సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు.. రానూ వచ్చాడు
posted on Aug 27, 2012 8:51AM
ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కాని బొత్స అక్కడ 5 రోజులున్నారు. కిరణ్‌కుమార్ రెండురోజులన్నారు. ఇద్దరూ అధిష్టానంతో విసృతమైన చర్చలు జరిపారు. కాసేపు గంభీరంగా ఉన్నారు. జర్నలిస్టులకు ఫోటో ఫోజులు ఇవ్వలేదు కేవలం ప్రభుత్వం శాఖ తీసిన ఫోటోలు మాత్రమే ప్రచురణకు వచ్చాయి. ఢిల్లీ నుండి ఆజ్మీర్ దర్గాకు వెళ్లిన బొత్స ఢిల్లీ విషయాల పై పెదవి విప్పటంలేదు. ఫలితంగా రాజకీయ వాతావరణం స్తబ్ధుగా మారింది. సీనియర్లు మాత్రం తుఫాను ముందు ప్రశాంతం అంటున్నారు. ఎప్పుడూ ఢిల్లీ నుండి రాష్ట్రానికి రాగానే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే వారు కాని ఈ సారి అదికూడా లేదు. అయితే శనివారం ఎస్సీ , ఎస్టీ ఉప ప్రణాళిక నివేదికపై మాట్లాడేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఢిల్లీ విషయాలు అడిగినా చెప్పకుండా దాటవేశారు .బొత్స కూడా అదే మెయిటైన్ చేస్తున్నారు.
మంత్రులతోనూ, ఎమ్మేల్యేల తోనూ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా కాస్త చొరవ చూపి ఏమైనా అడిగితే సమయం వచ్చినప్పుడు చెబుతానని చెబుతుండటంతో అశ్చర్యపడవలసి వస్తుంది. కళంకిత మంత్రులందరికీ ఉద్వాసన తప్పదని తెలిసినప్పటినుండి ముఖ్యమంత్రి, పిసిసి నేత గుంభనంగావుంటున్నారని కొందరంటున్నారు. పెదవి విప్పితే మంత్రులంతా ఎక్కడ తిరగబడతారోనని కూడా సైలెన్సు పాటిస్తున్నారని ప్రతిపక్షాలు గుసగుసలాడుతున్నారు. ఢిల్లీ నుండి రాగానే మంత్రి ధర్మాన రాజీనామాను గవర్నర్‌కు పంపుతారనుకున్న కిరణ్ ఇంతవరకు దాని మీద నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. గందరగోళ పరిస్థితిని అధిగమించడానికి అధిష్టానం మరో 48 గంటలు కావాలనుకున్నదని, అందుకే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా విపక్షాలకు తావివ్వకుండా మధ్యేయ మార్గంలో ఏదో ఒక నిర్ణయానికి రావడానికి గానూ సోమవారం ఢిల్లీకి రమ్మన్నారని తెలుస్తుంది. తినబోతూ రుచులడగటం ఎందుకు ఎలాగూ సోమవారం ఢిల్లీ వెళ్లి వచ్చి చెప్పాల్సిందేగా అంటున్నారు రాజకీయ మేధావులు.