లంచాలతో నడుస్తున్న ప్రైవేట్ బస్సులు
posted on Aug 27, 2012 @ 9:59AM
రెండు నెలల క్రితం షిర్డీ వెళ్లే టూరిస్టు బస్సు ప్రమాదం దాని ఆపరేటర్ల అక్రమాలను వెలుగులోకి తెస్తూనే ఉంది. ఒకే నెంబరుతో రెండేసి టూరిస్టు బస్సులను నడపటం, సీట్ల సంఖ్య తగ్గించి చూపటం, బోర్డుపై ఒక రూటు, తిరిగేది మరో రూటు అని చెప్పటం వంటి పలు రకాల అక్రమాలు ఒకదాని తరువాత మరొకటిగా ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయన్న విషయం రవాణాశాఖ గుర్తించింది. అయితే దానికి తగ్గట్టుగా టూరిస్టు సంస్థలు రవాణాశాఖా ఉద్యోగులను మర్యాదపూర్వకం(అదేనండీ! ఆమ్యామ్యాలతో చక్కగా) చూసుకుంటున్నారు. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లలకు భారీగా చదివింపులు కూడా చేశారు. అయినా సంతృప్తికరంగా చెల్లించటం లేదని కొన్ని జిల్లాల్లో ఉద్యోగుల నుంచి బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా మాత్రం టూరిస్టుబస్సు అక్రమాలు వదిలేస్తే భవిష్యత్తులో విధినిర్వహణ చేయని శాఖగా మిగిలిపోతామని రవాణాశాఖ టూరిస్టు బస్సుల నిర్వాహకులతో చెప్పి మరీ, కొన్ని దాడులు చేస్తోంది. కేసుల కోసం జరిగే ఈ దాడులు కూడా అక్రమాలకు సాక్ష్యంగా తీసుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. షిర్డీ వెళ్లే బస్సు లోయలో పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా లెక్కిస్తే రాష్ట్రవ్యాప్తంగా వందలాది బస్సులు అక్రమమార్గంలోనే నడుస్తున్నాయని తేలింది. కొన్ని బస్సులు కట్టేఫైనులు రాష్ట్ర ఖజనాకు భారీగా వచ్చాయని కూడా గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జాతీయరహదారిపై రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించి మూడు టూరిస్టు బస్సులను సీజ్ చేశారు. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న ఏడు లారీలను పట్టుకున్నారు. యజమానులపై కేసులు నమోదు చేశారు.