రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళి హైలెట్స్
రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళి అతిరథమహారథుల సమక్షంలో ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. మొయినాబాద్ సమీపంలోని టెంపుల్ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ రోజు ఉదయం 9.30 నిమిషాలకు ఉపాసన మెడలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మూడుముళ్లు వేశారు. పెళ్లి మండపం, పరిసరాలను సినీ ఆర్ట్ డెరైక్టర్ ఆనంద్‌సాయి అత్యంత ఖరీదైన హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వరుడు, వధువు కుటుంబ బంధువులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులలో మూడు వేల మందికి మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానాలు అందజేశారు.
ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి అమితాబచ్చన్, రజనీకాంత్, శ్రీదేవి-బోణి కపూర్, అంబరీష్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, డి.రామానాయుడు, దాసరి, వెంకటేష్, శ్రీకాంత్, బ్రహ్మానందం, మురళీ మోహన్, సుమలత, టీఎస్సార్, బోయపాటి, రాణా, విష్ణు, ఆహుతీప్రసాద్, వేణుమాధవ్, ఉత్తేజ్, శ్రీనువైట్ల తదితరులు హాజరయ్యారు. రాష్టగ్రవర్నర్ నరసింహన్ దంపతులు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, సీఎం కిరణ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, రఘువీరా రెడ్డి, జానారెడ్డి వివాహ వేడుకకు హాజరయారు.
వివాహ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవి, అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానించారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్ కళ్యాణ్, బన్నీల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఈ సందర్భంగా రాంచరణ్ అత్తమామలు రూ.రెండుకోట్లు ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారును అల్లుడికి బహూకరించారు.