నర్సాపురంలో వెనుకబడ్డ తెలుగుదేశం
పశ్చిమ గోదావరి వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యకేంద్రంగా విరాజిల్లుతున్న నర్సాపురంలో ప్రధానంగా ద్విముఖపోటీ ఉంటుందని పరిశీలకులు అంచనాకు వచ్చారు. కాంగ్రెస్, వై,ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు రెండూ 2012 ఉప ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడతాయని వారు తేల్చిచెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎం.ఎన్.వి.ప్రసాదరాజు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓటుబ్యాంకు ఉన్నా ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా స్పందన రాకపోవచ్చని అంచనాలున్నాయి. అయితే గెలిచే అభ్యర్థి మెజార్టీపై తెలుగుదేశం ప్రభావం చూపుతుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం లక్షా 41వేల 834 మంది ఓటర్లున్నారు. కొత్తగా 7 వేలమంది ఓటర్లు పెరిగారు. ఈ నియోజకవర్గం పరిథిలో మొగల్తూరు, నర్సాపురం, భీమవరం (పాక్షికంగా) మండలాలున్నాయి. 1951లో ద్విసభా నియోజకవర్గంలో ఇక్కడ నుంచి పాడెల శ్యామసుందరరావు, భూపతిరాజు లక్ష్మీనరస రాజు గెలుపొందారు. 1955లో గ్రంథి వెంకటరెడ్డి, 1967లో ఎస్.ఆర్.రుద్రరాజు శాసనసభ్యులయ్యారు. 1962, 1972, 197ల్లో పరకాల శేషావతారం విజయం సాధించారు. 1983, 1985ల్లో చేగొండి వెంకట హరి రామజోగయ్య, 1989, 1994, 1999, 2004 ల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు విజయం సాధించారు.
2004లో టిడిపి అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు కనగ్రేస్ అభ్యర్థి నాగరాజవరప్రసాదరాజుపై 3518 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సుబ్బారాయుడు 63288 ఓట్లు, వరప్రసాదరాజుకు 59770 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఎన్.వి.ప్రసాదరాజు, తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడుపై 17500 ఓట్లు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈసారి ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయటంతో కాంగెస్ అభ్యర్థిగా కొత్తపల్లి సుబ్బారాయుడు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ లోనే ఉన్న ప్రసాదరాజు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ కు మారారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ జరుగుతోంది. కాంగ్రెస్ తరుపున ఇటీవల నియోజకవర్గంలో ప్రచారం చేసిన సిఎం, కాంగ్రెస్ పెద్దలు ప్రసాదరాజును విమర్శించటంతో ఆయన సుబ్బారాయుడుపై ఏమైనా సరే గెలుపొందాలని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. సుబ్బారాయుడు కూడా ప్రసాదరాజును చిత్తూ చేసి గతంలో ఆయన సాధించిన మెజార్టీని దాటాలని కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. దీంతో పార్టీలమధ్య పోరు కాస్తా వ్యక్తిగత పట్టుదలగా మారింది. కార్యకర్తలు దీన్ని సానుకూలంగా మలుచుకుంటున్నారు.