పగవాడిక్కూడా ఇలాంటి పాట్లొద్దు!
posted on Aug 26, 2012 @ 3:26PM
ముఖ్యమంత్రి పరిస్థితి, మంత్రుల పరిస్థితి క్షణం తీరికలేదు దమ్మిడీ ప్రజాసేవలేదు అన్నట్టుంది. కుర్చీలు కాపాడుకోవడానికి చిటికీమాటికీ ఢిల్లీ పెద్దలచుట్టూ చక్కెర్లు కొడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజాసేవను , పరిపాలనను పూర్తిగా గాలికొదిలేశారు. ఢిల్లీ పెద్దల అప్పాయింట్ మెంట్లకోసం రోజులకొద్దీ పడిగాపులు పడుతూ విలువైన సమయాన్ని వృథాచేస్తున్నారు. ప్రస్తుతం మన మంత్రులకు ప్రజల సమస్యలకంటే పదవుల్ని కాపాడుకోవడమే ఎక్కువైపోయిందని జనం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజూ కనీసం 2000మందితో కళకళలాడుతూ కనిపించే సచివాలయం బోసిపోతోంది. పరిపాలన పూర్తిగా కుంటుపడింది. కరెంటు కష్టాలు, ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ లాంటి ముఖ్యమైన సమస్యల్ని పట్టించుకోకుండా కుర్చీలాటలో తలమునకలైఉన్న నేతల్ని ప్రజలు తిట్టుకుంటున్నారు. సిబిఐ చార్జ్ షీట్, జగన్ వర్గాన్ని టార్గెట్ చేయడం, పదవులు కాపాడుకోవడానికి పైరవీలు చేసుకోవడం ప్రస్తుతం అధికారపక్షానికి పరమావధిగా మారిపోయింది.
అభివృద్ది మాట దేవుడెరుగు, రోజురోజుకీ రాష్ట్రం అధోగతి పాలవుతున్న సంగతిని మాత్రం ఎవరూ పట్టించుకోవడంలేదు.కేంద్రం నుండి పిలుపులు, ఢిల్లీలో మీటింగులు, రాష్ట్ర పరిపాలన ప్రక్షాళన లాంటి మాటలు తప్ప జనంగురించి పట్టించుకునే తీరిక , ఓపిక ప్రభుత్వంలోఉన్న పెద్దలకు లేకుండాపోయింది. అనిశ్చితి, అప్పులు, ఆర్థికమాంద్యం జనంమీద పిడుగుపాటులా పడే రోజు ఎంతోదూరంలో లేదన్న విషయాన్ని అందరూ గాలికొదిలేస్తున్నారు.