోజులు పండ్లు, ఒక రోజు స్వీటు ఇవ్వటానికి కుదరటం లేదని వార్డెన్లు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం వారాల వారీగా పులిహోర, కిచిడి, ఉప్మా, వైట్‌రైస్, మద్యాహ్నం రాత్రికి పప్పు, కూరగాయలతో భోజనం వడ్డించడానికి కుదరటం లేదని వార్డెన్లు చెబుతున్నారు. హాస్టళ్లు మొదలై మూడు నెలలు గడుస్తున్నా అధికారులు ఇప్పటివరకూ వైద్య శిబిరాల ఊసే లేదు. దాంతో పిల్లలంతా రోగాల భారిన పడుతున్నారు. హాస్టళ్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నాయి. అదే విధంగాహాస్టళ్లకు నిత్యావసర సరుకులు సరఫరా చేసేందుకు ఈనెల 8న అధికారులు టెండర్లు నిర్వహించాల్సి ఉండగా ఆలస్యంగా టెండర్ల ప్రక్రియ ముగించారు. దాంతో వార్డెన్లు ఇతర కిరాణా దుకాణాల నుండి సరుకులు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అలాగే హాస్టల్‌లో వుండే బాలికలకు నూనె, సబ్బులు, వగైరాలకోసం నెలకు 75 రూపాయలు, బాలురకు 50 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఏడాదిలో జూన్ నెలలో ఒక్కో విద్యార్ధికీ కేవలం 35 రూపాయలు ఇచ్చారు. జూలై, ఆగస్టు నెలల బిల్లులు ఇవ్వవలసి ఉందని విద్యార్దులు తెలియచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్ చార్జీలను పెంచాలని, అలాగే నెలనెలా బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు.