కడలిలో కలిసిపోతున్న వరదగోదారి
వర్షాలు పుష్కలంగా కురిసినప్పుడు నదుల్లోకి భారీగా వచ్చిచేరే నీటిని కాపాడుకునేందుకు ఇప్పటివరకూ మనకు సరైన వ్యవస్థ లేదు. ఉన్న కొన్ని డ్యాముల్లో స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ. ప్రవాహం స్థాయిని మించితే నీళ్లను కిందికి వదిలేక తప్పని పరిస్థితి. ఏఏటికాయేడు ఇలాగే బండిని లాగిస్తూ ముందుకెళ్లాల్సొస్తోంది. విలువైన నదీజలాలు సముద్రంలో కలిసిపోతున్నాయ్. గోదావరి నీళ్లతో సస్యశ్యామలం కావాల్సిన భూములు కేవలం నిర్లక్ష్యం కారణంగా బీడు భూములుగా మారుతున్నాయ్. తీవ్ర వర్షాభావం తర్వాత భారీగా కురిసిన వానలకు గోదావరిలోకి చేరిన 10వేల టీఎంసీల నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సొచ్చింది. సగటున 90 టియంసి ల నీటిని ధవళేశ్వరం దగ్గర సముద్రంలో వదిలేశారని తెలంగాణ రైతులు బాధపడుతున్నారు.
ఇలా ప్రతిసంవత్సరం వర్షాకాలంలో 1500 నుండి 2500 టియంసిల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ లు పూర్తయ్యుంటే నిజామాబాద్,ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందేదని, 2వేల మెగావాట్ల విద్యుత్ ని ఉత్పత్తి చేయడానికి వీలయ్యేదని నిపుణులు చెబుతున్నారు. గోదావరి నదిపై సరైన ఆనకట్టలు కట్టి ఉంటే పరిస్థితి ఇలాఉండేది కాదంటున్నారు. ఇప్పటివరకూ సముద్రంపాలైన నీటితో దాదాపు కోటి ఎకరాల్లో ఆరుతడిపంటలు పండేవని అంచనా. 60 లక్షల ఎకరాల్లో అనాయాసంగా వరిసాగుచేసుకోగలిగుండేవాళ్లమంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్ట్ ల్ని పూర్తిచేస్తే రాబోయే కాలంలో కురవబోయే వర్షాన్ని, వృథాగా కడలిలో కలిసిపోయే నదీ జలాల్నీ కాపాడుకోవచ్చని రైతులు అంటున్నారు.