కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లడం ఖాయమా?
posted on Jun 14, 2012 @ 9:57AM
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కనుక 14స్థానాల్లో విజయం సాధిస్తే పరిస్థితి ఏమిటన్న విషయమై రాష్ట్రంలో వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ చర్చల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకుంటే ప్రధానపార్టీలకు అది ప్రత్యామ్నాయం అవుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అస్థిరతకు ఈ ఉప ఎన్నికలు నిదర్శనంగా నిలుస్తాయని చర్చల్లో పాల్గొన్న వారందరూ ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఉప ఎన్నికలు జరిగిన 18 స్థానాల్లో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కనుక గ్తెలిస్తే మిగతా పార్టీల మనుగడ అసాధ్యమన్న మాట కూడా ఖాయంగా వినిపిస్తోంది. ఒకవేళ అనూహ్య పరిణామాల్లో తెలుగుదేశంపార్టీ కనుక ఎక్కువ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. ఇలా మూడు పార్టీల గురించి చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ విప్ గండ్ర వెంకటరమణ తమ ప్రభుత్వం ఉప ఎన్నికల తరువాత పడిపోతుందనటం హాస్యాస్పదమంటున్నారు. అనర్హతావెతుకు గురైన ఎమ్మెల్యేలను ఆరేళ్ళపాటు అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేయకుండా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ జోస్యం ఆయన వ్యక్తిగతమైనదని అభిప్రాయపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల ఐక్యత భవిష్యత్తులో పార్టీ పురోభివృద్ధికి ఉపయోగపడుతుందని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ విప్ రుద్రరాజు పద్మరాజు అన్నారు. ఒకవేళ జగన్ కనుక ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే తనపై సిబీఐ దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా వెనుకాడడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మెజార్టీ అభిప్రాయాలు ఇలానే ఉన్నాయని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలు మన రాష్ట్ర తలరాతను మార్చేందుకు ఉపయోగపడతాయన్న తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు మాట ఈ సమయంలో నిజమయ్యేలా ఉన్నాయని కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా 15వ తేదీన ఉప ఎన్నికల ఫలితాల తరువాత దీని గురించి ఆలోచిద్దామని కొందరు చర్చకు బ్రేకులేస్తున్నారు.