రైతుల గతి ఇంతేనా...?
నాగర్‌కర్నూల్‌లో యూరియా కోసం ఎగబడిన రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ దాడిలో నలుగురు రైతులు గాయపడ్డారు. యూరియా కొద్దిగానే వచ్చిందని తెలిసి, తమదాకా రాదేమోనన్న ఆందోళనతో గుమికూడిన రైతులమీద పోలీసులు ప్రతాపం చూపించారు. అంతా అయింతర్వాత తీరుబడిగా తప్పులు దిద్దుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయిందన్న భావన ప్రజల్లో బాగా బలపడిపోయింది. దాన్ని వదులుకోవడం ఇష్టంలేదేమో ప్రభుత్వంకాని, అధికారులు కాని అలాగే ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా ధరలు పెరుగుతూనే ఉన్నాయ్. ధరలెందుకు పెరిగాయ్ అని అడిగితే పంటలు పండట్లేదు, దిగుబడులు సరిగ్గా లేవు అని చెప్పడంకూడా మామూలైపోయింది. పంటలు పండాలన్నా, దిగుబడులు ఎక్కువ రావాలన్నా ముందు ఆయా పంటలను పండించే రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, మందులు, నీరు, కావలసిన ఆర్థిక సహాయం, సలహా సహకారాలు అందించాలి. అయితే ఎరువుల కోసం ఆరాటపడిన రైతన్నకు పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలే దక్కాయి. చేప... చేప... ఎందుకు ఎండలేదంటే.. గడ్డివాము అడ్డమొచ్చింది..’ అన్నట్లు ... అమాయకులైన రైతుల్ని చావగొట్టిన పోలీసులు మీరంతా గలాటాచేశారు కాబట్టే మేం లాఠీ చార్జ్ చేయాల్సొచ్చిందంటూ సన్నాయి నొక్కులు నొక్కుటం విచిత్రంగా ఉంది.