తిరుపతిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమా?
posted on Jun 14, 2012 @ 10:45AM
మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదైంది తిరుపతిలోనే. దీనికి కారణం ఏంటీ? ఈ సూటి ప్రశ్న అక్కడి వాతావరణంలో వచ్చిన మార్పును పట్టిఇస్తుంది. ఒకవైపు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఇంకోవైపు పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణ ఈ తిరుపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేకించి సిఎం తన సొంత జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఎన్నిక కాబట్టి పలురకాల వ్యూహాలను ఎన్నికల ముందునుంచి అమలు చేస్తూ వచ్చారు. తొలుత మున్సిపల్ చైర్మన్ శంకర్ రెడ్డి వంటి వారిని ఆకర్షించటంలోనూ సిఎం తన సొంత ఇమేజ్ ను నమ్ముకున్నారు. పదిమంది చేత అడిగించి తన కుటుంబంతో విభేదం ఉన్నా జిల్లా కాంగ్రెస్ నేత పెద్దిరెడ్డితో కాంగ్రెస్ కె మద్ధతిస్తానని అనిపించారు. ఆయన ఆ మాట అనటమే ఆలస్యం ఆయన్ని వదిలేసి పెద్దిరెడ్డి అనుచరులు, బంధువులపై కాన్ సన్ ట్రేషన్ చేశారు. దీంతో తాను ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకవైపు నిర్లక్ష్యంగా ఉన్నట్లే కనబడింది కానీ, భారీగా ఓటుబ్యాంకుకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎవరికీ అర్థం కాలేదు. ఇలా అడుగడుగునా ఆచి తూచి వ్యవహరించిన సిఎం గత ఎన్నికల ఫలితాలనూ విశ్లేషించారు.
ఎన్నికల్లో పోలింగ్ ఎక్కువైతే ఇతర పార్టీలకు అనుకూలమని గ్రహించి తన స్థాయికి తగిన ప్రణాళిక వేశారు. అదీ ఎవరూ గమనించే పని లేకుండా పారామిలటరీ దళాలు, పోలీసులతో తిరుపతిని దిగ్భంధనం చేసేశారు. ఇంట్లోంచి బయటకు కాలుమోపాలంటేనే భయపడేంత సిబ్బందిని రంగంలోకి దించారు. పెద్ద గొడవలు జరిగినప్పుడు మూకలను చెదరగొట్టే తరహాలో పోలీసులు కనిపించారు. ఈ వ్యవహారం చూసి ఒకవైపు స్థానిక పోలీసులు భయపడితే మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అదిరిపోయింది. ముందురోజుకే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటరుకు డబ్బు పంచుతూ దొరికిపోయిన విషయానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ వీథుల్లో మౌఖికప్రచారం చేయించారు. దీంతో ఎక్కడ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనపడినా ఇతర పార్టీలు, పోలీసులు అప్రమత్తమయ్యేలా ఈ ప్రచారం సాగింది. ఈ దెబ్బకు అదిరిపోయిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ముందురోజు ఓటర్లకు పంచిన డబ్బులు వదులుకుని ఎన్నికల రోజు దూరంగా పోవాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్ కు ఒకరకంగా ఖర్చును కూడా తగ్గించింది. అంతేకాకుండా ఎఇఎం పాచికపారి కనిష్సిపాచికపారి కనిష్టపోలింగ్ అంటే 54 శాతం నమోదైంది. అనుకున్నది అనుకున్నట్లుగా సిఎం అమలు చేశారు. దీంతో తిరుపతిలో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.