కొణతాల కొంటెతనం
posted on Aug 27, 2012 @ 10:26AM
నిన్నటి వరకూ ఎమ్మెల్యేగా చిరపరిచితుడైన కొణతాల రామకృష్ణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక తన రెండోరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. తాను కర్రపెత్తనం చేస్తానన్నట్లు, గుడ్లిరిమి పార్టీలోని కార్యకర్తలను క్రమశిక్షణలో ఉంచుతానన్నట్లు వ్యవహరిస్తున్నారని విశాఖజిల్లాలోని వైఎస్‌ఆర్‌సిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మీరనుకున్నట్లు ఇక్కడేమీ జరగదు...టిక్కెట్లు గురించి నేనేమీ హామీ ఇవ్వను...ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు కుదరదు...’’అని కొణతాల ఒక హెచ్చరిక జారీ చేశారు. తనకే టిక్కెట్టు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్న నర్సీపట్నం నేతలను వారించారు. అలానే పార్టీలో చేరికల గురించి కూడా ఆయన తరువాత చూద్దాం అన్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా కన్వీనర్ మార్పుగురించి కొణతాల మాట్లాడుతూ మార్చాలని నేను చెప్పానే కానీ, ఎవరి పేరు సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు. తనకే టిక్కెట్టు వచ్చిందన్నట్లు వ్యవహరిస్తున్న వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పెట్ల ఉమాశంకర్‌గణేష్‌పై కొణతాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకుపోవాలన్న విషయం అంగీకరించని గణేష్‌పై రుసరుసలు ఆడారు. జగన్ నేరుగా మీకు చెబితే తిరగండి మీ ఇష్టం అని కొణతాల పరోక్షంగా గణేష్‌ను హెచ్చరించారు. తాను హైదరాబాద్, చిత్తూరు జిల్లాల పర్యటన ముగించుకుని వచ్చేంత వరకూ పార్టీ నిర్దేశిత కార్యక్రమాలను సజావుగా చేయాలని జిల్లా నాయకులను కొణతాల కోరారు. తిరిగి వచ్చాక అన్ని సమస్యలూ పరిశీలిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇంతకీ ఇంత కర్రపెత్తనం చేయటం కొణతాలకు అవసరమంటారా అని ఆ పార్టీ జిల్లా నేతలు గుసగుసలాడుకుంటున్నారు.