ఎవడబ్బసొమ్మని..?
posted on Aug 27, 2012 8:40AM
ఆరేళ్లలో రాష్ట్రంలో 60 స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. నేతలు పార్టీలు మారినప్పుడో, వేర్పాటువాదం పేరు చెప్పుకుని రాజీనామాలు చేసినప్పుడో ఆ స్థానాల్ని భర్తీ చేయడానికి ఉపఎన్నికలు జరపక తప్పని పరిస్థితి. టీ ఆర్ ఎస్ రాజీనామాల పర్వం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో బ్రహ్మకైనా చెప్పతరం కాదు. కాంగ్రెస్ లోంచి జగన్ వర్గాన్ని ఏరేసేందుకు చేసిన ప్రయత్నాలవల్ల మరోసారి ఉపఎన్నిక లొచ్చాయి. అయితే అభ్యర్థుల స్వలాభమో, లేక పార్టీలకు మూకుమ్మడి లాభమో రాజీనామాలు, కుప్పిగంతుల వెనకున్నఅసలు కాన్సెప్ట్ .. ఎన్నికల జరిపించిన ప్రతిసారీ కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. అభివృద్ధికి ఖర్చుపెట్టాల్సిన నిధుల్ని అనవసరంగా ఎన్నికలపేరుతో వృథాగా తగలేస్తే ఎవరికి లాభం అన్న ఆలోచనే ఏపార్టీకీ రాకపోవడం బాధాకరమైన విషయం. ఆరేళ్లలో ఇన్నిస్థానాలకు ఇన్నిసార్లు ఎన్నికలు జరిగాయాన్న విషయాన్ని తెలుసుకుని బ్రిటన్ నేతలు నివ్వెరపోయారు. కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాన్ని వ్యతిరేకించాల్సొచ్చినప్పుడు బ్రిటన్ లో కేవలం ఒకేఒక్క ప్రజాప్రతినిధిమాత్రం రాజీనామా చేసిన విషయాన్ని ఓ సారి తప్పకుండా గుర్తుచేసుకుని మన నేతలుకూడా తమనుతాము సరిదిద్దుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.