చెక్ పోస్ట్ దొంగలు
posted on Aug 27, 2012 @ 10:19AM
ఎర్రచందనం స్మగ్లర్లు అడవులను ఆక్రమిస్తున్నారు. దాదాపు కొన్ని ప్రాంతాల్లో తమను కవర్ చేసేందుకు గ్రామస్తులను కూడా లొంగదీసుకుంటున్నారు. ప్రత్యేకించి గిరిజనులు ఉండే అడవుల్లో వారిని మభ్యపెట్టి తమ పక్కన తిప్పుకుంటున్నారు. ఇటీవల దాడుల్లో స్మగ్లర్ల స్థానంలో గ్రామీణులు, గిరిజనులు పోలీసులకు, అటవీశాఖాధికారులకు దొరుకుతున్నారు. అంటే స్మగ్లర్లు తమ ఉనికిని చాటుకోకుండా తగిన జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. అయితే అటవీశాఖాధికారులు నెంబరింగ్ చేయని ఎర్రచందనం చెట్లను దర్జాగా ఎటువంటి అనుమతులు అవసరం లేకుండా స్మగ్లర్లు ఊర్లు దాటించేస్తున్నారు.
అయితే సినీఫక్కీలో అటవీశాఖాధికారులు, పోలీసులు మభ్యపడేలా స్మగ్లర్లు వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక చెక్‌పోస్టుకు దగ్గరగా అటవీశాఖా ధికారులకు ఒక వ్యాను పది దుంగలు దొరుకుతాయి. వీటిని చూడగానే అధికారులు దానిపై కేసు బుక్ చేసుకుంటుండగా, మరో వాహనంలో భారీసరుకు దారి మళ్లి వెళ్లిపోతుంది. పెద్దసరుకు దొరక్కుండా స్మగ్లర్లే ట్రిప్పుకు పది దుంగలు దొరికే ఏర్పాట్లు చేశారు. దొరికిన దుంగలను చూసి పోలీసు అధికారులు, సిబ్బంది కేసు నమోదు చేసే పనిలో ఉండగా కూడా భారీసరుకు గమ్యానికి చేరుకుంటోంది. అలానే అడవుల్లో నెంబరు వేయని చాలాచెట్లు స్మగ్లర్ల ధాటికి దుంగలుగా మారుతున్నాయి. ఇలా చెట్లు నరుకుతూ పోతుంటే భవిష్యత్తులో ఎలా బతకాలని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా వర్షాలు వచ్చే అవకాశాలు కూడా కరువవుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా కడపజిల్లా సుండుపల్లి మండలం పింఛ అటవీప్రాంతంలో బీటుసున్నపుగుండు సమీపంలో పది ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. అయితే పది మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని వీరంటున్నారు. దొరికిన స్మగ్లర్లు చిత్తూరు జిల్లా కలకడ మండలం నాయినివారిపల్లెకు చెందిన వారని గుర్తించారు.