రెండో దపా జగన్ మొదటిరోజు సిబిఐ కస్టడి పూర్తి

రెండో దపా జగన్ మొదటిరోజు సీబీఐ విచారణ పూర్తయింది. నేడు జగన్ ను సిబిఐ విదేశి పెట్టుబడులు పైన విచారించినట్టు తెలుస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయం పదిన్నరకు చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను సీబీఐ తమ కస్టడీకి తీసుకుంది. బులెట్‌ప్రూఫ్‌ వాహనంలో జగన్‌ను కోఠిలోని సీబీఐ ఆఫీసుకు తరలించారు. జగన్‌ తరఫు లాయర్ల సమక్షంలో అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రధానంగా విదేశీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన్నట్టు తెలుస్తోంది. అలాగే, జగన్ విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, ఆయన కంపెనీల్లో విదేశీ సంస్థలు పెట్టిన పెట్టుబడులపై సీబీఐ అధికారులు విచారించిన్నట్టు సమాచారం. కాగా, జగన్‌ను ఇప్పటికే ఐదు రోజుల పాటు సీబీఐ విచారణ జరిపిన విషయం తెల్సిందే.

నిబంధలకు నీళ్ళోదులుతున్న 'తిరుపతి' పార్టీలు?

పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ పార్టీలు ఎన్నికల కమీషన్ పెట్టిన నిబంధనలకు నీళ్ళోదులుతున్నాయి. డబ్బు తీసుకున్న ఓటరును కూడా జైలుకు పంపిస్తామని ఎన్నికల కమీషన్ హెచ్చరించినా దాన్ని ఓటరు కానీ, అభ్యర్థులు కానీ పరిగణలోకి తీసుకోవటం లేదు. నిన్నటిదాకా నిజాయితీగా ప్రచారంపైనే ఆధారపడిన పార్టీలు నేడు ఓట్లు ఖాయం చేసుకోవాలని ఆతృత పడుతున్నారు. ముందుగా కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసేశారు. వారి ద్వారా బూత్ లు, వార్డులు, వీథుల వారీగా ఓటరుకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసేశారు. తిరుపతి నియోజకవర్గంలో అన్ని ప్రదానపార్తీలు ఇదే తీరులో ప్రచారం సాగిస్తున్నాయి. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నిబంధనలను తుంగలోకి తొక్కటంలో ముందుందని విమర్శలు వ్యాపించాయి. అంతేకాకుండా మిగిలిన పార్టీలు చేసిన సవాల్ కు స్పందించి పోలీసులు ఒక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తనిఖీ చేస్తే పదివేల రూపాయలు పంపిణీ కోసం ఉంచుకున్న డబ్బు బయటపడింది. ఆ కార్యకర్త కె.అనిల్ తనకు పార్టీ నుంచే డబ్బులు వచ్చాయని పోలీసుల ఎదుట అంగీకరించాడు. జిల్లాలో మూడురోజుల పాటు మద్యం డ్రైడేను ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5గంటల వరకూ డ్రైడే పాటించాలని మద్యం దుకానదారులకు నోటీసులు పంపామని ఎక్సయిజ్ డిసి చంద్రమౌళి అన్నారు. ఇప్పటికే 60 శాతం ఫోటో ఓటరు చీటీలు పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో తొలుత తెలుగుదేశంపార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి బి.ఎస్.ఇన్.ఎల్. ఉద్యోగులను ఓటు అడగటంతో ప్రారంభమైన అపశ్రుతి ఎన్నికల నిబంధలను తుంగలోకి తోక్కెంత వరకూ కొనసాగుతోంది.

చిన్నమ్మ ప్రచారం వెనుక రహస్యం ఏమిటో?

మొన్నటి దాకా విశాఖ ఎంపిగా ఉన్న తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి తరపున కేంద్రమంత్రి పురందరేశ్వరి (చిన్నమ్మ) కొంచెం గట్టిగానే ఓట్లు అభ్యర్థించారు. ఆమె విశాఖ వచ్చేయతంతో నెల్లూరు పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్నారు. తనకు ఇవ్వాల్సిన సీటు ఆమెకు ఇచ్చారని గతంలో సుబ్బిరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సుబ్బిరామిరెడ్డి తన సొంతూరుకు సేవ చేసే అవకాశం లభిస్తోందని చెబుతూ ఆయన్ని నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు ఒప్పించారు. దీంతో పోటీ అనివార్యమానుకున్న సుబ్బిరామిరెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా గెలుపొందాలని గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. మొన్నటిదాకా కుమారుని చదువు నిమిత్తం అమెరికా వెళ్ళిన పురందరేశ్వరి ఎన్నికల ప్రచారం నెల్లూరుతో పారంభించింది. ఇదేంటి చిన్నమ్మ సుబ్బిరామిరెడ్డితో కలిసి ప్రచారరథంపై వెడుతూ ఓట్లు అభ్యర్థిస్తోందని ముందు అందరూ ఆశ్చర్యపోయారు. సుబ్బిరామిరెడ్డి నెల్లూరు ఎంపి అయితే ఆయనకు కొంత ఊరట ఇచ్చినట్లు అవుతుందని భావించి చిన్నమ్మ సీరియస్ గా ప్రచారం చేసిందని చెప్పుకుంటున్నారు. సుబ్బిరామిరెడ్డి నెల్లూరులో స్థిరపడితే తను ప్రస్తుతం ఉన్న విశాఖ నియోజకవర్గాన్ని వదలాల్సిన అవసరం ఉండదని ఆమె భావించి ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా చిన్నమ్మ ప్రచారం వెనుక అసలు రహస్యం ఇది అని తేల్చలేని పరిస్థితులున్నాయి.

రాయదుర్గం యువతకు మహర్ధశ

కడప జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో యువకులకు మహర్ధశ పట్టింది, వీరికి అల్పాహారం, ఇతర అవసరాలు పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉప ఎన్నికల పుణ్యమా అని అభ్యర్థులే ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ లో యువకులకు అభ్యర్థులు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. కోరితే ఉచితంగా మద్యం అందిస్తున్నారు. అలానే ఇళ్ళకు తీసుకువెళ్ళేందుకు మాంసాన్ని కూడా అందజేస్తున్నారు. ఒక్క యువకుల అవసరాలు తీర్చేందుకు బూత్ కు రెండువేల రూపాయల చొప్పున అభ్యర్థులు కేటాయించారు. నియోజకవర్గంలో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని గమనించిన అభ్యర్థులు వారికి సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలోని కణీకల్లు మండలంలో ఓటర్లకు రూ, ఐదొందల చొప్పున పంపిణీ చేశారు. తమకు గతంలో మాదిరిగా తక్కువ డబ్బులు ఇస్తే ఓట్లేసేది లేదని దబాయించి మరీ డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది.

కోట తోట వశం అవుతుందా?

తూర్పుగోదావరి జిల్లా కోట రామచంద్రాపురం కొత్త శాసనసభ్యుడు ఎవరు? అన్న అంశంపై జిల్లాలో ఆసక్తి నెలకొంది. ఏ ముగ్గురు కలిసినా ఈ విషయంపైనే చర్చకు తెరలేపుతున్నారు. చారత్రక కోట రామచంద్రాపురం నియోజకవర్గంలో రామచంద్రాపురం అర్బన్, రామచంద్రాపురం రూరల్, కె.గంగవరం, కాజులూరు మండలాలున్నాయి. రామచంద్రాపురం అర్బన్ లో 27వార్డులు. రూరల్ లో 24 గ్రామాలు, కె.గంగవరంలో 26 గ్రామాలు, కాజులూరు మండలంలో 22 గ్రామాలున్నాయి. ఇటీవల విభజన తరువాత కాజులూరు మండలం నియోజకవర్గంలో కలిసింది. ఈ మండలమే గత ఎన్నికల్లో తాజామాజీ ఎమ్మెల్యే బోసు విజయానికి కారణమైంది. రామచంద్రాపురం అర్బన్ నియోజకవర్గంలో 30,267, రూరల్ లో 48,369, కె.గంగవరం మండలంలో 45,206, కాజులూరు మండలంలో 47,701 మంది ఓటర్లున్నారు. ఎక్కువ ఓటింగ్ శాతం కూడా కాజులూరులోనే నమోదవుతుంది. అందువల్ల గెలిచే అభ్యర్థి మోజార్తీకి ఈ మండలం కీలకమవుతోంది. ఇక్కడ తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చిక్కాల రామచంద్రరావు గతంలో తాళ్ళరేవు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటప్పుడు ఈ మండలంలో సత్సంబంధాలు నడిపేవారు. అయితే కాజులూరు మండల ప్రజలకు చిక్కాల తమకు ఏమీ చేయలేదని కోపం. ఐదుసార్లు కోరి గెలిపించుకుంటే తమకు అన్యాయం చేశారని ఆయనను దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆయన గెలుపుదాదాపు అసాధ్యమని తేలుతోంది. మంత్రిగా ఉన్నప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాజులూరు ప్రజలతో సంబంధాలు నెరిపారు. కానీ, ఆయన చివర్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కి మారి ఆ పార్టీ అభ్యర్థి అయ్యారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అరెస్టు నేపథ్యంలో ఈయనకూ ఇక్కడ పెద్దగా స్పందన లభించటం లేదు. రామచంద్రాపురం నియోజకవర్గానికి పాతకాపే అయినా కాపు సామాజికవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఈ మండలంలో కొత్తగా కనిపిస్తున్నారు. విభజనకు పూర్వం ఈ మండలం తాళ్ళరేవులో ఉండేది. అందుకని కాంగ్రెస్ అభ్యర్థి తోటను కాజులూరు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. వీరి ఆదరణ ఈయన గెలుపునకు బాట వేస్తుందని భావిస్తున్నారు. కాజులూరు ఓటర్లు పోటీలో ఉన్న ముగ్గురిలో తోటకు ఆకర్షితులవుతున్నారు.

సుబ్బిరామిరెడ్డిని బాబు నేరుగా విమర్శించలేరా?

తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి అన్న పేరు వినగానే ఓ పారిశ్రామికవేత్త, ఓ సినీనిర్మాత, ఓ రాజకీయపార్టీ నేత అన్న మూడు విభిన్న కోణాలు ఒకేసారి ఆవిష్కృతమవుతాయి. అంతేకాకుండా కళాబంధు బిరుదును ఆయన పొందారు. దీంతో ఎంతటి నేతలైనా ఆయనకు గౌరవమిస్తూనే వచ్చారు. అదేమీ చిత్రమో అందరినీ విమర్శలతో చెలరేగేసిన నాయకులు కూడా ఆయన ముందు గౌరవంగానే ఉంటారు. అటువంటి ఇబ్బందే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నారు. సుబ్బిరామిరెడ్డి పేరును ఉచ్చరించకుండా ఆయన కంపెనీ పేరు ఉదాహరిస్తూ బాబు విమర్శనాస్త్రాలను వదిలేశారు. బాబు మాటలను గమనిస్తే అందరినీ వ్యక్తిగతంగా విమర్శించి సుబ్బిరామిరెడ్డికి మాత్రం మినహాయింపు ఇచ్చారని అనిపిస్తోంది. అక్రమ సొమ్ముతో ఇక్కడ ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మేకపాటి, ఆనం సోదరులు నెల్లూరు జిల్లాను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెఎంసి, గాయత్రి కన్ స్ట్రక్షన్స్ (సుబ్బిరామిరెడ్డి కంపెనీ) నాసిరకం పనులు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటుకు రెండు వేలు, మూడు వేలు ఎంతడిగితే ఆనతిచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారని బాబు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నాలుగులైన్లలో మేకపాటి, ఆనం సోదరులను నేరుగా విమర్శించిన బాబుకు సుబ్బిరామిరెడ్డిపై సాఫ్ట్ కార్నర్ ఉందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. లేకపోతే తమ నేత విమర్శ పదును తగ్గించటమేమిటని వారు తిరిగి ప్రశ్నిస్తున్నారు.

పచ్చచొక్కాలకు ఆరుస్థానాల్లో అవకాశం?

ఈ 2012 ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఆరుస్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్కాగా రెండు స్థానాలు, బలంగా ఉన్న నాలుగుస్థానాలు కలిపి ఆరు తమదేనని తెలుగుదేశంపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పక్కగా గెలుస్తామని ఆ పార్టీ చెప్పుకుంటున్న రెండింటిలో ప్రత్తిపాడు, పాయకరావుపేట ఉన్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వీరన్న, విశాఖజిల్లా పాయకరావుపేట అభ్యర్థి చెంగల వెంకట్రావు గెలుపొందుతారు. వీరి తరువాత బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుపతి, ఎమ్మిగనూరు, మాచర్ల, రాజంపేట ఉన్నాయి. తిరుపతి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని కులసంఘాలూ బహిరంగ మద్దతు ఇస్తున్నాయి. ఎమ్మిగనూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బివి మోహనరెడ్డి గెలుపొందవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు.

జగన్ ఆస్తుల కేసు: సిబీఐ విచారణ కోసం సెలవు కోరిన ఐఎఎస్

సిబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నందున ఈ నెల 10,11 తేదీల్లో తనకు సెలవు ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి భంవార్ లాల్ ను కోరారు. ఇటీవల సిబీఐ తన నాలుగో ఛార్జిషీటులో కలెక్టర్ పేరును ఎ-5 గా జత చేసింది. తనకు మే 30వ తేదీన పంపించిన సమన్లు అందాయని వెంకట్రామిరెడ్డి వివరించారు. ఎన్నికల్లో జిల్లా ప్రధాన రిటర్నింగ్ అధికారిగా ఉన్న తనకు విచారణ నిమిత్తం రెండు రోజుల శెలవు మంజూరు చేయాలన్నారు. తమ జిల్లాలో నసరన్నపేట ఎన్నికలు సక్రమమైన రీతిలో జరిగేందుకు ఏర్పాట్లు చేశానని వివిరించారు. ఎన్నికల కమీషన్ అనుమతిస్తే జూన్ 11వ తేదీన సిబీఐ ఎదుట హాజరవుతానని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటి వరకూ ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య సిబీఐ ఎదుట హాజరై ప్రస్తుతం చెంచల్ గూడ జైలులో ఉన్నారు. మూడో ఐఎఎస్ అధికారిగా వెంకట్రామిరెడ్డి విచారణకు సిద్ధమయ్యారు.

జగన్ కోసం రాయలతెలంగాణాకు కేసీఆర్ సిద్ధం?

రాయలసీమ, తెలంగాణా కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రంగా పెడితే బాగుంటుందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో సిబీఐ కస్టడీలోకి వెళ్ళకముందు ప్రణాళిక రూపొందించారు. తాజాగా ఈ విషయంపై తెలంగాణా రాష్ట్ర సమితి నేతలతో చర్చించిన కెసీఆర్, జగన్ తో దోస్తానా కోసం దీనికి సమ్మతించారట. అంటే జగన్ బయటికి వచ్చాక ఈ విషయమై ఉద్యమ చేస్తే కెసీఆర్ కూడా పాలుపంచుకుంటారన్న మాట. అయితే వాస్తవానికి జగన్ అధికారం కావాలని కోరుకున్నది మాత్రం యావత్తు సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే అని కెసీఆర్ గ్రహించలేదు. కేవలం ప్రత్యేక తెలంగాణా సాధ్యం కాదు కాబట్టి అందరినీ ఆకట్టుకోవటానికే జగన్ ఈ సూత్రీకరణ చేశారని కెసీఆర్ గుర్తించలేదు. అందుకే దోస్తానా కోసం ప్రత్యేకరాయల తెలంగాణాకూ జైకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని అప్పుడే బయటపెట్టొద్దని సన్నిహితులను కెసీఆర్ కోరారట. కానీ, వారు మీడియా ముందు తప్పించుకోలేక విషయం కక్కేసి వెళ్ళిపోయారు.

నెల్లూరు పోలీసు మామలకు ఎన్నికల మామూళ్ళు?

ఇప్పటిదాకా ఓటర్ల కోసం ఖర్చు చేసిన అభ్యర్థులు ఇప్పుడు పోలీసు మామలను మామూళ్ళతో సంతృప్తిపరుస్తున్నారు. ఈ మామూళ్ళను నెల్లూరులోని స్టేషన్లవారీగా పంపించారు. అయితే పంపిణీ చేయటానికి పార్టీ తరపున వెళ్ళిన వ్యక్తి మామూళ్ళ పంపకంలో తేడా చేశారని గొడవ జరగడంతో విషయం లీకైంది. రాష్ట్రంలోని ఒక ప్రధానపార్టీ అభ్యర్థి ఈ మామూళ్ళను ఒకటి, మూడో నగర పోలీసుస్టేషన్లకు పంపించారు. స్టేషనుకు రూ.60వేల చొప్పున కేటాయించారు. అయితే ఈ రెండు స్టేషన్ల కానిస్టేబుల్స్ లో ఒకరికి రూ.600, వేరే స్టేషన్ కానిస్టేబుల్ కు 800రూపాయలు మామూళ్ళ కింద అందాయి. అసలే పోలీసులూ అందులోనూ మామూళ్ళ సమస్య ఎవరిని తక్కువ చేసినా ఊరుకోరు కాబట్టి ఇదేమి పంపిణీ రా అని పంపిణీదారుడిని నిలదీశారు. దీంతో విషయ, వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కానిస్టేబుల్స్ మొఖం చాటేస్తున్నారు.

దేశంలోనే అత్యంత ధనిక అభ్యర్థిగా దీపక్ రెడ్డి

2012 ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కడపజిల్లా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనికనేతగా గుర్తింపునందుకున్నారు. ఎన్నికల కమీషన్ ఆయన సమర్పించిన అఫిడవిట్ లో దీపక్ రెడ్డి ఆస్తి విలువ రూ.6,781కోట్లు. అప్పులు రెండుకోట్లు మాత్రమే. అయితే ఈయన ఆస్తి అంతా హైదరాబాద్ పరిసరాల్లోనూ, రంగారెడ్డి జిల్లాలోనూ కేంద్రీకృతమై ఉంది. అంతేకాకుండా ఆస్తిలో ఎక్కువభాగంగా అత్యంత విలువైన భూములున్నాయి. హైదరాబాద్ నగర శివారు జహీరాబాద్ లో రూ.3218 కోట్ల విలువైన 3128 ఎకరాల బూమి దీపక్ రెడ్డికి ఉంది. బంజారాహిల్స్ లో 37 ఎకరాల 24గుంతల భూమి, ఎమ్మెల్యే కాలనీలో 19 ఎకరాలు దీని విలువ రూ,367.8కోట్లు, బంజారాహిల్స్ పరిసరాల్లోనే రూ. 463కోట్ల విలువైన 18 ఎకరాల 24 గుంటల భూమి, గుడిమల్కాపూర్ వద్ద 943.8 కోట్ల విలువైన భూమి, బండ్లగూడలో రూ. 331.5కోట్ల విలువైన స్థలం దీపక్ రెడ్డికి ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్ గూడలో రూ. 529.10కోట్ల విలువైన భూమి, భార్య అమితారెడ్డి పేరిట రూ. 9.70కోట్ల ఆస్తి ఉన్నాయి. పిల్లలిద్దరి పేరిట కూడా ఆస్తులున్నాయని దీపక్ రెడ్డి తన అఫిడవిట్ లో ధ్రువీకరించారు.

సినీ దర్శకుడు కేఎస్‌ఆర్ దాస్ మృతి

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రఖ్యాత సినీ దర్శకుడు కేఎస్‌ఆర్ దాస్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. శనివారం చెన్నైలో అంత్యక్రియలు జరుగనున్నాయి. కేఎస్‌ఆర్ దాస్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 'లోగుట్టు పెరుమాళ్ల కెరుక' చిత్రంతో దర్శకుడిగా మారిన కేఎస్‌ఆర్ దాస్ 100 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌తో దాస్ తీసిన 'యుగంధర్' సంచలన విజయం సాధించింది. అల్లూరి సీతారామరాజు' దర్శకుడు మధ్యలో చనిపోతే, దాన్ని కేఎస్ఆర్ దాసే పూర్తి చేశారు.

విజయమ్మ పరకాల ప్రచారం,పోలీస్ కేసులు నమోదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా పరకాలలో రోడ్ షో నిర్వహించారని వైఎస్ విజయమ్మ, షర్మిల, కొండాసురేఖపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు మీద బహిరంగ సభ నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభ వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడతారని భావించి విజయమ్మ తో పాటు షర్మిల, కొండాసురేఖ పై ఐపిసి 341,188 సెక్షన్లతో పాటు 127ఆర్ పి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. అనుమతులు లేని వాహనాల వినియోగం పై కూడ పరకాల పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన 15 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోడ్ పై కుర్చోని పోలీసులు కేసులు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తునారని ఆరోపించారు.

జగన్ ఆస్తుల కేసు: రెండు రోజుల సిబిఐ కస్టడికి హైకోర్ట్ అనుమతి

వైఎస్ జగన్‌ను రెండు రోజులు పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు నేడు అనుమతించింది. జగన్ కస్టడీ పొడిగింపుపై సీబీఐ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవిస్తు జగన్ ను రెండు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈనెల 9, 10 తేదీల్లో ఆయనను ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో విచారించేందుకు కోర్ట్ అ౦గీకరించింది. నిన్న మూడు రోజులు కస్టడీ పోడగించాలంటు లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల కస్టడీలో చాలామంది సాక్ష్యులను సిబిఐ విచారించామన్నారు. జగన్‌ను ఎన్నిసార్లు ప్రశ్నించినా పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు విదేశాలలో నేరం జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. విదేశీ కంపెనీల నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయాల్సి ఉందన్నారు.

జగన్ కు జై అంటే విచారణ, దాడులు

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్మోహన రెడ్డికి జై అన్న ప్రతి ఒక్కరూ విచారణ, దాడుల్లో ఏదో ఒకటి ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఆ హెచ్చరికలకు తగ్గట్టుగానే వాతావరణమూ ఉందని పరిశీలనలో తేలుతోంది. అయితే మొన్నటి దాకా కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటించిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఒక్కసారిగా జగన్ కు జై అన్నారు. దీంతో ఆయననూ సిబీఐ సాక్షి భవనాల కొనుగోలు లావాదేవీలపై విచారణ చేసింది. అలానే సిండికేట్ లోనే ఉంటూ పెత్తనం వెలగబెడుతున్న మామిడాల వెంకటేష్ 2014 వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ అభ్యర్థి. దాదాపుగా ఈ విషయం ఖరారైందని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. అటువంటి వెంకటేష్ ఇంటిపై ఎసిబి దాడులు జరిగాయి. వీరిద్దరి తరువాత రేసులో కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి మారిన ఆళ్ళ నాని ఉండవచ్చని తెలుస్తోంది. ఆయనకు, జగన్ కు ఉన్న సంబంధాలపై ఇంటలిజెన్స్ వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈ దర్యాప్తు ఆధారంగా ఆయనపై కూడా కక్షసాధింపు చర్యలు ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇలానే వై.ఎస్. తోడల్లుడు వై.వి. సుబ్బారెడ్డి కూడా విశాఖ ఉడాను మోసం చేశారనే అభియోగం వెలుగులోకి వచ్చింది. ఈయనపై కూడా నిఘా పెరిగే అవకాశాలున్నాయి.

గల్లా తలుచుకుంటే వెంకట రమణ గెలుపు తథ్యం

కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని మంత్రి గల్లా అరుణకుమారి ఇచ్చే పిలుపు తిరుపతి నియోజకవర్గంలో ఆ పార్టీకి 30వేల ఓటుబ్యాంకులనటిది. ఆమె పిలుపుతోనే కాంగ్రెస్ అభ్యర్థి ఎం.వెంకటరమణ గెలుపు ఖాయం అని నియోజకవర్గ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే అరుణకుమారి భర్త రామచంద్రనాయుడు నెలకొల్పిన అమరరాజా బ్యాటరీస్ కు చెందిన ఉద్యోగులు 30 వేలకు పైచిలుకు తిరుపతిలోనే ఉన్నారు. వీరంతా ఆమె పిలుపును విని అనుసరిస్తే చాలు. కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకే. తన కుమారుడు జయదేవ్ కు టిక్కెట్టు ఇవ్వలేదని అలిగిన ఆమె తన కంపెనీ ఉద్యోగులకు ఎటువంటి సంకేతాలూ ఇవ్వలేదు. అయితే కడపజిల్లా రైల్వేకోడూరులో మాత్రం ఆమె తమ కంపెనీ ఉద్యోగులను, సన్నిహితులను కాంగ్రెస్ కు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఇక్కడ కూడా ఆమె మాట చెల్లుతుంది. అందుకనే రైల్వేకోడూరు నియోజకవర్గంపై అరుణకుమారి ఎక్కువగా దృష్టిసారించారు. ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవిస్తున్న ఆమె తిరుపతి అభ్యర్థి వెంకటరమణను గెలిపించాలని సిఎం ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆయన ముందుగానే పరిస్థితిని అంచనా వేసి ఇటీవల జాతీయనేతల కార్యక్రమానికి అరుణకుమారిని తిరుపతి రప్పించారు. ఆమెకు మైకు ఇప్పించి కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఓటు అభ్యర్థించమన్నారు. ఆయన ముందు ఓటు అభ్యర్థించినా అమర రాజా ఉద్యోగులకు మాత్రం ఓటెయ్యాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో సిఎం ప్రత్యేకించి అమరరాజా ఉద్యోగులను ఓటు కోరాలని ఆమెపై మరింత ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. సిఎం గురించి అయినా గల్లా మనస్సు మార్చుకుంటారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ నేతలు భావిస్తున్నారు.

చేపమందుకు భారీగా జనం, తొక్కిసలాటలో 20మందికి గాయాలు

చేపమందు పంపిణీకి వేలాది మంది అస్తమా వ్యాధిగ్రస్తులు తరలివచ్చారు, దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇరవై మంది గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉంది, వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేపమందు పంపిణీ ప్రారంభమైంది. దీంతో అస్తమా బాధితులు అందరూ ఒక్కసారిగా లోపలకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే చేపమందు కోసం మన రాష్ట్రంలో నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు నిన్ననే నగరానికి చేరుకున్నారు. మంచినీరు, ఆహారం సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

సిఎంతో సబితేమి మాట్లాడారు?

ఒకవైపు ఎన్నికలు, మరోవైపు సిబీఐ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు రాష్ట్రాన్ని సంచలనాలకు వేదికగా మార్చాయి. ఈ సంచలనాలకు తోడు సిబీఐ జగన్ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న మంత్రులను కూడా తాజాగా పిలిపిస్తోంది. ఇప్పటి వరకూ రాజీనామా చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ, తాజాగా పొన్నాల లక్ష్మయ్యలను సిబీఐ విచారించింది. తరువాత దశలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి తదితరులను సిబీఐ విచారించనుంది. దీంతో మిగిలిన మంత్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ టెన్షన్ భరించలేమనుకున్నారో ఏమో మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేరుగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో రెండుగంటల పాటు చర్చించారు. అసలు ఆమె ఏ విషయంపై సిఎం తో మాట్లాడారు అన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ అవుతోంది. తనను రక్షించమని కోరారా? లేక కేసులో మంత్రులను మినహాయించకపొతే ఎదురయ్యే పరిణామాలు వివరించారా? అన్న విషయం ఇంకా తేలలేదు. ఆమె కానీ, సిఎం కానీ నేరుగా చెబితేనే అసలు ఆ చర్చ దేనికోసమో తేలుతుంది. అయితే ఈ అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారి సిబీఐ దృష్టికి కూడా వెళ్ళింది.

అధికారులపై నోరుపారేసుకున్న దాడి?

పెట్రోకొక్ ఉదాతంపై మండిపడిన శాసనమండలి సభ్యుడు దాడి వీరభద్రరావు అధికారులపై నోరుపారేసుకున్నారు. ఆగ్రహంలో అధికారులు గోతికాడ కుక్కలు లాంటివారని ఆయన వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు తీసుకుని వారి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అసలు అమెరికాలో నిషేధించిన పరిశ్రమను విశాఖ జిల్లా రాంబిల్లిలొ ఎవరు ఏర్పాటు చేయమన్నారని ఆయన చిందులు తొక్కారు. తాను ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు దాడి అధికారులతో సౌమ్యంగా ప్రవర్తిస్తారని, ఏదైనా ఘటన జరిగినప్పుడు దాడి అధికారుల మీదే దాడి చేస్తారని ఆయన సన్నిహితుల విమర్శలకు పై వ్యాఖ్యానాలు అద్దం పడుతున్నాయి. రాంబిల్లిలొ ఘర్షణపూరిత వాతావరణం నెలకొనటానికి రైతులూ, అధికారులూ ఆవేశపడటమే కారణమని తేలుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం ఘటనకు అధికారులనే బాధ్యులు చేస్తూ దాడి ధ్వజమెత్టటం అన్యాయమని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు. ఎన్నికలప్పుడే కాదు మిగతా సమయంలోనూ అధికారులతో మంచిగా ఉండొచ్చని దాడికి హితువు చెబుతున్నారు.