బాపిరాజు భక్తి గెలిచింది
posted on Aug 27, 2012 8:43AM
తిరుమల ... తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా కనుమూరి బాపిరాజుని మరోసారి ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమలేశుడే తనకు మరో అవకాశం ఇప్పించాడని కనుమూరి బాపిరాజు బలంగా నమ్ముతున్నారు. కొండలరాయడిమీద అత్యంత విశ్వాసాన్ని ప్రదర్శించే బాపిరాజు అత్యంత భక్తి ప్రపత్తులతో తన విధుల్ని నిర్వహిస్తారు. ఒక్కమాటలో చెప్పలంటే ఇప్పటివరకూ పాలకమండలి చైర్మన్ పదవిని చేపట్టిన మరే వ్యక్తీ ఇంత నమ్రతగా నడుచుకోవడాన్ని భక్తులు చూడలేదు. భగవంతుడి దర్శనంకోసం వచ్చే భక్తుల్ని ఆయన ప్రతీకలుగా భావించి గౌరవించాలనేది బాపిరాజు అభిమతం. అందుకే ఆయన ఎప్పుడూ మిగతావిషయాలమీదకంటే భక్తుల బాగోగులమీదే ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. వి.ఐ.పిలకు ఎంత ప్రాధాన్యమిస్తారో, సామాన్య భక్తులకు కూడా అంతే ప్రాధాన్యమిస్తారని బాపిరాజుకి భక్తుల్లో మంచిపేరుకూడా ఉంది. సౌమ్యగుణం, సత్ర్పవర్తన కలగలిసి బాపిరాజుకు మరోసారి టిటిడి చైర్మన్ పదవిని కట్టబెట్టాయన్నది చాలామంది అభిప్రాయం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి కనుమూరికి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ సమయంలో మొదటి ఓటుని వేసే అవకాశం కనుమూరి బాపిరాజుకే వచ్చింది. ఆయన చెప్పులు విప్పి.. భక్తితో కోనేటిరాయణ్ణి తలుచుకుంటూ వెళ్లి తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బాపిరాజు మంచితనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..?
పాలకమండలిలోకూడా పెద్దగా మార్పులు చేర్పులు జరగకపోవడం మరో విశేషం. ఒకరిద్దరు సభ్యులు తప్ప మిగిలినవారందరికీ పాలకమండలిలో బాపిరాజుతోపాటుగా మరోసారి ఛాన్స్ దక్కింది.