కాంగ్రెస్ కు ఐదుచోట్ల , దేశంకు రెండు చోట్ల డిపాజిట్లు గల్లంతు
రాష్ట్రంలో 18 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అటు కాంగ్రెస్ కు, ఇటు తెలుగుదేశం పార్టీ తీవ్రనిరాశను మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదుచోట్ల, తెలుగుదేశం పార్టీకి రెండు చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు పరకాలలో పాటు అనంతపురం, ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరం నియోజకవర్గాల్లో దారుణంగా డిపాజిట్లు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్డులకు నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కలేదు. తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయిన ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపొందడం విశేషం.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ధర్మాన కృష్ణదాసు 7,312 ఓట్లు మెజారిటితో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో లక్షా 74 వేల 930 ఓట్లుండగా, ధర్మాన కృష్ణదాసుకు 54,454 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో కృష్ణదాసు గెలుపు ఆయన తమ్ముడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావును గట్టి దెబ్బ తీసినట్లు అయింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్దిగా ధర్మాన సోదరుల్లో ఒకరైన రామదాసు పోటీ చేశారు. ఆయనకు 47,142 ఓట్లు వచ్చాయి.
రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా సాగిన పరకాల ఎన్నికల్లో టిఅర్ఎస్ అభ్యర్ధి మొలుగూరి భిక్షపతి అతికష్టం మీద తమ సమీప ప్రత్యర్ధి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖపై 1562 ఓట్ల తేడాతో గెలుపొందారు. లక్షా 87 వేల 268 కోట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో భిక్షపతికి 51,936ఓట్లు, సురేఖకు 50,374ఓట్లు వచ్చాయి. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సమ్మారావుకు 5,099ఓట్లు, తెలంగాణా తెచ్చేదీ ఇచ్చేదీ మేమే అంటూ ప్రగల్బాలు పలికిన మరో జాతీయ పార్టీ అయినా బిజెపి అభ్యర్ధి విజయచంద్రారెడ్డికి 9,160ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పరకాలలో ఈ రెండు పార్టీల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోగా టిడిపి అభ్యర్ధి ధర్మారెడ్డికి ఎవరూ ఊహించని విధంగా 30, 850 ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితాలు టిఆర్ఎస్ కు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. భిక్షపతి మంచి మెజార్టీతో గెలుస్తారని భావించగా, ఆయనకు చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా అయింది. తెలంగాణపై గుత్తాధిపత్యం తమదే అని ప్రకటించుకుంటున్న టిఆర్ఎస్ 51,936 ఓట్లు రాగా, సమైక్యవాదపార్టీలుగా పేరుపొందిన టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు కలిపి సుమారు 86వేల ఓట్లు పోలవడం విశేషం.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది తోట త్రిమూర్తులు గెలిచారు. అయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది, పిల్లి సుభాష్ చంద్రబోస్ పై 11,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్, టిడిపిలు కుమక్కు అయినట్టుగా కనిపిస్తోంది. త్రిమూర్తులు 77,298 ఓట్ల సాధించగా, టిడిపి అభ్యర్ది చిక్కాల రామచంద్రరావు కేవలం 6,256 ఓట్లు పొంది డిపాజట్లు కోల్పోయారు. ఇక్కడ బోస్ కు 65,373 ఓట్లు పోలయ్యాయి.
తిరుపతి నియోజకవర్గంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది భూమా కరుణాకరరెడ్డి 18,117 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి గెలిచినా చిరంజీవికి 15 వేల ఓట్ల మెజార్టీ మాత్రమె వచ్చింది. ఈ స్తోత నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం చేసిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్సీని విలీనం చేయటం వాళ్ళ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరగాలి. కానీ, అందుకు భిన్నంగా ఓట్లు గణనీయంగా తగ్గటం ఆ పార్టీకి దిగ్బాంతిని కలిగించింది. దీనికి చిరంజీవి వైఖరి కారణమని కొందరు కాంగ్రెస్ నాయుకలు విమర్శిస్తున్నారు.
వైయస్ఆర్ జిల్లాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గల్లో ఆ పార్టీ అభ్యర్దులు అమరనాథ్ రెడ్డి 22,768 ఓట్ల మెజార్టీతోనూ, శ్రీనువాసులు 22,148 ఓట్ల మెజార్టీతోనూ, శ్రీకాంత్ రెడ్డి 49 వేల మెజార్టీతోనూ ఘన విజయం సాధించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి 32,472 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 46,695ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి 32,995ఓట్లు వచ్చాయి. దేశంలోనే అత్యంత ధనిక అభ్యర్ధిగా పేరుపొందిన దీపక్ రెడ్డి ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను వెదజల్లినా దానికి తగ్గట్లుగా ఓట్లను పొందలేకపోయారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి 36,896ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఆమెకు 88,697ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థికి 25,374ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 51,801ఓట్ల పోలయ్యాయి. ఎమ్మిగనూరులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 20,103ఓట్ల మెజార్టీతోనూ, పోలవరంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు 35,767ఓట్ల మెజార్టీతోనూ, ఒంగోలు వై.కా.పా. అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ 27,403ఓట్ల తేడాతో గెలుపొందారు.