అధికారుల మధ్య కోల్డ్‌వార్
అత్యున్నత స్ధానాల్లో ఉన్న ఉన్నతాధికారులుకూడా నువ్వానేనా అని అహంకారాలతో మండిపోతూ పాలనా యంత్రాగాన్ని బ్రస్టు పట్టిస్తున్నారనటానికి ఇటీవల చాలా సంఘటనలు జరిగాయి. రాష్ట్ర డిజిపి పదవి ఎంపికలో ప్రభుత్వం సీనియారిటీని కాదని జూనియర్ దినేష్‌రెడ్డికి ఇచ్చారని, ఉమేష్‌కుమార్, గౌతమ్‌కుమార్ కోర్టుల కెక్కారు. ఒక కోర్టునుండి మరోకోర్టుకు వెళుతూ ప్రభుత్వం కాలయాపన చేయటాన్ని సహించలేని గౌతం కుమార్ స్వచ్చంధ పదవీ విరమణ చేశారు అలాగే మరో సీనియర్ అధికారి ఉమేష్‌కుమార్‌పై అవినీతి ఆరోపణలుచేశారు. ఆయన అవినీతికి పాల్పడ్డారని చెప్పటానికి సరైన ఆధారాలు లేవని కోర్టు రెండు రోజుల క్రితం పేర్కొంది. అలా రాష్ట్ర డిజిపి పదవికోసం అత్యున్నతులు అభాసుపాలవుతున్నారు.
ఆగస్టు 15న జెండా ఎగురవేతలోనూ మరికొన్ని పాలనా పరమైన విషయాల్లోనూ గిల్లీకజ్జాలు పెట్టుకున్న విశాఖజిల్లా ఐఎఎస్ అధికారులైన కలెక్టర్ లవ్‌అగర్వాల్, కమీషనర్ రామాంజనేయులను భరించలేని ప్రజలు వీరిని ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. దాంతో ప్రభుత్వం రెండు రోజుల క్రితం వారిరువురినీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా వుంచారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్పీ, ఎఎస్‌పీ ఇద్దరూ వివాదాల్లోకి వచ్చారు. ఎస్పీ త్రివిక్రమవర్మపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించిన ఎఎస్పీ నవీన్ కుమార్ తనకు ఎస్పీ నుండి ప్రాణభయం వుందని కేసునమోదు చేశారు. ఏజెన్సీనుండి గంజాయి రవాణాను అడ్డుకుంటుంన్నందునే తనను ఎస్పీ వేధిస్తున్నారని, లారీ గంజాయిని తరలించడానికి గానూ 1.40 లక్షలు తీసుకుంటున్నారని నవీన్‌కుమార్ ఆరోపిస్తూ తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు.
పాతకార్లు ఇవ్వడం, వాటికి మరమ్మత్తులు జరపకపోవడంతో కారు బోల్తాపడి గాయాలయ్యాయన్నారు. పోనీ సెలవుపై వెళదామనుకుంటే సెలవు కూడా మంజూరు చేయకుండా తనను వేధింపులకు గురిచేస్తున్నారని నవీన్‌కుమార్ ఆరోపించారు. అంతకు ముందు ఇదే జిల్లాలో పనిచేసిన ఎస్పీ నాగిరెడ్డి, ఎఎస్పీ రంగనాధ్‌కు మద్య ఇలాంటి పొరపచ్చాలే చోటు చేసుకున్నాయి. జిల్లా ఎస్పీగా ఉన్న నాగిరెడ్డి ఆయిల్ దొంగలను ప్రోత్సహించారని రంగనాధ్ ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా ప్రజలకు రక్షణగా వుండాల్సిన అధికారులు పరస్పర ఆరోపణలకు, కేసు నమోదు చేసుకోవడం సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఇకనైనా నీతిబాహ్యమైన చర్యలకు పాల్పడకుండా, బాధ్యతాయుతంగా, సమర్ధవంతమయిన పరిపాలనను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.