స్వయంకృషి ఖాతాదారులకు రూ.3.5కోట్ల శఠగోపం?

అనంతపురం జిల్లాలోని హిందూపురంలో స్వయంకృషి బ్యాంకు బోర్డు తిప్పేసింది. రోజువారీ అకౌంట్లు, డిపాజిట్లు వెరసి రూ.3.5కోట్లకు ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టేసింది. కంప్యూటీకరణ పేరుతో ముందస్తు ప్రణాళిక ప్రకారం బ్యాంకు మూసేసి సిబ్బంది ఉడాయించారు. ఈ మైక్రోఫైనాన్స్‌ సంస్థలో సుమారు 25వేల ఖాతాలున్నాయి. రెండేళ్ల కిందట మార్కెట్‌ఫీడర్‌రోడ్డులో దీన్ని అంగరంగవైభవంగా ప్రారంభించారు. ప్రతీ గ్రామంలోనూ స్వయంకృషిబ్యాంకు ఏజెంటున్నాడు. ఈ నియోజకవర్గంతో పాటు మడకశిర, పెనుకొండ, గోరంట్ల, కర్ణాటకరాష్ట్రంలోని గౌరీబిదనూరు, పావడ, మధుగిరి ప్రాంతాల నుంచి వందలాది మంది ఇందులో ఖాతాలు తెరిచారు. ముదిరెడ్డిపల్లి చేనేత కార్మికులే కోటి రూపాయలకుపైగా ఈ బ్యాంకులో దాచుకున్నారు. ఈ బ్యాంకు ఇచ్చిన పత్రాల్లో ఉన్న ఆధారాల ప్రకారం పరిశీలిస్తే రిజిష్టరు ఆఫీసు, హెడ్డాఫీసు, మొదటి అంతస్తు, డిఆర్‌వీప్లాజా, పాతబస్టాండుదగ్గర, బీబీరోడ్డు, దేవనహళ్లి, బెంగుళూరు రూరల్‌ జిల్లా`560110 చిరునామాను సంప్రదిస్తే అక్కడ అటువంటి బ్యాంకు లేదని తేలింది. అంతేకాకుండా ఫొనునెంబర్లు 080`27683775, 27682888 కూడా పని చేయటం లేదు. పదేళ్లలో ఇలానే పలు కంపెనీలు స్థానికులను మోసం చేశాయి. తమిళనాడుకు చెందిన వ్యాపారి ఎస్‌ఆర్‌ ఏజెన్సీ పేరుతో నెలరోజుల్లో రెట్టింపు ఇస్తామని ఇక్కడ అరకోటి వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

హంద్రీనీవా గుత్తేదారుపై సర్కారు ప్రేమ?

హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కుంటూనే ఉంది. ఇక్కడ పనులు చేయకుండా గుత్తేదారు సొమ్ము చేసుకున్నారని విచారణాధికారి నిర్ధారించారు. తగిన ఆధారాలు ఉన్నందున గుత్తేదారుపై చర్యలకు సిఫార్సు చేశారు. అయినా ప్రభుత్వం ఆ సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫైలు పక్కన పడేసింది. ఎందుకీ గుత్తేదారుపై సర్కారుకు ప్రేమ పొంగుతోందని కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ పథకం కింద 23వ ప్యాకేజీ పనిని బ్యాక్‌బోన్‌ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ చేయని పనులకు అదనపు బిల్లులు పెట్టి కోట్ల రూపాయలు పొందింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ పనిపై విచారణ జరిపి పనితో సంబంధమున్న ఇంజనీర్లను ప్రభుత్వం సాయంతో సస్పెండ్‌ చేయించింది. ఈ కేసులో చిక్కుకున్న ఇంజనీర్లకు పదవీవిరమణ తరువాత పూర్తిస్థాయి పింఛను కూడా చెల్లించలేదు. ఇంజనీర్లతో పాటు బ్యాక్‌బోన్‌ సంస్థపైనా, పని చేశారని ధృవీకరించిన థర్డ్‌పార్టీ నాణ్యతా సంస్థ పైనా చర్య తీసుకోవాలని విచారణాధికారి ప్రభుత్వానికి తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసింది. గుత్తేదారుపై చర్యతీసుకుంటే ఇంకెందరిపై చర్యలు తీసుకోవాలో అన్నట్లు మౌనముద్ర దాల్చింది. తాజాగా విజిలెన్స్‌ కమిషన్‌ నీటిపారుదల శాఖకు రాసిన లేఖలో ఆ చర్యలు గురించి ప్రస్తావించింది. గుత్తేదారును బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు థర్డ్‌పార్టీ సంస్థను తొలగిస్తూ చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం తమకు అందజేయాలని విజిలెన్స్‌ లేఖలో కోరింది.

ఏసిబికి రాజకీయ ఉద్దేశ్యం అంటగట్టిన ఎమ్మెల్యే రామకృష్ణ

మద్యం ముడుపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి విశాఖతూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎసిబికి రాజకీయ ఉద్దేశ్యం అంటగట్టినట్లుంది ఆయన విచారణలో ప్రకటన. తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రామకృష్ణ ఎసిబి ఎదుట సవాల్‌ చేశారు. తనను విచారిస్తున్నది విచారణ సంస్థ మాత్రమే అన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లుందీ వ్యాఖ్య. తాను నిజాయితీపరుడిని అని మాత్రమే వివరించాలి. ఇంకా దానికి ఏమైనా సాక్ష్యాలుంటే వాటిని ఏసిబి ముందు ఉంచాలి. ఈ రెండూ చేయకుండా ఒక ఎమ్మెల్యే తన రాజకీయజీవితం గురించి విచారణలో మాట్లాడటం ఎంతవరకూ కరెక్టు. ఏసిబి తమ విచారణలో ఎంతో ఓర్పు వహించదనటానికి ఈయన సవాల్‌ విసిరినా మౌనం వహించటమే నిదర్శనం. మూడున్నర గంటల పాటు విచారణ జరిగితే ఏసిబి తనకు వచ్చిన ఆరోపణలు గురించి అనుమానాలను నివృత్తి చేసుకునే దిశగా ప్రయత్నించింది. అదీ జనప్రియసిండికేట్‌ రికార్డుల్లో దొరికిన సమాచారం ఆధారంగానే ఎమ్మెల్యేను విచారించింది. దానికి సమాధానాలిస్తే సరిపోతుంది కానీ, విచారణ సంస్థను సవాల్‌ చేయటం ఓ పరిణతి చెందిన ఎమ్మెల్యేకు తగునా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఈయనతో పాటు పెందుర్తి మాజీ కార్పొరేటర్‌ శరగడం చినఅప్పలరాజును కూడా ఏసిబి విచారించింది. ఆయన మాత్రం ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యంతో కూడిన సవాల్‌ విసరలేదని తెలుస్తోంది.

‘మీడియా’తో వార్‌ జగన్‌ బెయిల్‌ కోసమేనా ?

అక్రమాస్తుల కేసులో చెంచల్‌గూడా జైలులో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తన బెయిల్‌ కోసం సాక్షి దినపత్రిక, న్యూస్‌ఛానల్‌ ఉపయోగించుకుని మీడియాతో యుద్ధానికి దిగారు. నేరుగా తాను సీనులో లేకపోయినా జగన్‌ జైలులోనే ఉండి మంత్రాంగం నడుపుతున్నారని, ఆయన ఆదేశాలపైనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, న్యూస్‌ఛానల్‌, పత్రిక సిబ్బంది ఇతర పత్రికలపై కయ్యానికి కాలుదువ్వారని తెలుస్తోంది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో? అప్పుడు తయారు చేయించే బులెటిన్స్‌(ప్రత్యేక సంచికలు) ఎలా ఉండాలో? కూడా జగన్‌ నిర్దేశించారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు తాను బెయిల్‌పై బయటకు వచ్చేందుకు హైకోర్టులో పిటీషను వేసిన జగన్‌ తరుపున న్యాయవాదులపై ఇతర మీడియా దృష్టి పడకూడదనే ఈ యుద్దాన్ని జగన్‌ ఒక ప్రణాళిక ప్రకారం సృష్టించారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, క్రైమ్‌రిపోర్టర్లు తన బెయిల్‌ గురించి వార్తలు గుప్పిస్తే న్యాయమూర్తి విచారణ ముగిసేంత వరకూ జైలు నుంచి రానీయరేమో అన్న అనుమానంతోనే జగన్‌ మీడిమా మధ్యవార్‌కు వ్యూహాన్ని అమలు చేశారు. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి అసెంబ్లీలోని గాంధీబొమ్మ ముందు కూర్చోబెట్టి మొత్తం నాటకం అంతా సాక్షి ఛానల్‌, పత్రిక ఆడేశాయి. అంటే వారిని కేవలం పాత్రధారులుగా చూపారే కానీ, మొత్తం అన్ని అంకాలూ కూర్చిరచించింది మాత్రం జగన్‌ అని అనుమానాలు పెల్లుబుకుతున్నాయి.       రాష్ట్రపతి ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన కాంగ్రెస్‌ ఇంకా కసరత్తులు చేస్తూ ఉన్న ఈ సమయంలోనే తన బెయిల్‌ మంజూరు అవ్వాలని, లేకపోతే ఇంకెన్నేళ్లు గడిచినా బయటికి రానీయరని జగన్‌ అనుమానించారు. అందుకే తెలివిగా బెయిల్‌ పిటీషన్‌ మూవ్‌ చేస్తూనే గాంధీబొమ్మ వద్ద ఎమ్మెల్యేలను ఉంచి సాక్షితో ముందు సిబిఐ జెడి లక్ష్మినారాయణపై విమర్శలు చేయించారు. ఇప్పటి వరకూ చీప్‌ట్రిక్స్‌ పెద్దగా ప్లే చేయని జగన్‌ ఆ నాయకులను తెరపై చూపి క్రైమ్‌రిపోర్టర్లు, ఇతర ప్రతినిధులు సిబిఐ జెడికి ఫోన్‌కాల్స్‌ చేసిన వివరాలు(లిస్ట్‌) వెలుగులోకి తెచ్చారు. వార్తల కోసం జెడితో మాట్లాడటమే తప్పు అన్నట్లు తన ఛానల్‌, పత్రికల్లో వార్తలు రాయించారు. పైగా జెడికి సంబంధించిన మొత్తం సమాచారం తామూ సేకరిస్తున్నామని సాక్షిఛానల్‌, పత్రిక నిరూపించుకున్నాయి. అంటే సిబిఐ ఎంక్వయిరీకి సమాంతరంగా తమ ఛానల్‌ విలేకరులూ విషయాలను ఎంక్వయిరీ చేయగలరని చూపించారు. దీంతో తన ప్రతీ అడుగూ సాక్షికి తెలుస్తుందన్న భయాన్ని సిబిఐజెడికి కల్పించాలన్నది జగన్‌ ఉద్దేశ్యం కావచ్చు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా జగన్‌ పాచిక పారిందనే చెప్పాలి. తనపై విమర్శలు వచ్చినా జగన్‌ ఏమి చేస్తున్నారో అన్న అంశం నుంచి మీడియా దృష్టి మళ్లించగలిగారు. ప్రెస్‌క్లబ్బులు, క్రైమ్‌రిపోర్టర్ల అసోసియేషన్లు, ఎపిడబ్ల్యుజె, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ తదితరాలు సాక్షిఛానల్‌, పత్రిక చేసిన ఆరోపణలపై మల్లగుల్లాలు పడుతున్నాయి. హైకోర్టులో తన బెయిల్‌పై విచారణ చేయించుకుని జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఈ మాత్రం మళ్లింపు అవకాశం ఉపయోగించుకోవాలని జగన్‌ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. తన బెయిల్‌ కోసం ఇంత నాటకాన్ని వెనుకుండి నడిపించిన జగన్‌ భవిష్యత్తులో సాక్షి సిబ్బందిని ఇతర మీడియా నుంచి దూరమయ్యేందుకు తొలిబీజం వేసినట్లే. యాజమాన్యంకు వ్యతిరేకంగా ఇకపై సాక్షి పత్రిక, ఛానల్‌ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడ్డా బయటకు రాలేని పరిస్థితి ఎదురవుతోంది. మరో కోణంలో పరిశీలిస్తే ఈ 15స్థానాల్లో గెలుపొందినందుకే వై.కా.పా. నేతలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, క్రైమ్‌రిపోర్టర్లను బెదిరిస్తే భవిష్యత్తులో అసెంబ్లీలో అధికారపక్షంగా మారితే ఇక దాడులు ఊహి(భరి)ంచగలమా అన్న కొత్తప్రశ్నకు ఈ సంఘటన పునాది అయింది.

జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా వేసిన హైకోర్టు

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వైస్ జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. హైకోర్టు ఈకేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని కోర్టు ఆదేశించింది. కాగా జగన్ బెయిల్ పైన సిబిఐ 27వ తేదిలోగా కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురయింది. సిబిఐ అక్కడ ఏం వాదనలు వినిపించిందో ఇక్కడా అవే వినిపించే అవకాశముంది. జగన్ ఆస్తుల కేసు కీలక దర్యాఫ్తులో ఉందని, ఇలాంటి సమయంలో జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని, సాక్ష్యులను బెదిరించే అవకాశముందని సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశముంది.

సిబిఐ జెడి ఫోన్ కాల్స్ పై వివరణ ఇచ్చిన చంద్రబాల

సిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణతో అత్యధిక ఫోన్లు మాట్లాడారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆరోపించిన వాసిరెడ్డి చంద్రబాల శుక్రవారం మీడియా ముందు వివరణ ఇచ్చారు. తాను ఎంపవరింగ్ యూత్ ప్రోగ్రాం లీడ్ ఇండియాలో ఆరు నెలలుగా పని చేస్తున్నానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసమే తాను ఎబిఎన్ ఛానల్‌కు ఫోన్ చేశానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసం తాను సాక్షి ప్రతినిధులతోనూ మాట్లాడానని చెప్పారు. ఈ ప్రోగ్రాంను ప్రమోట్ చేయాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ తన క్లాస్ మేట్ అని చెప్పారు.స్నేహితులుగా మేం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, పలు కార్యక్రమాలకు లక్ష్మీ నారాయణ సహకరించారని చెప్పారు. తాను గురువారం అంతా శ్రీశైలంలో ఉన్నానని చెప్పారు. తనకు అప్పుడు బెదిరింపు కాల్సు వచ్చినట్లు చెప్పారు. తమ ప్రోగ్రాం కోసం ఎంతోమందికి ఫోన్ చేస్తుంటామని తెలిపారు.

పీసీసీపై పదవిపై కన్నేసిన డి.ఎస్.?

పీసీసీ చైర్మన్ పదవిపై మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కన్నేశారు. ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయని ఎఐసిసి చైర్మన్ సోనియాగాంధీ సీరియస్ గా ఉండటంతో ఆమెను కలిసేందుకు డి.ఎస్. ప్రయత్నిస్తున్నారు. అలానే వాయలార్ రవిని, గులాంనబీ ఆజాద్ తదితరులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆయన చర్చించనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని అభినందించేందుకు బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్రనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు క్రమశిక్షణ ఉండేదనీ, ఇప్పుడు పార్టీలో అస్సలు క్రమశిక్షణే లేదనీ డి.ఎస్. వివరించారట. అలానే ఎన్నికల్లో అతిగా అంచనాలు వేసి ఘోరంగా దెబ్బతిన్నామని తప్పంతా పీసీసీ బొత్సా సత్యనారాయనపైన, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి పైన నెట్టేస్తూ కేంద్రనాయకులకు వారిద్దరిపై సదభిప్రాయం లేకుండా రాజకీయం చేసేందుకు డి.ఎస్. ప్రయత్నిస్తున్నారని తెలిసింది. పీసీసి చీఫ్ పదవినుంచి బొత్స తప్పుకోవాల్సిన పరిస్థితే వస్తే తాను కాంగ్రెస్ కోసం ఎటువంటి సేవనైనా చేయగలనని డి.ఎస్. అన్నారట. దీనికి కేంద్రనాయకులు నవ్వుతూ సోనియా మేడమ్ తో మాట్లాడతామన్నారట. సోనియా తల్చుకుంటే తనకు తిరిగి పీసీసీ చీఫ్ లభించగలదని డి.ఎస్. ఆశిస్తున్నారని తెలిసింది. అందుకే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మేడమ్ ఆశీస్సులు తీసుకురావాలని డి.ఎస్. చూస్తున్నారట.

తూర్పురైతుకు తీరని కష్టం?

ఒకవైపు వాతావరణ ప్రభావం, మరోవైపు దళారులు రైతుకు తీరని కష్టాన్ని మిగులుస్తున్నారు. తూర్పుగోదావరిజిల్లా వ్యవసాయాథారిత ప్రాంతమైనందున ఇక్కడ జీవించే వారందరూ బంధుత్వం పేరిట పెనవేసుకుంటారు. పెద్దలను పేరుపెట్టి పిలిచే బదులు బాబాయి, బావ, మామయ్య, తాత వంటి ఏదో ఒక వరాసతో కేకేస్తుంటారు. సుద్దవ్యవహారికంలో ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉంటుంటారు. ఇది దళారీ వ్యవస్థ పెరగటానికి, వ్యాపారాల్లో మోసం చేయాలనే నిజానికి కారణమవుతోంది. అడిగినప్పుడు పెట్టుబడి పెట్టేందుకు కొందరు వ్యాపారులు ముందుకు వస్తుండటంతో రైతులు వారిని పూర్తిగా నమ్మేస్తారు. వారు ఒక మూడునెలల పాటు అందరికీ పద్దు ఆపేసి ధాన్యం తీసేసుకుని మిల్లర్ల నుంచి డబ్బు వసూలు చేసుకుని పరారైతే ఒక్కసారిగా రైతులు ఘోల్లుమంటారు. ఇదే తరహా మోసాలకు బలవుతుంటారు. తాజాగా ఆలమూరు మండలం పెనికేరు కమీషను ఏజెంటు శ్రీనివాసరావు రూ. 30లక్షలకు పైచిలుకే రైతులకు డబ్బు ఇవ్వకుండా పరారయ్యాడు. మొత్తం 40మంది రైతులను శ్రీనివాసరావు మోసం చేశాడు. ఐదువేల రూపాయలు మొదలుకుని రెండు లక్షల వరకూ రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇక కోనసీమలో అయితే తరచుగా ఇటువంటి సంఘటనలు పునరావృత్తం అవుతాయి. గతంలో కన్నా ప్రైవేటు రుణాలు తగ్గించినా కమీషన్ ఎజెంట్లు, పిండికొట్టువ్యాపాటి పెట్టుబడులు ఇంకా ఆగలేదు. దీంతో రైతు ఎవరో ఒకరిపై ఆధారపడే సాగు కొనసాగించాల్సి వస్తోంది. మండలస్థాయిలోనూ, గ్రామస్థాయిలోనూ అధికారులు రైతులను బ్యాంకులవైపు మళ్ళించినా మళ్ళీ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. రైతుల అవగాహనా కార్యక్రమాలు పెరగాల్సిన అవసరం ఉందని పై సంఘటన నిరూపిస్తోంది. గిట్టుబాటు ధర ఇవ్వలేదని అలిగిన తూర్పురైతు గతేడాది క్రాప్ హాలిడే ప్రకటించి తీరని నష్టాన్ని చవిచూశాడు. ఇంకా దాని నుంచి తెరుకోకుండానే కొత్తకొత్త ఘటనలు రైతును కష్టాల్లోకి గేన్తెస్తోంది. పొలంబడి, రైతుమిత్రసంఘాలు అభివృద్ధి చెందినా రైతుమనోధృక్పథంలో పెద్దగా మార్పు రాలేదని అర్థం చేసుకుని వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. అధికారులకు తెలియకుండా ఆలమూరు మండలం పెనికేరు రైతులకు వ్యాపారి నుంచి అప్పులు ఇప్పించేందుకు పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అప్పు ఇచ్చి పంట చేతికి వచ్చిన వెంటనే లాభంతో కలిసి సొమ్ము చేసుకునే వ్యాపారులకు బదులు బ్యాంకుకు తీసుకెళ్ళి ప్రయత్నం పెద్దలు చేయటం లేదు.  దాని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో అన్న ఆందోళన తప్పటం లేదు. ప్రజాప్రతినిథులు కూడా ఇటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం లేదు. మార్పు దిశగా తూర్పురైతును తీసుకెళ్లేందుకు ఎవరూ కృషి చేయటం లేదన్నది నగ్నసత్యం.  

వెల్లడవుతున్న రవాణా అక్రమాలు, పెరిగిన జప్తు బస్సుల సంఖ్య?

రవాణాశాఖ అక్రమాలకూ అడ్డా అన్నమాట వాస్తవమని తేలుతోంది. దీనికి వేరే సాక్ష్యం అక్కర్లేదు పెరుగుతున్న బస్సుల జప్తు దీన్ని తేటతెల్లం చేస్తోంది. కళ్ళు మూసుకుపోయిన అందినకాడికి దోచుకున్న రవాణాశాఖ సీరియస్ గా దాడులు మొదలుపెట్టినప్పటినుంచి నిబంధనల ప్రకారం రోడ్డుమీద తిరగటానికి వీల్లేని బస్సుల సంఖ్య పెరుగుతోంది. అసలు మొదటినుంచి ఎందుకు ఆ శాఖ నిబంధనలను పక్కనపెట్టేసింది? రవాణాధికారులు రోజుకు లక్షకు తక్కువ కాకుండా సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలను ఎందుకు పట్టించుకోలేదు? డిటిసి మొదలుకుని అటెండర్ వరకూ పంచుకుతింటున్నారన్న దానిపై ఎక్కడా సరైన వివరణ ఎందుకు ఇవ్వలేకపోయారు? వంటి ప్రశ్నలు ఆ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రతీ పదేళ్ళకూ ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకోవటం కాకుండా ముందస్తుగా ఆ శాఖాధికారులు ఎందుకు స్పందించరు? అన్న ప్రశ్న రవాణా అవినీతికి ఎంతలా అలవాతుపడిందో అర్థమయ్యేలా చేస్తోంది. ప్రత్యేకించి ఒక్క రెండురోజుల దాడిలో సుమారు 150కు పైగా బస్సులను జప్తు చేశారంటే ఇంకా ఎన్ని బస్సులు అక్రమంగా నడుస్తున్నాయన్న సందేహానికి ఆస్కారం ఏర్పడుతోంది.     దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 90కు పైగా ప్రైవేటు బస్సులు, కండీషన్ లేని 68 స్కూలు బస్సులు జప్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 39 ప్రైవేటు బస్సులను పట్టుకున్నారు. వాటిలో 19 పట్టణంలో యథేచ్చగా తిరుగుతుండగా చెక్ చేసి జప్తు చేశారు. కొన్ని బస్సులకు ఇంకా పర్మిట్లు కూడా లేవు. కాంట్రాక్టు క్యారియర్ పర్మిషను తీసుకుని స్టేజిక్యారియర్లుగా బస్సులు తిప్పతాన్ని కూడా అధికారులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లాలో కండీషన్ లో లేని 38 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. మెదక్ జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 20, హైదరాబాద్ లో 10 బస్సులు జప్తు చేశారు. ఇంకా తూర్పుగోదావరిజిల్లాలో రవాణాశాఖ దాడులు ప్రారంభించలేదు. ఒక్క షిర్డీ బస్సు ప్రమాదం జరిగినంత మాత్రాన వచ్చే ఆదాయం వదులుకోవాల? అందుకే ఈ జిల్లాలో రోజుకు రెండు లక్షల రూపాయల అదనపు ఆదాయం వదులుకోలేక సిబ్బంది దాడులకు సిద్ధంగా లేరు. ఇక ప్రైవేటు స్కూలు బస్సుల కండీషన్ విషయానికి వస్తే తూర్పుగోదావరిజిల్లాలో శ్రీచైతన్య వంటి పెద్ద సంస్థల బస్సులు కదలాలా వద్దా అని మొరాయించే స్థితిలో ఉన్నాయి. వాస్తవ ప్రయాణం గంటలోపు ఉంటే రెండు గంటలు దాటాక కూడా గమ్యస్థానానికి చేరటం లేదు. ఇంతటి దారుణ స్థితిలో ఉన్న బస్సులను శ్రీచైతన్య నడుపుతోందని జగ్గంపేటలో శ్రీచైతన్య విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన కూడా ఆర్టీఎ కళ్ళు తెరిపించలేదు. ఆర్టీసీలోనే పాతబడిపోయిన వాహనాలను కొనుక్కుని దానికి రంగులేయించి మరీ తిప్పుతున్నారు. రాష్ట్రస్థాయిలో స్పందిస్తే కానీ, ఈ శాఖలో పూర్తిస్థాయి చైతన్యం రాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్, అన్నీ ఆర్నెళ్ల తరువాతే

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రప్రభుత్వం బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఉపఎన్నికలకు ముందే ఈ ఎన్నికలు నిర్వహిద్డామనుకున్న ప్రభుత్వం రాష్టపతి ఎన్నికల గురించి దీన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ప్రతికూలంగా ఉండటంతో అసలు ఈ ఎన్నికల ప్రస్తావనే ప్రభుత్వం మరిచిపోయింది. మరో ఆర్నెళ్లపాటు ఈ ఎన్నికలు జరగాకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బిసీలను దగ్గర చేసేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని సిఎం గతంలో భావించారు. నగరపాలక సంస్థలకు, మున్సిపాల్టీలకు, పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తే ద్వితీయశ్రేణి నాయకులు పార్టీపై విశ్వాసంతో పనిచేస్తారని సిఎం అభిప్రాయపడ్డారు. వీరంతా 2014 ఎన్నికలు వచ్చేటప్పటికి పార్టీ వెనుక బలంగా ఉంటారని ఆయన భావించారు. ఉపఎన్నికల ఫలితాలు జగన్ కు సానుభూతిగా వచ్చాయని భావించిన ప్రభుత్వం మరో ఆర్నెల్లు ఆగితే ఈ సానుభూతి తగ్గుతుందని భావిస్తోంది. అయితే ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీలకూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటమే నష్టాన్ని తెచ్చిపెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా బిసిలపైనే ఆధారపడి ఉన్నంతున ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ ద్వితీయశ్రేణి గెలిచి ఉంటే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కస్థానమైనా దక్కేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యాక, మరో ఆర్నెల్లలో ఈ ఎన్నికలను ప్రభుత్వం జరిపిస్తుందని పార్టీల జిల్లా అధ్యక్షులు ద్వితీయశ్రేణి నాయకులకు హామీలు ఇస్తున్నారు. జగన్ ప్రభావం తగ్గేన్తవరకూ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు జరగనీయదని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులూ తమ మాజీలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం మాత్రమే పోటీపడేలా ఈ ఎన్నికలు జరగకపోతే భవిష్యత్తు రాజేకీయపరిణామాలు చేజారుతాయని వారు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆర్నెళ్ల తరువాత కూడా ఇదే స్పీడులో ఉంటేనో అన్న ప్రశ్నకు రెండు పార్టీల నేతలూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల తరువాతే వలస ఎమ్మెల్యేల రాజీనామాలు?

ఉపఎన్నికల ఫలితాలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో గుర్తిప్మ్పును తెచ్చిపెట్టాయి. దీనివల్ల వలసలు కూడా ప్రారంభమయ్యాయి. తమ పార్టీలోకి ఎమ్మెల్యేలే రావటం ఖాయమన్న స్థిరమైన నమ్మకంలో ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ఉన్నారు. అయితే అందరినీ రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఆగమని ఆయన చెబుతున్నారట. ఈ ఎన్నికల్లో తమకు జాతీయస్థాయిలో ప్రాముఖ్యత లభిస్తుందని, దీని తరువాత తమ సమీకరణాలను మార్పు చేస్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా దిగివస్తారని జగన్ భావిస్తున్నారు. ఆమెను లొంగదీసే ఏ అవకాశమూ వదులుకోకూడదని ఆయన తన సన్నిహితులతో అన్నారట. అందుకే చెంచల్ గూడ జైలులో ఉన్న జగన్ తన ములాఖాత్ సమయంలో పార్టీ నాయకుల సెల్ నుంచి కాంగ్రెస్ నుంచి వలస వచ్చేందుకు సిద్ధమైన కాకినాడ ఎమ్మల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులకు రింగ్ చేసి ఈ ఎన్నికలయ్యే వరకూ ఆగమని తెలిపారు. తన మాటపై వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకుంటారని ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీకి తెలిపారు. తనకు ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయించేందుకు ఎటువంటి అభ్యంతరం లేకపోయినా ఈ కేసుల గురించే ఎమ్మెల్యేలు తనను నిలదీస్తున్నారని ఒవైసీకి చెప్పారట. దీని విషయం కూడా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పాలని ఒవైసీని జగన్ కోరారని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ తన కేసులకు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధం లేకపోతే రాష్ట్రంలో మరోసారి అవిశ్వాసం పెడితే తనకు సహకరించాలని ఒవైసీని కోరారట. దీనికి తగ్గట్లుగా ఎంఐఎం రంగారెడ్డి జిల్లాలో విస్తరించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని జగన్ హామీ ఇచ్చారని సమాచారం. దీంతో సంతృప్తి చెందిన ఒవైసీ మీడియా ముందు నుంచి వెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే తనను నినదించవద్దని జగన్ చెప్పిన మాటలను దాచేస్తూ చిన్న హింట్ ను మాత్రం వదిలేశారు. తెలంగాణలో టి.ఆర్.ఎస్., రంగారెడ్డి జిల్లాలో ఎంఐఎం పార్టీల ఎదుగుదలకు తనకేమీ అభ్యంతరం ఉండదని ఒవైసీకి జగన్ ఇచ్చిన హామీ కూడా బయటకు పొక్కింది. అయితే ఎమ్మెల్యేల రాజీనామాలను రాష్ట్రపతి ఎన్నికలయ్యేంత వరకూ జరగవని జగన్ స్పష్టం చేశారని తెలిసింది.

బోత్సాపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

ఉపఎన్నికల ఫలితాలు దారుణంగా ఉన్నాయంటూ పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. దీనికి పీసీసీ సమావేశంలో తాను సేకరించిన బొత్సా కేంద్ర నాయకుల ముందుంచారు. ఆ కారణం విననైనా వినకుండానే నాయకులు బోత్సాపై సీరియస్ అయ్యారు. దీంతో ఏమిచేయాలో అర్థం కాక బొత్సా తాను తీసుకున్న వివరాలను సమావేశంలో కేంద్రనాయకుల చేతికి ఇచ్చేసి వచ్చారు. సోనియా తరపున కూడా బోత్సాకు అక్షింతలు వేసి పంపించారు. ఎలానూ వచ్చాం కాబట్టి ప్రణబ్ ముఖర్జీని కలిసి మర్యాదపూర్వకంగా అభినందించి బొత్సా తిరుగు ప్రయాణమై వచ్చారు. వచ్చినది మొదలు కాంగ్రెస్ నాయకులను కలవకుండా బొత్సా ఇంటిదారి పట్టారు. కాంగ్రెస్ చైర్మన్ సోనియాగాంధీ ఉపఎన్నికల ఫలితాలు సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24, 25తేదీల్లో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్సా సత్యనారాయణలతో ఈ చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారటానికి అవకాశం ఎలా ఏర్పడిందన్న అంశాలపై ఆమె ప్రధానంగా చర్చిస్తారు. సిఎంతో మాత్రం జగన్ అక్రమాస్తుల కేసులో ఇడి కనుక ఆయన్ని తరలిస్తే వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడతారని సమాచారం. ఏదేమైనా వీరిద్దరిలో ఒకరి మార్పు ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

కెటిఆర్ కు అక్షింతలు

టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కేసీఆర్ కుమారుడైన కెటిఆర్ కు హైకోర్టు అక్షింతలు వేసింది. నేరపూరిత కోర్టు దిక్కారణ కింద ఆయనకు నోటీసు జారీ చేసింది. కెటిఆర్ వ్యాఖ్యలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికలకు నోటీసులు జారీ చేసింది. టి.ఎస్.జి.ఓ. హౌసింగ్ లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని విచారణలో నిరూపితమవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఒకదశలో రాష్ట్రప్రభుత్వప్రధానకార్యదశి పంకజ్ ద్వివేదిని కోర్టుకు రప్పించాలని కూడా జడ్జి భావించారు. ఈ దశలో కెటిఆర్ ఆ కసుపై నేరపూరిత కోర్తుదిక్కరణ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం డివిజన్ బెంచ్ కు చేరింది. జస్టీస్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కెటిఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కెటిఆర్ కు నోటీసు జారీ చేసింది.

వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేతగా విజయమ్మ ఎన్నిక

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ విజయలక్ష్మిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం భేటీ అయిన ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిహేడు మంది ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి శాసనసభ ఆవరణలో కార్యాలయాన్ని కేటాయించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరనున్నారు.   గతంలో ప్రజారాజ్యం పార్టీకి కేటాయించిన కార్యాలయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఇలా ఉండగా పశు సంవర్ధక శాఖ మంత్రి పి విశ్వరూప్ కుమారుడు కృష్ణ బుధవారం చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి విశ్వరూప్ కుమారుడు మొదటి నుంచి జగన్ పట్ల అభిమానంతో ఉంటున్నారు.  

విశాఖ వుడా పై సిబీఐ కొరడా

విశాఖ నగరాభివృద్ధి సంస్థ(వుడా) అక్రమాలపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని సిబీఐ విశాఖ రేంజి డిఐజిని హైకోర్టు ఆదేశించింది. వుడా తమకు పంపించిన నోటీసులపై సవాల్ చేస్తూ బి.రామవరప్రసాద్, ఎ.సురేష్, మరో 11మంది హైకోర్టులో పిటీషను వేశారు. వుడా స్థల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన హైకోర్టు న్యాయమూర్తి దానిపై నివేదిక అవసరమని భావించి సిబీఐకి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఇదే వివాదంలో విచారణకు ఇచ్చిన ఆదేశాలు పాటించలేదని గుర్తించిన న్యాయమూర్తి కేసును సుమోటోగా స్వీకరించారు. ప్రాథమిక విచారణ సిబీఐ విశాఖ రేంజి డిఐజి ఆరువారాల్లో పూర్తి చేసి నివేదిక అందజేయాలన్నారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలను వుడా కొందరు బిల్డర్లకు అక్రమంగా కేటాయించింది. ఆ స్థలాల్లో భవన నిర్మాణాలకూ అక్రమంగా అనుమతులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో సిబీఐ నివేదిక హైకోర్టు కోరటం విశాఖలో పెద్ద సంచలనమైంది. ఆక్రమితదారులు ఆందోళన చెందుతున్నారు. సిబీఐ డిఐజి కార్యాలయంలో తమ సమీపబంధువులు ఎవరైనా పనిచేస్తుంటే వారి ద్వారా ప్రాథమిక విచారణ ఎప్పుడు ప్రారంభమావుతుందో తెలుసుకునేందుకు బిల్డర్లు సిద్ధపడ్డారు. జగన్ అక్రమాస్తుల కేసు వల్ల సిబీఐ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసుకున్న బిల్డర్లు భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో వుడాపై కేసువేస్తే అది వెనక్కు తగ్గుతుందనుకుంటే సిబీఐ విచారణకు హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించటం పిటీషన్ వేసిన 13 మందికి మింగుడుపడటం లేదు. వుడాను కోర్టు హెచ్చరిస్తుందనుకుంటే న్యాయమూర్తి తమను హెచ్చరించినట్లు అయిందని ఓ బిల్డరు బహిరంగంగా వాపోయారు.

పెరుగుతున్న వసూల్ రాజాలు?

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో చెలగాటమాడేవారి సంఖ్య పెరుగుతోంది. ఏదో ఒక సంస్థ పేరు పెట్టుకుని దానిలో ఉద్యోగం కోసం పదివేలు కట్టాలని కొన్ని కన్సల్టెన్సీలు కోరుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు గురించి వెదికేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగం వల్ల తీరిక ఉండక కన్సల్టెన్సీ సర్వీసులను నమ్ముతున్నారు. మనదేశంలో అలా కాదు. నేరుగా ఉద్యోగం ఉందో లేదో? నేరుగా కనుక్కోవచ్చు. కానీ, విదేశీసంస్కృతిని దిగుమతి చేసుకున్నంత స్పీడుగానే ఈ కన్సల్టెన్సీ సర్వీసుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ కన్సల్టెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఒక్కోసారి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఎక్కువ డిపాజిట్టు చేయించుకుంటున్నారు. అలానే వ్యక్తిగత ప్రయోజనం కూడా పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా కన్సల్టెన్సీలు తమ ప్రతినిధులను నిరుద్యోగుల మీదకు పంపుతున్నారు. డబ్బు వ్యవహారంలో అదుపు ఉండదు కాబట్టి కొందరు ప్రతినిథులు సంస్థకు కూడా తెలియకుండా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోనూ, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో ఈ కన్సల్టెన్సీ సర్వీసులు, వారి ప్రతినిథులు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కాంతమ్మాన్ ప్రాజెక్టు పేరిట దాని నిర్వాహకుడు మాచర్ల శ్రీనివాస్ నిరుద్యోగులను మోసం చేశాడని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇటువంటి ప్రాజెక్టులను, కన్సల్టెన్సీలను నమ్మొద్దని కోరుతున్నారు.

ఆంధ్రులకు తెలుగు సరిగ్గా రాదా?

ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆంధ్రుల పిల్లలకు తెలుగుభాశాల్లో తప్పులుదొర్లితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ, అచ్చమైన ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టి తెలుగు రాదంటే ఊరుకోగలమా? ఇది క్షమించరాని నేరమని గొంతెత్తి అరుస్తాం. అటువంటిది ఇటీవల పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత పరిశేలిస్తే తప్పినవరిలో ఎక్కువమంది తెలుగుభాష పరీక్షలోనే తప్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా ఫలితాలు ఈ ఏడాదే విడుదలయ్యాయి. ఈ ఫలితాలు చూస్తే ఆంధ్రులకు తెలుగురాదా అనే కొత్త ప్రశ్న వేసుకునే పరిస్థితి దాపురించింది. దీనికి తాజా ఉదాహరణగా కడపజిల్లాలో ఫలితాలు పరిశేలిస్తే ఈ జిల్లా 0.28 శాతం తగ్గటం వల్ల ఉత్తీర్ణతలో రెండోస్థానంకు చేరుకుంది. కడపజిల్లా ఉత్తీర్ణతాశాతం 93.10. మొత్తం 33,157 మంది పరీక్షలు రాస్తే వారిలో 30,870 మంది ఉత్తీర్ణత చెందారు. ఫయిలైన వారిలో ఎక్కువమంది తెలుగులోనే తప్పారు. హిందీలో 667, ఇంగ్లీషులో 1431, లెక్కలలో 1176, సైన్స్ లో 1312, సోషల్ లో  1559 మంది ఫెయిల్ అయ్యారు. ఒక్క తెలుగులోనే 2384 మంది ఫాయిల్ అయ్యారు. దీన్ని బట్టి తెలుగుఉపాధ్యాయులను మార్చాలా? తల్లిదండ్రులు తమ పిల్లల తెలుగు పరిస్థితి తెలుసుకోవాలా? ఏది కరెక్టు అనే అంశంపై ఆ జిల్లా విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది.  

పెట్రేగిపోతున్న ఎర్రచందనం స్మగ్లర్లు?

చిత్తూరు జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం కలపను తరలించటానికి అలవాటుపడ్డ స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు. వీరిని అటు అతవీశాఖాధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ అదుపు చేయటం కుదరటం లేదు. తాజాగా ఈ స్మగ్లర్లు తుపాకులతో తిరుగుతుండటం సంచలనమవుతోంది. తమను ఎవరి వెంబడించిన ఆ స్మగ్లర్లు తుపాకులతో బెదిరిస్తున్నారు. ఇంకా పోలీసులైతే ఎదురుకాల్పులకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకవైపు మావోలు, మరోవైపు స్మగ్లర్లు తుపాకులతో ఎదిరించటంతో విసుగుచెందిన పోలీసులు స్మగ్లర్ల వెంటబడ్డారు. చిత్తూరుజిల్లా శంకరంపల్లిలో ఎదురుకాల్పులకు సిద్ధమయ్యారు. హోరాహోరీగా కాల్పులు జరపటంతో పోలీసులు, స్మగ్లర్లు బాగానే ఉన్నా మధ్యలో మరెవరో మృతి చెందారని సమాచారం. ఒకవైపు రాజకీయ అండ, మరోవైపు సొంతబలగాలు పెంచుకునే దిశగా స్మగ్లర్లు కృషి చేస్తుండటంతో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళనలు ప్రారంభమయ్యాయి. రాను రాను గడ్డుపరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని చిత్తూరు జిల్లా గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. స్మగ్లర్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వారు వాపోతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న గ్రామీణులను వదిలేసి మిగిలినవారిని శాసించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. ఏమైనా ఎర్రచందనం స్మగ్లర్లను అదుపు చేయకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదన్నట్లుంది నేటి పరిస్థితి. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించకపొతే భవిష్యత్తులో స్మగ్లర్లు కొన్ని ప్రాంతాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకునే అవకాశాలూ ఉన్నాయి.