వినేవాడు వీపీ అయితే చెప్పేవాడు పీవీ అని..
ప్రపంచంలో ఏ రాజకీయనాయకుడైనా నదిలేని చోట వంతెన కడతానని, భోజనం మీ చేతులతో తినకుండా నాచేత్తోనే ప్రేమగా తినిపిస్తానన్నట్లుగా చెబుతారు. అలాగే వుంది అమెరికా అధ్యక్షుడు ఒబామా గారి మాటలు వింటుంటే. గెలిచిన తర్వాత వంతెన సంగతి ఎలావున్నా మంచినీటికి సైతం కొట్టుకోవాల్సిందే. తన చేత్తో తినిపించడం సంగతి ఎలా వున్నా... తినేందుకు దొరికితే చాలు. ప్రపంచంలోని దేశాలన్నిటిలో అత్యంత అబద్ధాలు, జగడాలమారి దేశం (పాలకులు సుమా, ప్రజలు కాదు) ఏది అని ఓటింగ్ పెడితే ప్రథమ స్థానం అమెరికాకే వస్తుంది. అది ముమ్మాటికి నిజం. అమెరికా చేసిన యుద్దాలమీద ఒట్టు.
అటువంటి అమెరికా మొదటినుండి ప్రపంచంలోని దేశాలన్నిటికి పెద్దన్నగా తనను తాను ప్రకటించుకుంది, చెప్పుకుంటుంది. అమెరికా అధ్యక్ష పీఠానికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షపీఠంపైనెక్కి అమెరికా ప్రజల ఆకాంక్షలు తీరుస్తున్నానంటూ మరోసారి తననే ఎన్నుకోమని ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా డెమోక్రాటిక్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గతంలో కూడా ఆయన డెమోక్రాటిక్ అభ్యర్థిగానే పోటీచేశారు. మరోసారి అవకాశమిస్తే నాలుగేళ్ళలో దేశరూపురేఖలు మారుస్తానని, యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పిస్తానని, ఆర్థికవ్యవస్థను చక్కబెడతానని, ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందిస్తానని, అమెరికన్ల భద్రతకు పాటుపడతానని చెప్పుకున్నారు. అంతేకాదు తన అధ్యక్ష పీఠానికి ప్రత్యర్ధిగా నిలబడిన రోమ్నీ గెలుపొందితే దేశ సంక్షోభంలో పడిపోతుందని హెచ్చరించారు. గతంలో వున్న చాలామంది అధ్యక్షుల తీరు కూడా ‘నెమలికంట కన్నీరు కారితే, వేటగాడికి ఏమైనా ముద్దా’ అన్నట్లు ఉండేవి. గత ఎన్నికల్లో ఒబామా మాటలు, ప్రపంచదేశాలపై చూపించిన ప్రేమ, వాగ్ధానాలు, నేటి ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన స్థితిగతులు గుర్తున్న అమెరికా ప్రజలు ‘కుప్ప తగులబెట్టి పేలాలు ఏరుకుతిన్నట్లు, (ఇతరదేశాలమీద యుద్ధాలపేరుతో ఆర్థికవ్యవస్థ విచ్ఛిన్నం) కోడిగుడ్డుపై ఈకలు పీకిన’ (యువతకు ఉద్యోగాలు, శాంతిభద్రతలు) చందమని తెలుగువారి నానుడులను ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసుకుని చెప్పుకుంటారు.