జగన్ కేసులో ఈడి విచారణ ప్రారంభం, సిబీఐకు 15 రోజుల రెస్ట్

దేశంలో సంచలనమైన జగన్ అక్రమాస్తుల కేసులో హవాలా నిధుల రాకను తెలుసుకునేందుకు ఇడి విచారణ ప్రారంభించింది. దీంతో అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసుల విచారణలో సిబీఐకు 15 రోజుల పాటు ఊరట లభించింది. ముందు సమాంతరంగా విచారించాలని ఇడి భావించింది. అయితే కోర్టు నేరుగా ఆదేశాలు ఇవ్వటంతో 15 రోజుల విచారణకు ఇడి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటివరకూ జగన్ కేసులో నిన్డుతులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇడి ఈ మూడు కేసులకు సంబంధించి సిబీ దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రతులను కూడా కోర్టు నుంచి తీసుకుంది. అక్రమాస్తుల కేసులో న్జిమ్మగడ్డప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డి, కోనేరు రాజేంద్రప్రసాద్, బి.పి. ఆచార్య, విజయరాఘవ, ఓఎంసి కేసులో రాజగోపాల్, శ్రీలక్ష్మి, డి.వి. శ్రీనివాస రెడ్డి తదితరులను ఇడి విచారిస్తుంది. కోట్లాది రూపాయల హవాల నిధులు ఎలా జగన్ సంస్థలోకి వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇడి ఈ మూడు కేసులను విచారిస్తోంది. దాని ప్రధానలక్ష్యం మాత్రం హవాలా నిధులు ఎలా రాబట్టగలిగారు? ఈ నిధులు రాబట్టేందుకు అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేశారు? రాష్ట్రప్రభుత్వమేనా ఇంకెవరన్నా జగన్ కు సహకరించారా? ఇప్పటిదాకా సిబీఐ అనుమానించిన వారేనా ఇంకేమైనా కొత్తపాత్రధారులున్నారా? జగన్ కు మాత్రమే ఎందుకు ఈ విధమైన మద్దతు లభిచింది? వంటి పలు అనుమానాలను ఈ నిందితుల ద్వారా తీర్చుకునేందుకు ఇడికి అనుమతి లభించింది. దీంతో ప్రస్తుతం సిబీఐ విచారిస్తున్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో 15రోజుల పాటు ఆ సంస్థకు విరామం లభించినట్లే. ఇప్పటిదాకా చేసిన విచారణ తాలూకు ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించేందుకూ సిబీఐకు ఈ సమయం ఉపయోగపడుతుంది.

రైతుసమస్యలపై గలం విప్పనున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ?

రైతాంగ సమస్యలపై గలం విప్పేందుకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తొలినాళ్ళలో విజయవాడలో రైతు సమస్యలపై జగన్ ఆందోళన చేశారు. ఇప్పుడు విజయమ్మ కూడా అదే సీరియస్ నెస్ ఉన్న సమస్యలను ఎంచుకున్నారు. 2010 నాటి ఇన్ పుట్ సబ్సిడీ పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోతే ఆందోళన తప్పదని అనంతపురం అమ్మేల్యే గుర్నాధరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఈ మహాధర్నాకు విజయమ్మ నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. దాదాపు రెండేళ్ళ క్రితం నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోవటం, ఆ తరువాత జరిగిన పంట నష్టాన్ని గుర్తించకపోవటాన్ని కూడా తమ పార్టీ తప్పుపడుతోందన్నారు. గుర్నాధరెడ్డి మాటలను బట్టి విజయమ్మ పార్టీ తరపున పోరాడే పార్టీ అన్న గుర్తింపును సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. విజయమ్మతో పాటు షర్మిల కూడా ఇటువంటి ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.

చిరును వెంటాడిన తమిళ కోర్టు

ప్రచారంలో పరిథి దాటినా మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అక్టోబరు 2వ తేదీ లోపు బాగుళూరు కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. సినీజీవితం వదిలేసి రాజకీయ జీవితానికి అలవాటు పడేందుకు చిరు బోలెడు ప్రయాస పడుతున్నారు. ముందుగా ప్రజారాజ్యంపార్టీని స్థాపించి ఆ తరువాత దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. ఇలా కలిపేసిన తరువాత ఎమ్మెల్యేగా ప్రారంభించిన రాజేకీయ జీవితంలో ఓ చిన్న ప్రమోషన్ లభించి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అందరూ ఎంపీ అని పిలిచే ఈ సభ్యత్వంతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, జాతీయనాయకులతో కలిసే సువర్ణావకాశం ఆయనకు లభించింది. అయితే ఈ మధ్యలో ఓ చిన్న అపశ్రుతి దొర్లింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్ళ (2011)లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు చిరంజీవి అక్కడికి వెళ్ళారు. అక్కడ చిరు కొంచెం స్పీడుగానే ప్రచారం చేశారు. తొందరగా ప్రచారం ముగించుకుని వచ్చేయాలనే కంగారులో చిరంజీవి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. హోసూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి గోపీనాథ్ తరపున చిరు ప్రచారం చేశారు. ఆయనపై 188, 143 సెక్షన్ల కింద హోసూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కోర్టు వాయిదాలకు కూడా చిరు గైర్హాజరవటంతో హోసూర్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. చిరుతో పాటు ఆరుగురిపై 2011లో ఈ కేసు నమోదైంది. సినీ జీవితంలో (ఖైదీ) కోర్తుమెట్లు నటనలో భాగంగా ఎక్కినా చిరు ఇప్పుడు నిజం కోర్టుకు హాజరుకావాలి. అప్పుడు నటుడుగా, ఇప్పుడు రాజకీయ నాయకునిగా ఎదురవురున్న ఈ మార్పులను చిరు తట్టుకోగలరా? లేక తనకు సినీజీవితమే బాగుందని బయటపడిపోతారా? అని అన్నిరాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో పీజెఆర్ కుమార్తె?

దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేత పి.జనార్థనరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వై.ఎస్. లానే పి.జనార్థనరెడ్డి కూడా పార్టీలోని క్యాడర్ ను ఆకట్టుకుని ముక్కుసూటి వ్యవహారాలూ నడిపేవారు. తప్పు తన పార్టీ వారు చేసినా వదలని మనస్తత్వంతో జాతీయస్థాయి గుర్తింపునందుకున్న పి.జనార్థనరెడ్డి మరణించాక ఆయన తనయుడు విష్ణు కాంగ్రెస్ పార్టీ తరపున శాసన సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే విష్ణు సోదరి మాత్రం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. జగన్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలోకి ఆమె రాబోతున్నట్లు తెలిసింది. ములాఖాత్ ద్వారా జగన్ ఆమె చెంచల్ గూడ జైలులో కలిశారు. అనంతరం తాను జగన్ పార్టీలో చేరే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపారు. అయితే ఆమె జగన్ తో తాను పార్టీలో చేరతానన్నట్లు సమాచారం. దీంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విజయం వల్ల కొత్త చేరికలు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. పిజెఆర్ కుమార్తె రాకను కూడా వలసలకు ఒక సంకేతంలా భావిస్తున్నారు.

అమూల్ బేబీ యాడ్ లో ఖైదీ జగన్

కొద్ది నెలల క్రితం భారతీయ జనతాపార్టీకి చెందిన ఒక రాజకీయనాయకుడు రాహుల్ గాంధీని అమూల్ బేబితో పోల్చడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.జె.పి.నాయకుడిపై మూకుమ్మడిగా దాడి చేసినంత పని చేసారు. రాహుల్ గాంధీ లాంటి పరిణితి చెందిన యువ రాజకీయ నాయకుడిని అమూల్ బేబితో పోల్చడం ఆ నాయకుడి అజ్ఞానానికి నిదర్శనమంటూ దుమ్మెత్తి పోశారు. అమూల్ బేబి మరోసారి వివాదాన్ని సృష్టించింది. ఈసారి జగన్ ను అమూల్ బేబిగా చిత్రీకరిస్తూ, ఆ బేబి జైల్లో ఉన్నట్లుగా ఒక ప్రకటన తయారు చేసి ఇంటర్ నెట్ లో పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్స్ లో కొందరు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులకు తెలియజేశారు. దీంతో ఆపార్టీకి చెందిన న్యాయవాదుల విభాగం రంగంలోకి దిగి ఈ ప్రకటన ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత అమూల్ యాజమాన్యంతో మాట్లాడి ఈ ప్రకటన విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. ఈ ప్రకటన ఇంటర్ నెట్ లో ఉంటే జగన్ తో పాటు రెడ్డి కులస్తుల పరువుకు భంగం కలుగుతుందని వారు హెచ్చరించారు. ఖైదీ దుస్తుల్లో ఉన్న జగన్ గోడ మీద లెక్కలు వేస్తున్నట్లు ఈ ప్రకటనలో చూపించారు. పైన రెడ్డి సిద్ధంగా వుండు ... ఆస్తులుదోచుకో ... అని ప్రకటన పైభాగాన, ఇంకా ఎంత తింటావు అని కింది భాగాన క్యాప్షన్ ఉంది. ఈ ప్రకటన ఇంకా ఇంటర్ నెట్ లో దర్శనమిస్తూవుంది.

జగన్ సాక్షికి చంద్రబాబునాయుడు సవాల్

తమకు విదేశీ బ్యాంకులలో నల్లధనం ఉందన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికలో బుధవారం వచ్చిన కథనంపై స్పందించిన చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాపడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు సాక్షి దిన పత్రిక అవాస్తవ కథనాలు ప్రచురిస్తోందన్నారు. తనకు నల్లడబ్బు ఉందని, అకౌంట్లు ఉన్నాయని పేర్కొన్న పలు ఊర్లు, ఆ ఊర్లలో ఆయా వ్యక్తులు లేనే లేరన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోలా కృష్ణ మోహన్ కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కానీ తనకు వారు చెప్పినట్లుగా అకౌంట్లు ఉన్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు. అవినీతి సొమ్ముతో పత్రికను పెట్టి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేరాల ఊబిలో చిక్కుకుపోయి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తమపై అనేకసార్లు విచారణ జరిపినా ఏమీ నిరూపించలేక పోయారని, వాస్తవాలు చెప్పే ధైర్యం లేక తనపై బురద జల్లుతున్నారని, సాక్షిలో పేర్కొన్న అకౌంట్లు తనవనే గట్టి విశ్వాసం ఉంటే వారు ఫిర్యాదు చేసుకోవచ్చునని చంద్రబాబు సూచించారు. సిగ్గు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మాకు నైతిక బలముందని, తామెక్కడా భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసేవారు సిగ్గుతో తలదించుకునే రోజు వస్తుందన్నారు.

జగన్ విచారణ పై ఈడీ పిటిషన్ 25వ తేదికి వాయిదా

జగన్‌ను విచారించేందుకు అనుమతించాలన్న ఈడి పిటిషన్ ను కోర్టు 25వ తేదికి వాయిదా వేసింది. అయితే జగన్‌కు నోటీసులు అందజేయాలని కోర్ట్ ఈడికి సూచించింది. దీంతో ఈడి జగన్ తరఫు లాయర్లకు నోటీసులు అందించేందుకు సిద్ధమయ్యారు. అయితే జగన్ లాయర్లు ఈడి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో జైలులోనే జగన్‍‌కు నోటీసులు అందజేయాల్సిందిగా ఈడికి సిబిఐ కోర్టు సూచించింది.     కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆక్రమాస్తుల కేసు, ఎమ్మార్ కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసులలో రిమాండులో ఉన్న నిందితులను విచారించేందుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. నిందితుల విచారణకు మంగళవారం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారని భావిస్తున్న బ్రహ్మానంద రెడ్డిని విచారించనున్నారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయరాఘవలను విచారిస్తారు. ఓఎంసి కేసులో శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, శ్రీలక్ష్మిలను విచారిస్తారు. నిందితులను పదిహేను రోజులలో విచారించాలని కోర్టు ఈడికి ఆదేశాలు జారీ చేసింది.

నిధుల లేమితో ఐ అండ్ వీఆర్ విలవిల

ప్రభుత్వ పథకాల ప్రచారానికి సమాచార పౌరసంబంధాల శాఖ వెనకడుగు వేస్తున్నది. అసలు ప్రచారం నిర్వహించేందుకు ఈ శాఖ వద్ద ఏ ప్రతిపాదనా లేదని తేలిపోయింది. నిధుల లేమితో ఈ శాఖ సతమతమవుతున్నది. వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి గత ఏడాది జులై నుంచి బిల్లులు చెల్లించలేదని తెలుస్తున్నది. గత రెండు నెలలుగా ఉపఎన్నికల కొడ్ ఉన్నదని వివిధ పత్రికలకు ప్రకటనలు వాయిదా వేస్తూ ఆ శాఖ వచ్చింది. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక పత్రికలకు ప్రకటన ఇవ్వాలంటే ఆ శాఖకు నిధుల విషయం గుర్తుకు వచ్చింది. కొత్త కమీషనర్ వచ్చిన తరువాత డైరెక్టర్ స్థాయిలోనే ప్రకటనలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఐ అండ్ ఆర్ శాఖకు వందకోట్ల బడ్జెట్ కు బదులు కేవలం 50 కోట్లు మాత్రమే విడుదల చేశారని, దీంతో బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. కొత్త అడ్వర్టయిజ్ మెంట్స్ ఇవ్వాలంటే నిధులు లేక విడుదల చేయడం లేదని తెలుస్తున్నది. ఈ విషయమై ఆ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప ఈ శాఖ నుంచి ప్రభుత్వ ప్రకటనలు రావని తేలిపోయింది. చిన్న పత్రికలకు కనీసం 25,000 రూపాయలు ప్రకటనలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పోటీ విపరీతంగా పెరగడంతో గ్రేడింగ్స్ ఇవ్వాలని గత ఏడాది ఆ శాఖ నిర్ణయించింది. ఈ గ్రేడింగ్ వ్యవహారం ఇప్పటివరకూ తేలలేదు. కొన్ని పత్రికలకు రేట్ కార్డు మంజూరు చేసినా వాటికి కూడా ఈ శాఖ నుంచి ప్రకటనలు విడుదల కాలేదు. అన్ని శాఖల్లో ఉండే ప్రకటనల నిధులను సమీకరించి ఐ అండ్ పిఆర్ ద్వారా విడుదల చేసి ఆ శాఖల ద్వారా బిల్లు చెల్లించాలన్న ప్రతిపాదన ముందుకు సాగలేదు, నిధుల లేమితో ఆ శాఖ కుదేలవుతోంది. అయితే పత్రికల్లో ప్రకటనలు పక్కకు పెట్టి హోర్డింగ్ లకు మాత్రం ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఈ శాఖలో నిధులు లేనప్పటికీ క్షేత్ర స్థాయిలో ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడం గమనార్హం.

కాంగ్రెస్ మంత్రులకు కాలం చెల్లుతోందా?

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొంది మంత్రి పదవులు అందుకున్న వారందరూ ఏదో ఒక విచారణను ఎదుర్కోక తప్పటం లేదు. జగన్ అక్రమాస్తుల కేసులో ఐదుగురు మంత్రులు సిబీఐ విచారణ జాబితాలో ఉన్నారు. అలాన్నే మద్యం ఎం.ఆర్.పి. కన్నా అధికధరలకు అమ్ముతున్న కేసులో మరో ఇద్దరు మంత్రులు నిందితులయ్యారు. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరు మంత్రులు సున్నపురాయి నిక్షేపాలు ప్రైవేటు వ్యక్తికీ ధారాదత్తం చేసిన కేసులో హైకోర్టు నోటీసులు అందుకున్నారు. మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేటు వ్యక్తికీ సున్నపురాయి నిక్షేపాలను కట్టబెట్టారని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు జగన్ అక్రమాస్తుల కేసులో నిందుతులయ్యారు. వాన్ పిక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి మోపీదేవి వెంకటరమణ తన పదవిని త్యాగం చేయక తప్పలేదు.

మినరల్ కెమిస్ట్రీ చదివితే ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇస్తారా?

పీజీ చేసి ప్యూన్ గా ఉద్యోగం సరిపెట్టుకునే ఈ రోజుల్లో ... మినరల్ కెమిస్ట్రీ చదివి ఆక్నూ (ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ)లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసున్న ఒక వ్యక్తి వైనం ఇది. గత విద్యాసంవత్సరం క్లాసులు ముగిసేసమయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆక్నూలో అనదికార్ల ప్రొఫెసర్ల దందా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం పదేళ్ళు పూర్తి చేయకుండానే పి.హెచ్.డి. పూర్తయినట్లు నేరుగా ప్రొఫెసర్ హోదాలు ఇక్కడ కల్పించారు. అయితే ఈ హోదా ఎవరు కల్పించారన్న అంశంపై విసితో కలిసి విచారణ కమిటీ తెలుసుకుంటోంది. రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆదినుంచి సమస్యలతోనే ప్రారంభమైంది. ఈ యూనివర్సిటీకి స్థలాన్ని సేకరించిన తరువాత గతేడాదే క్లాసులు ప్రారంభమయ్యాయి. కాకినాడ జె.ఎన్.టి.యు. విసి అల్లం అప్పారావుకు యూనివర్సిటీ అదనపు బాధ్యతలు అప్పగించాక ఆయన విశ్వవిద్యాలుయ స్థలాలను చూసి గదుల నిర్మాణం వేగిరం చేస్తూనే క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత ఈ ఏడాది క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. గతేడాది క్లాసులు ముగింపు సమయంలో వచ్చిన అనధికార ప్రొఫెసర్లు దండా విచారణతో తరగతులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి విసి ఉన్నతస్థాయి విచారణ బృందానికి తనకు తెలిసిన సమాచారం ఇస్తూవచ్చారు. అయితే ఆ బృందం జరిగిందేమిటో తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. విసి కూడా ఆ ప్రొఫెసర్లను రప్పించి విషయం కనుక్కుంటున్నారు. పదేళ్ళ సీనియార్టీ చూపేందుకు ఒక ప్రొఫెసర్ తాను మహబూబ్ నగర లోని ప్రైవేటు విద్యాసంస్థలో పదేళ్ళు పనిచేసినట్లు ధృవపత్రాన్ని జతచేయటం కూడా నిబంధనల అతిక్రమణ కిందకే వస్తుంది. దీంతో ఆ ప్రొఫెసర్ తోనూ విసి చర్చించారు. అలానే మినరల్ కెమిస్ట్రీ చదివి ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని విచారించారు. విశ్వవిద్యాలయంలో అన్నీ నిబంధనల ప్రకారం ఉండాల్సిందేనని విసి స్పష్టం చేశారని సమాచారం. విచారణ బృందం నివేదిక ఇచ్చాకైనా ఇటువంటి ఆరోపణలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని విసి నిర్ణయం తీసుకున్నారు.

జగన్ జెండాను మార్చుకోవాలి

జగన్ తమ పార్టీ జెండాను, అజెండాను మార్చుకోవాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖామంత్రి తోట నర్సింహం సలహా ఇస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తన అజెండాలో వై.ఎస్.ఆర్. చుట్టూ సాక్షిపత్రిక, ఇందిరాచానల్, ఎం.ఆర్. కుంభకోణం, వాన్ పిక్ భూములు, మనీలాండరింగ్ చిత్రాలను చేర్చాలని మంత్రి సూచించారు. 2012 ఉపఎన్నికలంతా జగన్ ను విమర్శించాటానికే కాంగ్రెస్ నాయకులంతా సమయాన్ని వెచ్చిస్తే రామచంద్రాపురం అసెంబ్లీ ప్రచారంలో తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను విశదీకరిస్తూ అభ్యర్థి తోట త్రిమూర్తులు విజయానికి తోట నర్సింహం కృషి చేశారు. ఎన్నికల తరువాత ఆయన జగన్ పై చేసిన విమర్శ ఏమిటంటే ఒకటి ఆ పార్టీ జెండా మార్పు చేయాలని సూచన, రెండోది రాష్ట్రాన్ని దోచుకునే వారిని తూర్పుగోదావరి జిల్లాలో నమ్మరని త్రిమూర్తులు విజయం చాటిచెప్పిందన్నారు. ఇంక రెండు విమర్శలూ ఓకే మరి మంత్రిగారు తన మూడో విమర్శ ఎప్పుడు చేస్తారో అని పలువురు ఎదురుచూస్తున్నారు. మొదటి రెండు కొత్తదనంతో కూడిన విమర్శలకు ధీటుగా మూడోది ఉండాలని ఆయనకు పలువురు సూచిస్తున్నారు.

ఆ చిరు కానుకపై విమర్శల వెల్లువ

తాను ప్రాతినిథ్యం వహించిన తిరుపతి అసెంబ్లీని సోనియాగాంధీకి కానుకగా ఇస్తానని ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆ ఒక్క హామీ వల్లే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులూ, మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులూ పోటాపోటీగా విమర్శలు చేస్తున్నారు. అసలు తన గెలుపుకు కారణమైన పి.ఆర్.పి. శ్రేణులను వదిలేసిన చిరంజీవి అసలు ఎన్నికల్లో విజయం సాధించగలనని ఎలా అంచనా వేశారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని విమర్శకులు అంటున్నారు. మరి ఓటమి తరువాత సోనియాకు ఏమి కానుక ఇచ్చారో బహిరంగపరచాలని డిమాండు చేస్తున్నారు. పోనీ, భవిష్యత్తులోనైనా ఏమి కానుక ఇవ్వగలరో వెల్లడించాలని కోరుతున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ అప్పారెడ్డి అయితే అసలు చిరునే తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. సోనియాకు కానుక ఇస్తానని చిరంజీవి చేసిన ప్రకటనకు ఎన్నికల ఫలితాలను చూశాక నోటిమాటే పడిపోయి ఉండవచ్చని ఆయన ఎద్దేవా చేశారు.

దినేష్ రెడ్డి డిజిపి పదవికి ఎసరుపెట్టిన క్యాట్

రాష్ట్రప్రభుత్వ డొల్లతనానికి పరాకాష్టగా డిజిపి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) దినేష్ రెడ్డి నియామకం ఉందని క్యాట్ తేల్చేసింది. పైగా ఆ నియామకమే చెల్లదని సుదీర్ఘ విచారణ తరువాత క్యాట్ స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వం ఉన్నతపదవుల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని క్యాట్ తప్పుపడుతోంది. నిబంధనావళిని అతిక్రమించటం, సీనియర్టీలను సరిగా పరిశీలించకుండా ఆదేశాలు ఇచ్చేయటం, ఆశ్రితపక్షపాతం వంటి లక్షణాలు రాష్ట్రప్రభుత్వానికి ఉన్నాయన్న విమర్శలకు ఈ నియామకం అద్దం పడుతోందంటున్నారు. పోలీసుశాఖలోనే ఈ నియామకాన్ని సవాల్ చేసే పరిస్థితి ఏర్పడింది. సర్వీసు రిజిష్టర్లు వంటివి పరిశీలించటం, ఆన్ లైన్ లో ఉద్యోగుల సీనియార్టీ తెప్పించుకోవటం వంటి బోలెడు అవకాశాలుండగా ప్రబుత్వం ఎందుకు ఈ నియామకం చేసిందనే ప్రశ్న పలువురిని వేధిస్తోంది. దినేష్ రెడ్డికి డిజిపి పదవి ఎలా కట్టబెట్టారని సీనియర్ అధికారి గౌతమ్ కుమార్ క్యాట్ ను గతేడాది ప్రశ్నించారు. కేంద్రపరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తిరిగి డిజిపి పదవికి మరొకరిని నియమించాలని సూచించింది. వాస్తవానికి 1977 బ్యాచ్ కు చెందిన దినేష్ రెడ్డి కన్నా రెండేళ్ళ సీనియర్ ఇదే శాఖలో ఉన్నారు. 1975 బ్యాచ్ కు చెందిన కె.అర. నందన్ ను కాదని దినేష్ కు ప్రభుత్వం డిజిపి పదోన్నతి కల్పించింది. క్యాట్ సూచనల ప్రకారం ప్రభుత్వం ఇప్పుడు నందన్ ను డిజిపిగా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. మరి ప్రభుత్వం అలా స్పందిస్తుందా? కొత్తగా ఏమైనా కొర్రీలు పెడుతుందా అని గౌతమ్ కుమార్ ఆసక్తిగా గమనిస్తున్నారు. క్యాట్ తన పిటీషన్ పై స్పందించినందుకు ఆనందించిన ఆయన ప్రభుత్వం రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు.

36 బస్సుల సీజ్ తో ప్రక్షాళన జరిగిపోతుందా?

రాష్ట్రంలో అక్రమంగా నడుపుతున్న 36 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. వాటిలో 15 బస్సులు కాలేశ్వరి ట్రావెల్స్ కు సంబంధించినవి. 91 బస్సుల యజమానులపై కేసు పెట్టారు. కాలేశ్వరి ట్రావెల్స్ కు చెందిన బస్సు షిర్డీ వెళ్ళేదారిలో ప్రమాదం జరగటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పందించిన రవాణాశాఖాధికారులు ప్రక్షాళనకు నడుంబిగించారు. దీనిలో భాగంగా తమకు అనుమానం వచ్చిన అనేక అంశాలపై ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా ప్రై'వేటు' యజమానుల అక్రమాలకూ అద్దం పట్టే సాక్ష్యాలను వెదికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్నా వాహనాల కింద లెక్కకు వచ్చిన 91 బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 36 బస్సులను సీజ్ చేశారు. వీటిలో 25 బస్సులు హైదరాబాద్ కు చెందినవే కావటం గమనార్హం. విశాఖపట్నంలో నాలుగు బస్సులను కూడా సీజ్ చేశారు. హైదరాబాద్ లో సీజ్ చేసిన బస్సులను ఖైరతాబాద్ లోని ఆర్తీఎ కార్యాలయానికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద మూడు ప్రైవేటు బస్సులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.     హైదరాబాద్ ఎల్బీనగర్ చెక్ పోస్ట్ వద్ద 12, శంషాబాద్ షాపూర్ చెక్ పోస్ట్ వద్ద 5 బస్సులను సీజ్ చేశారు. ప్రతీ ఏటా వందకోట్ల రూపాయలు పన్నుగా చెల్లించే తమను మీడియా మాఫియాగా చిత్రీకరించటం తగదని ప్రైవేటు ఆపరేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మీడియాకు వ్యతిరేకంగా ఈ సంఘం నినాదాలు చేసింది. హైదరాబాద్ లో కొందరు పత్రికాప్రతినిథులను బెదిరించేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో దుడుకుగా వ్యవహరించిన ప్రయివేటు ఆపరేటర్లను పోలీసులు అదుపు చేశారు. షిర్డీ వెళ్ళే బస్సుకు ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్షమే కారణమని ఆందోళనల నేపథ్యంలో రవాణాశాఖ డ్రైవింగ్ పై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించి ఆ తరువాత పరీక్ష పెడతారు. దీనిలో పాసైతే ఫర్వాలేదు కానీ, లేకపోతే మళ్ళీ పరీక్ష కూడా తప్పదు. ఈ పరీక్షలో పాసైతేనే డ్రైవర్ ను వాహనం నడపటానికి అనుమతి ఇస్తారు. ఇదిలా ఉండగా పాఠశాలలు వాడుతున్న బస్సుల ఫిట్ నెస్ కూడా పరీక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అసలు లైసెన్సు లు కూడా లేకుండా పాఠశాలల బస్సులు నడుపుతున్నారని ఆరోపణలున్నాయని రవాణా అధికారులకు తెలిపారు. ఫిట్ నెస్ లేని స్కూలు బస్సులను రోడ్డుదీడకు వదలకుండా కఠినచర్యలు తీసుకోవాలన్నారు.

కొత్త మద్యందుకాణ యజమానులకు పాతయజమానుల ఇంటర్వ్యూలు?

కొత్త మద్యం దుకాణదారులకు ప్రస్తుత యజమానులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారినే కొత్తపాలసీ కింద ఎక్సైజ్ కు దుకాణదారులుగా పరిచయం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్తపాలసీ ప్రకారం రూపొందించిన నిబంధనావళి కాపీలను ప్రస్తుత యజమానులు తమ దగ్గర పెట్టుకుని అర్హతలు కూడా పరిశీలిస్తున్నారు. పాన్ కార్డ్, మూడేళ్ళ రిటర్న్స్ దాఖలు చేయగలిగితే తెలివైన అమాయకుల కోసం ప్రస్తుత మద్యం దుకాణ యజమానులు వెదుకుతున్నారు. ప్రత్యేకించి తమ కాళ్ళదగ్గర పడుండే వారిలో నమ్మకస్తులను ఎంపిక చేసుకుంటున్నారు. అలా లేకపోతే కొత్తవారిని పిలిపించి ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకున్న తరువాతే ఇంటర్వ్యూలు, ఎంపిక పూర్తి చేస్తున్నారు. తమకు నచ్చితే దరఖాస్తు నింపేసి వారిని నేరుగా ఎక్సైజ్ కార్యాలయం ముందు దింపుతున్నారు. ఇలా తమవారినే ఎక్సైజ్ శాఖ లాటరీ ద్వారా ఎంపిక చేసేందుకు పైరవీలకూ సిద్ధమవుతున్నారు. దుకాణం శాంక్షన్ అయితే పెట్టుబడి తమది కాబట్టి 70 శాతం లాభం వదిలేయాలని ఒప్పందం చేసుకుంటున్నారు. తాము పంపించే వారిలో ఎవరు ఎంపికవుతారో తెలియదు కాబట్టి ముందస్తుగా ప్రతీ యజమాని తమ తరుపున ముగ్గురిని లాటరీకి పంపిస్తున్నారు. తక్కువ జీతంతో కుటుంబ అవసరాలు తీరని ప్రయివేటు ఉద్యోగులు ఈ దుకాణాల కోసం ఆశపడుతున్నారు.       ప్రస్తుత మద్యం షాపుల యజమానులు కూడా వీరిపైనే కన్నేశారు. వీరికైతేనే పాన్ కార్డ్, మూడేళ్ళ రిటర్న్స్ ఉంటాయి. అందుకే ముందుగా బంధువుల్లో ఈ తరహా ఉద్యోగులను వెదుకుతున్నారు. దొరక్కపోతేనే కొత్తవారికి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించే ఇంటర్వ్యూల కన్నా ప్రస్తుత మద్యం దుకాణదారుల ఇంతర్వ్యూలకే డిమాండు ఉంటోంది. అప్ సెట్ ధరలో మూడోవంతు ముందుగానే చెల్లించటానికి ప్రస్తుత యజమానులు సిద్ధంగానే ఉన్నారు. ఏడాదిలో సత్ప్రవర్తన ఉంటేనే మద్యం దుకాణం మరో ఏడాది కొనసాగుతుంది కాబట్టి ఆ తరహాలో కనిపించే వారినే ప్రస్తుత యజమానులు పంపుతున్నారు. కొత్తగా వచ్చే యజమానులు కూడా సిండికేట్ అయ్యేందుకు వీరు ముందునుంచే ప్రతిపాదనలు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తులో భాగస్వామి పెరుండాలన్న నిబంధన ప్రకారం తమ పేర్లయితే ఎక్సైజ్ అధికారులు గుర్తుపదతారు కాబట్టి ఇంట్లో మరొకరి పేరును భాగస్వామిగా రాయిస్తున్నారు. అంటే మొత్తానికి ఎన్ని కేసులు పెట్టినా మద్యం దుకాణాలను వదలటానికి ప్రస్తుత యజమానులకు ఇష్టం లేదు. లాభానికి అలవాటుపడ్డ ప్రాణం కాబట్టి తమ తరుపువారి పేరుతొ దుకాణాలను సొంతం చేసుకోవాలని ప్రస్తుత యజమానులు ఆరాటపడుతున్నారు. ఈ తెరవెనుక భాగోతం అంతా తెలిసినా ఎక్సైజ్ శాఖ మౌనంగా ఉంటోంది. తాము లాభపడే అవకాశాలను కాలదన్నుకోకుండా ఆ శాఖ ఉద్యోగులు కొత్త దరఖాస్తులను లాటరీ కోసం స్వీకరిస్తున్నారు. ఈ తతంగం రాష్ట్రంలోని తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వెలుగుచూసింది.

సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో పెరుగుతున్న అవినీతి?

రాష్ట్రంలోని సబ్ రిజిస్త్రార్ కార్యాలయాలు అవినీతికి వేదికలవుతున్నాయి. ఇటీవల ఎసిబికి అందిన దరఖార్సుల్లో ఎక్కువభాగం సబ్ రిజిస్టారు అవినీతి మీదే అని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాకినాడ సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో సీనియర్ రిజిస్ట్రారు పదివేల రూపాయలతో దొరికిపోయారు. అలానే దస్తావేజు లేఖర్ల నుంచి కూడా అవినీతి వాటా కింద 47వేల రూపాయలు దొరికింది. ఆ తరువాత రాజమండ్రిలోనూ ఈ అవినీరి ఆరోపణలు వినిపించాయి. అనంతపురం జిల్లాలోనూ సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు అవినీతికి మారుపేరని గుర్తించారు. నకిలీ చలానాలతో సుమారు పదిలక్షల రూపాయలు లబ్ది పొందారని వెలుగులోకి వచ్చింది. సబ్ రిజిస్ట్రారు, ఇద్దరు అటెండర్లను డిఐజి గిరిబాబు సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులను వదలకుండా ఈ కార్యాలయాల్లో సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ధర్మవరం సబ్ రిజిస్ట్రారు రెండు లక్షల రూపాయలతో దొరికిపోయారు. ఐదేళ్ళ క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలోనూ అవినీతి భాగోతం వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని కార్యాలయాలూ అవినీతికి నిలయాలే అని ఆ జిల్లా నేతలు ఆందోల వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రారుకు అటెండర్ల ద్వారా అవినీతి వాటాలు అందుతున్నాయని వారు ఆ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఎసిబి కూడా వరుసగా రిజిస్ట్రారు కార్యాలయాలపై దాడులు ప్రారంభిచి మధ్యలో ఆపేసింది. తిరిగి ఆ తరహాలోనే దాడులు కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.

గందరగోళంగా కానిస్టేబుల్ రాతపరీక్ష ప్రశ్నాపత్రం

కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేసేందుకు నిర్వహించిన రాతపరీక్షల్లో రెండు భాషల్లో వేర్వేరు అర్థాలున్న రెండు ప్రశ్నలు, వాటికి రెండు వేర్వేరు జవాబులు ఇచ్చారు. ఇలాంటి అరుదైన సంఘటన అభ్యర్థులను కలవరపరిచింది. ఈ రాతపరీక్షలకు సీరీస్-ఎ లో ఇచ్చిన 30వ ప్రశ్న గందరగోళంగా ఉంది. ఇంగ్లీసు భాషలో కేంద్ర హోంమంత్రి ఎవరు? అని ప్రశ్న ఇచ్చారు. తెలుగుభాషలో రక్షణమంత్రి ఎవరు? అని ప్రశ్న ఇచ్చారు. ఈ రెండూ వేర్వేరు అర్థం వస్తాయి కాబట్టి జవాబుల్లో పి.చిదంబరం, ఎ.కె. ఆంటోనీ పేర్లు ఇచ్చారు. దీంతో ఈ ప్రశ్నకు ఎలా సమాధానం రాయాలో అభ్యర్థులకు అర్థం కాలేదు. మొత్తం 20,429 పోస్టులకు ఈ రాత పరీక్ష జరిగింది. సుమారు లక్షా 23వేల మంది అభ్యర్థులు ఈ రాతపరీక్షల్లో గందరగోళానికి ఇబ్బంది పడ్డారు.

ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్న ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల మాఫియా

రాష్ట్రంలోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు మాఫియా ముఠాగా మారి ప్రభుత్వానికే సవాల్ గా మారారు. నిబంధనలకు విరుద్ధంగా వీరు కార్యకలాపాలు నిర్వహిస్తూ కోట్లాదిరూపాయలు ఆర్జిస్తున్నారు. అటు ప్రభుత్వంలోని పెద్దలను ఇటు అధికారులను మేనేజ్ చేస్తూ యథేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఒకే పర్మిట్టు, ఒకే నెంబరుతో రెండేసి వాహనాలను ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతున్నారు. షిర్డీ వెళ్ళే కాళేశ్వర్ ట్రావెల్స్ బస్సుకు ఒస్మాబాద్ వద్ద ప్రమాదం జరగటంతో అప్రమత్తమైన రవాణాధికారులు అసలు ప్రైవేట్ ఆపరేటర్ల పనితీరుపై దృష్టిసారించారు. రెండువేల మందిప్రైవేట్ ఆపరేటర్లు అసలు నిబంధనలు పాటించటం లేదు. కాంట్రాక్టు క్యారియర్ల కింద అనుమతి పొందటానికి ప్రతిసీటుకు 2,625రూపాయల చొప్పున రవాణాశాఖకు చెల్లించాలి. దేశవ్యాప్తంగా నడుపుకోవాలంటే సీటుకు 3,675రూపాయలు చెల్లించాలి. అంటే 54సీట్లున్న బస్సుకు మూడు నెలలకు లక్షా 25వేల రూపాయలు అనుమతికి ఖర్చు చేయాలి. దేశవ్యాప్త అనుమతికి రెండు లక్షల రూపాయల చొప్పున కట్టాలి. ఇలా అనుమతులు పొందుతున్న సర్వీసులు అతితక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. సగటున 75 బస్సులు నడిపే సంస్థలు రాష్ట్రంలో 40కు పైనే ఉన్నాయి. అలానే చిన్నసంస్థలు 50ఉన్నాయి. ఈ వివరాలన్నీ రవాణాధికారులు తెలుసుకున్నందున వారిని మేనేజ్ చేసేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు సిద్ధమయ్యారు.

వందల సంఖ్యలో కార్యకర్తలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి వలస?

అనుకున్నట్లే జరుగుతోంది. ఉపఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు వలసబాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ధోరణి కనబడుతోంది. అనంతపురం జిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం తక్కువగా ఉంది. అయినా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ పార్టీలోకి వలసలు హఠాత్తుగా పెరిగాయి. ఒకేసారి మూడువందలకు పైగా కార్యకర్తలు గుంతకల్లు మండలంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఆ పార్టీ గుంతకల్లు ఇన్ ఛార్జి వై.వెంకటరామిరెడ్డి కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని రామిరెడ్డి తెలిపారు. పామిడిమండలం రామగిరి, ఎన్. వెంకటాపల్లికి చెందిన కార్యకర్తలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్త కార్యకర్తలను మెడలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కండువాలతో పార్టీలోకి నాయకులు ఆహ్వానించారు. దీంతో జిల్లాలో రెండు ప్రధానపార్టీలపై కార్యకర్తల ప్రభావం చూపుతుందని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్, టిడిపి నాయకులు తమను కరివేపాకుల్లా వాడుకుని వదిలేశారని, అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు తమకేమీ చేయలేదని అందువల్ల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న భావనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వలసలను ఆపడం కాంగ్రెస్, టిడిపి లకు తలనొప్పిగా మారింది.