సోనియా దయతలిస్తే సుబ్బిరామిరెడ్డికి కేంద్రమంత్రి పదవి
posted on Jun 14, 2012 @ 11:17AM
గెలుపోటములు సహజమే. అందుకే నెల్లూరు లోక్ సభ స్థానం కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చుఅయినా ఫర్వాలేదనుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. అయితే ఈ విషయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా దృష్టికి చేరటమే ఆయన లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ గెలుపోటములతో సంబంధం లేకుండా ఆమె కరుణ చూపి ఏ కేంద్రమంత్రి పదవి అయినా ఇవ్వవచ్చని సుబ్బిరామిరెడ్డి భావిస్తున్నారు. అందుకే పోలింగ్ పూర్తయిన క్షణం నుంచి ఢిల్లీ నేతలతో మంతనాలు చేస్తున్నారు. మేడమ్ కు ముఖ్యమైనవారికి తాను వందకోట్లకు పైచిలుకు ఖర్చుపెట్టినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డికి అనుకూలమంటున్నారని ఆవేదనా పూరితంగా చెప్పి రక్తికట్టిస్తున్నారు. అయ్యో! పాపం అనిపించుకునేలా సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవేళ తాను ఓటమి పాలైతే తిరిగి విశాఖపట్టణం టిక్కెట్టు కోరవచ్చు అని ఆయన భావిస్తున్నారు. కేంద్రమంత్రి పురందరేశ్వరి కూడా ఈ ఓటమి వల్ల అక్కడికి తిరిగివచ్చారని సరిపెట్టుకుంటారని కూడా సుబ్బిరామిరెడ్డి భావిస్తున్నారు. ఆ సానుభూతితోనే భవిష్యత్తులో మంచి పదవులు వరించే అవకాశాలూ ఉంటాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకే డబ్బు తగలేశాను మేడమ్ కనికరించండి అని చెప్పేందుకు సుబ్బిరామిరెడ్డి రంగం సిద్ధం చేసుకున్నాడు.