14 స్థానాల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుపు ఖాయం?
14 స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ గెలుపు ఖాయం? మూడు స్థానాల్లో పోటాపోటీ! పరకాలలో టి.ఆర్.ఎస్. కు ఛాన్స్?
రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి ధాటికి ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగువన్.కామ్ కు సమాచారం ప్రకారం ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 14 స్థానాల్లో (నరసన్నపేట, రామచంద్రాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, అనంతపురం, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు) నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాయకరావు పేటలో తెలుగుదేశం అభ్యర్థి చెంగల వెంకట్రావు, నరసాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ, పరకాలలో టి.ఆర్.ఎస్. అభ్యర్థి భిక్షపతి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన రెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 17 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఒక్క పరకాల నియోజకవర్గంలో మాత్రమే బహుముఖ పోటీ ఉంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించబోతున్న ఈ ఎన్నికలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగానూ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పెను సవాల్ గానూ మారాయి.
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఈ పార్టీలు మొదటిసారిగా డబ్బు, మద్యంతో పాటు వెండి, బంగారం ఆభరణాలు కూడా పంచినట్లు వార్తలు వచ్చాయి. 2009లో రాష్ట్రంలో 42లోక్ సభ, 294 అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలీసులు కేవలం 32కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోగా, ప్రస్తుత 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం పరిథిలో ఇప్పటికే 54కోట్ల రూపాయల నగదు స్వాధీనపర్చుకున్నారు .నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువైన మద్యం, బంగారం, వెండి వస్తువులు కూడా స్వాధీన పర్చుకున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకాలే వెల్లడిచేస్తున్నాయి.
రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 18మంది జగన్ అభిమాన శాసనసభ్యులు ఓటు వేయడంతో స్పీకర్ వారి శాసన సభ్యత్వాలను రద్దు చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్రమాస్తుల కేసులో సిబీఐ జగన్ ను అరెస్టు చేసింది. జగన్ అరెస్ట్ వల్ల కాంగ్రెస్ కు లాభం లేకపోగా నష్టమే జరిగింది. సోనియా ఆదేశాలతో సిబీఐ జగన్ ను అరెస్టు చేసిందనే అభిప్రాయం సామాన్యప్రజల్లో ఏర్పడింది. తర్వాత వై.ఎస్. రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ, ఆయన కూతురు షర్మిల ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. వీరు ప్రచారానికి వెళ్ళిన ప్రతిచోటా ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు. మధ్యతరగతి, పెదవర్గాల్లో వై.ఎస్. అంటే ఇంకా అభిమానం ఉంది. వై.ఎస్. కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలను వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులు ఉన్నారని, డబ్బు, పదవుల కోసమే వారు రాజకీయాల్లోకి వస్తున్నారని, వై.ఎస్. తింటే తిన్నాడు పేదలకు ఎంతో కొంత చేశాడనే ఉదాసీన భావన ఓటర్లలో పేరుకుపోయింది. ఈ భావనే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కారణమవుతోంది. దీనికితోడు ఓదార్పు యాత్ర పేరుతొ రాష్ట్రమంతటా తిరుగుతున్నా జగన్ ను అరెస్టు చేయడంతో సాధారణ ఓటర్లు ఆయనపై సానుభూతి చూపుతున్నారు. 2009లో 72 కోట్ల ఆస్తి తన పేరా ఉన్నదని జగన్ ప్రకటించాడు. 2011 నాటికి ఆ ఆస్తుల విలువ 430 కోట్లకు పెరిగింది అంటే రోజుకు 50లక్షల రూపాయల చొప్పున జగన్ ఆస్తుల విలువ పెరిగింది. ఆస్తులతో పాటు అవినీతి ఆరోపణలు కూడా రావడంతో ప్రస్తుతం కస్టడీలో ఉన్న జగన్ కు ఇప్పటికీ ప్రజామద్ధతు లభిస్తుండడం విశేషం.