మాచర్లలో త్రిముఖపోటీ?
గుంటూరు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందర్భంగా మూడు ప్రధానపార్టీల మధ్య పోటీ నెలకొంది. మూడు పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు మధ్య పోటీ దాయాదుల పోరును తలపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పెన్నెల్లి లక్ష్మారెడ్డి, వై.కా.పా. అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బంధువులు ఒక్కరే కావటం తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ పోటాపోటీగా ఉన్నారు.
ఇదే అవకాశమని తలచిన టిడిపి అధినేత చంద్రబాబు ఆ దాయాదులను వదిలేసి తమకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించేందుకు బాబు ప్రచారాన్ని వేదిక చేసుకున్నారు. ఆయన మాచర్ల దుర్తి, కారంపూడిల్లో ఇటీవల పర్యటించారు. దేశం నేతలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చలమారెడ్డి, మండవరమేష్ రాథోడ్, సుజనాచౌదరి, ఎంపి నామానాగేశ్వరరావు, ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు తదితరులను ప్రచారంలో వేదిక ఎక్కించారు. ఐదు మండలాలకు ఐదుగురు ఇన్ ఛార్జీలను బాబు నియమించారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ తదితరులు వచ్చి రోడ్డుషో వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించేందుకు జగన్ పై సిఎం విమర్శల వర్షం కురిపించారు. వై.కా.పా. అభ్యర్థి రామకృష్ణారెడ్డి తరుపున మూడు రోజులపాటు ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రచారంలో ఈ అంశాన్ని చొప్పించారు. ఈయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, వంగవీటిరాద ప్రచారంలో సహకరిస్తున్నారు. ఇటీవల విజయమ్మ, షర్మిల రామకృష్ణారెడ్డి తరుపున ప్రచారం చేశారు.