ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వి.హెచ్.

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా కుటుంబానికి వీర విధేయుడు అయిన వి.హనుమంతరావు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం కావడాన్ని సాకుగా తీసుకుని వి.హనుమంతరావు ముఖ్యమంత్రి పదవికోసం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఎన్నడూ లేని విధంగా గత శనివారం హనుమంతరావు తన జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. రాష్ట్ర క్యాబినెట్ కి చెందిన 10మంది మంత్రులు స్వయంగా వేడుకలకు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల అనంతరం హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అవినీతిని తీవ్ర పదజాలంతో విమర్శించారు. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాబోడని జోస్యం చెప్పారు. ఈ ప్రకటనలు హైకమాండ్ మెప్పుకోసమే ఆయన చేసుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. సోనియా గాంధీ కుటుంబం వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబీకులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వై.ఎస్. కుటుంబాన్ని విమర్శిస్తూ హైకమాండ్ కు మరింత దగ్గర కావాలన్నది హనుమంతరావు వ్యూహంగా కనిపిస్తుంది. తనను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా రాష్ట్రంలో రెడ్డి కులస్థుల ఆధిపత్యం తగ్గించడంతో పాటు బిసిలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో ప్రత్యేక తెలంగాణా వాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునన్న సంకేతాలను వి.హెచ్. హైకమాండ్ కు పంపినట్లు తెలుస్తోంది.       సామాజికపరంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెడ్డి, కమ్మ, ఎస్.సి, ఎస్.టి., మైనారిటీలకు దూరంజ్ అయిందని ఆ పార్టీకి ఇటీవలి ఉపఎన్నికల్లో బిసిలు మద్దతు ఇవ్వడం వల్లే కనీసం రెండు స్థానాల్లో అయినా గెలుపొందిందని వి.హెచ్. ఇటీవల వాయిలార్ రవి, గులాంనబీ ఆజాద్ లకు చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళుతెరిచి బిసిలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో అన్ని  ప్రాంతాల్లోనూ ఘోర పరాజయం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన వి.హెచ్. తాను ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ తన వర్గానికి చెందిన నాయకులు ఉన్నారని, తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగెస్ నాయకులు కూడా తన మాట జవదాటరని ఆయన భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మార్చే విషయాన్ని ఆలోచిస్తే వి.హెచ్. తప్పనిసరిగా ఒక గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థి కాబోతున్నారు. ఇదిలా వుండగా ఢిల్లీలో పలుకుబడి ఉన్న మరో నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిని హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పదవిని తిరిగి రెడ్డి కులస్థులకు ఇచ్చే పక్షంలో తన పేరును పరిశీలించాల్సిందిగా ఆయన హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలిసింది. బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ ఉపఎన్నికల ఫలితాలు ఆయన ప్రయత్నాలకు గండికొట్టాయి. దీనికి తోడు గతంలో ఆయనపై ఎసిబి దాడుల వివాదాలు చుట్టుముట్టడం, కాంగ్రెస్ పార్టీనుంచి వలసలను అరికట్టలేక పోవడం మైనస్ పాయింట్లుగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో కమ్మ కులస్థులకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే వాదన ఉంది. రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు వంటి సీనియర్లు తమ అక్కసును బహిరంగంగానే వెళ్ళగక్కారు. తమ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చే విషయాన్ని అధిష్టానం ఆలోచిస్తే కేంద్రమంత్రి పురందరేశ్వరి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్లు పరిశీలించవలసిందిగా కమ్మనాయకులు అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది.

వికలాంగుల పాఠశాలల పేరిట దోపిడీ?

వికలాంగుల హాస్టల్, విద్యకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పాఠశాలల పథకాన్ని స్వచ్చందసంస్థలు దుర్విన్హియోగం చేస్తున్నాయి. 14ఏళ్ళలోపు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదుపాయాన్ని కొన్ని సంస్థలు దోపిడీ చేసుకునేందుకు వినియోగించుకుంటున్నాయి. ప్రతీ విద్యార్థికి 2వేల రూపాయల చొప్పున 50మంది ఉండే పాఠశాలకు నెలకు లక్షరూపాయలు నేరుగా అకౌంట్ లో వేసే సదుపాయాన్ని ఆ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక పాఠశాలలపై 'తెలుగువన్.కామ్' పరిశీలన చేస్తే అసలు పాఠశాల కూడా పెట్టకుండానే కొన్ని స్వచ్చందసంస్థలు తమ అకౌంట్ల ద్వారా డబ్బులు తెప్పించుకుంటున్నాయి. ప్రత్యేకించి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో స్వచ్చందసంస్థలు తమ ఆదాయవనరుగా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నివేదికలు మాత్రమే సక్రమంగా పంపిస్తూ పాఠశాలలను కాయితాలపై లేక్కల్లా చూపుతున్నారని ధానమైన ఆరోపణ. దీని పొరుగున ఉన్న విశాఖజిల్లాలో పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. నర్సీపట్నంలోని ఏరియా ఆసుపత్రి సమీపంలో సిబిఎం కాంపౌండ్ లో ఒక స్వచ్చందసంస్త వికలాంగుల ప్రత్యేక పాఠశాల అని ఇటీవల బోర్డు పెట్టింది. అందులో వికలాంగ విద్యార్థులు పెద్దగా ఎవరికీ కనిపించలేదు. బోర్డు పెట్టిన రెండు నెలల తరువాత ఆ సంస్థ ప్రతినిథి ఏడు నెలలనుంచి నడుపుతున్న పాఠశాలను మూసివేస్తున్నట్లు ఎంఇఓ దివాకర్ కు లేఖ రాశారు. తానెప్పుడూ ఆ పాఠశాలనే చూడలేదని దివాకర్ ఆశ్చర్యపోయారు. ఇదే విషయమై సర్వశిక్షాఅభియాన్ విశాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావును ప్రశ్నిస్తే ఆ పాఠశాలల నిర్వహణ విషయంలో తమ ప్రమేయం లేదన్నారు. ఎంఇఓ దివాకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 2011 జులైలో తాము పాఠశాల పెట్టామని, 2012 జనవరిలో పాఠశాల మూసేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిథి తెలిపారు. పాఠశాల పెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి విద్యార్థికి 2వేల రూపాయల చొప్పున తమ అకౌంటులో పడుతున్నప్పుడూ చెప్పని సంస్థ ఎంఇఓ కు లేఖ ఎందుకు రాసిందని అధికార్లను ప్రశ్నిస్తే దాన్ని ధృవీకరించాల్సింది మాత్రం ఎంఇఓ అన్న విషయం తెలిసింది. ఇలా వికలాంగుల ప్రత్యేకపాఠశాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా దోపిడీ జరుగుతోంది. దీనిపై రాష్ట్రస్థాయిలో స్పందించాలని వికలాంగ సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి.

మద్యం సిండికేట్ లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లు

ఎప్పటినుంచో మద్యం వ్యాపారంలో ఉన్నా బయటికిరాని కొత్త పాత్రలు ఇప్పుడు పరిచయమవుతున్నాయి. పాటజాబితాలో పాత్రధారులుగా ఉన్న ఇద్దరు సిండికేటు వాటాదారులు ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఉపఎన్నికల్లో గెలుపొందారు. దీంతో సిబీఐ జాబితాలోని రాజకీయనాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. అలానే గుంటూరు జిల్లాలో ఎసిబి వలేసి పట్టుకున్న నారాకోడూరు మద్యం సిండికేటు నిర్వాహకుడు జమ్ముల ఉమామహేశ్వరరావును విచారిస్తే ఆయన కూడా కొన్ని కొత్తపాత్రల వివరాలు కక్కారట. దీంతో ఈ మద్యం వ్యవహారం కొన్ని కీలకమైన మలుపులు తిరుగుతోంది. ఎం.ఆర్.పి. కన్నా అధికధరలకు మద్యం అమ్మకాలు జరిపిన కేసులో ఎసిబి కొంత పురోగతి సాధించింది. ప్రస్తుతం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావులను ఎసిబి డిఎస్పీలు విచారిస్తున్నారు. అయితే వీరి వెనుకే నిందుతుల జాబితాలో ఉన్న చెన్నకేశవరెడ్డి, నరసన్నపేటకు చెందిన కృష్ణదాసు ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిని కూడా విచారించనున్నారు. గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన జమ్ముల ఉమామహేశ్వరరావు ఎం.ఆర్.పి. ధరలకన్నా అధికరెట్లకు మద్యం విక్రయించిన సిండికేట్లలో ప్రముఖుడు. ఇతనికి ఇక్సైజ్ శాఖతో సత్సంబంధాలున్నాయి. ఎసిబి ఈ కేసు విచారిస్తోందనీ, దానిలో ఉమామహేశ్వరరావు పేరు కూడా ఉందని సమాచారం అందుకున్న వెంటనే ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. చాలాకాలం కనిపించకుండాపోయిన ఉమామహేశ్వరరావు తన సంగతి అందరూ మరిచి ఉంటారని ఇటీవల బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే ఎసిబి ఆయన్ని చాకచక్యంగా అరెస్టు చేసింది. ఆయన్ని విచారించగా చేబ్రోలుకు చెందిన ఓ చోటానాయకుని వివరాలు ,నారాకోడూరు ఎక్సైజ్ కానిస్టేబుల్, ఓ కాంగ్రెస్ నాయకుడి వివరాలు కక్కేశారు. వీరందరూ సిండికేటు వాటాదారులు. ఉమామహేశ్వరరావు ఎసిబి కోర్టులో హాజరుపరిస్తే ఆయనకీ 14రోజుల రిమాండు విధించింది. ఇటీవల ఇదే జిల్లాలోని పొన్నూరులో మద్యం వ్యాపార్య్లపై ఎసిబి దృష్టిసారించింది. అలానే ములుకుదురు సాయి బీర్ అండ్ వైన్స్ యజమాని అన్వర్ గౌడ్ తెల్లకార్డును రెవెన్యూ అధికారులు క్యాన్సిల్ చేశారు. ఉమామహేశ్వరరావు రిమాండు ఎసిబి విచారణ గుంటూరు జిల్లాలోని మద్యం సిండికేట్లను వణికిస్తోంది. ఎసిబి పేరు వింటేనే వ్యాపారులు భయపడుతున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసు: ఎన్ శ్రీనివాసన్‌ను ప్రశ్నిస్తున్న సిబిఐ

జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్‌ సిబిఐ అధికారులు ముందు హాజరయ్యారు. వైయస్ జగన్‌కు చెందిన సాక్షి, కార్మైల్, భారతి సంస్థల్లో పెట్టుబడులపై సిబిఐ అధికారులు శ్రీనివాసన్‌‌ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపులో ప్రయోజనం చేకూర్చారని, అందుకు ప్రతిగా ఇండియా సిమెంట్స్ వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని సిబిఐ రెండు వరాల ముందు సిబిఐ నోటిసులు జారీచేసింది. ఇండియా సిమెంట్స్ ప్లాంట్లకు నిబంధనలకు విరుద్ధంగా నీటి కేటాయింపు జరిగిందని, వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకు ప్రతిఫలంగానే ఇండియా సిమెంట్స్ నీటి కేటాయింపును పొందిందని అంటున్నారు. ఇండియా సిమెంట్స్‌కు ప్రభుత్వం కడప, కర్నూలు, అనంతపురం, రంగా రెడ్డి జిల్లాల్లో సున్నపురాయి నిక్షేపాలను కూడా కేటాయించింది. ఇండియా సిమెంట్స్‌తో పాటు పెన్నా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్లకు కూడా సిబిఐ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఇతర రెండు సిమెంట్ కంపెనీలకు సున్నంరాయి గనుల కేటాయింపుపై ప్రశ్నించేందుకు సిబిఐ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ధర్మాన ప్రసాద రావు రెవెన్యూ మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ ప్రజల దృష్టిలో లగడపాటి ఓ జోకర్ : హరీష్‌రావు

కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అతితెలివితేటలు ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీస్‌రావు మండి పడ్డారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ పరకాలలో 99 శాతం మంది తెలంగాణానే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజల దృష్టిలో లగడపాటి ఓ జోకర్ అని ఘాటుగా విమర్శించారు. పరకాలలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలమనే ప్రచారం చేశాయని, దీనిపై లగడపాటి, వాయలార్ రవికి సీడీ లు పంపుతామన్నారు. లగడపాటి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అసలు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడేందుకు లగడపాటికి లైసెన్సు ఎవరిచ్చారని ప్రశ్నించారు. లగడపాటిని కట్టడి చేయాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కోరారు. తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడే నైతికహక్కు రాజగోపాల్‌కు లేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

విద్యార్థులను పీడిస్తున్న పాఠ్యపుస్తకాల కొరత?

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాఠ్యపుస్తకాల కొరత ఏర్పడింది, దీనికి ప్రధానంగా రవాణా సమస్యే కారణమని సమాచారం వస్తోంది. పుస్తకాల ముద్రణ పూర్తయినా ఉపఎన్నికల వల్ల రవాణా దెబ్బతిందని తెలుస్తోంది. మొత్తం 12 జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల వల్ల వాహనాల కొరత, ఇతర సమస్యలూ కూడా పాఠ్యపుస్తకాల కొరతకు కారణమైంది. ప్రత్యేకించి 20 జిల్లాల నుంచి ఈ సమస్య గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో హిందీ, సైన్స్ పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని జిల్లాలో హిందీ పుస్తకమే దొరికిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. జిల్లాకు సుమారుగా ఇరవైలక్షల పైచిలుకు పాఠ్యపుస్తకాలు అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముద్రణాలయం జిల్లాల వారీగా అవసరాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ముద్రించింది. ప్రతీ జిల్లాలోనూ ఇంకో మూడు రోజుల్లో పుస్తకాలు వచ్చేస్తాయని చెబుతున్నారు. కడప జిల్లాకు 26 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమైతే ఇప్పటి వరకు 8 లక్షల పుస్తకాలు మాత్రమే అందాయి. మిగిలిన పుస్తకాలు త్వరలో వస్తాయని అధ్కారులు తెలిపారు. అలానే తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో పాఠ్యపుస్తకాల్లో ఒక సబ్జెక్టు, మరో పుస్తకం మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు ప్రకటించారు.

సింగరేణి కార్మిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ?

ఈ నెల 28న జరగనున్న సింగరేణి కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికల్లో త్రిముఖపోటీ నెలకొంది. ఎ.ఐ.టి.యు.సి., ఐ.ఎన్.టి.యు.సి. టి.బి.జి.కెన్. యూనియన్లు పోటీపడుతున్నాయి. ఈ సంస్థ 11 ఏరియాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికి మూడుసార్లు ఎ.ఐ.టి.యు.సి., ఒకసారి ఐ.ఎన్.టి.యు.సి. ఈ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపొందాయి. ఇప్పటికే 11 ఏరియాల్లో 3 ఏరియాల్లో టి.బి.జి.కెన్. విజయం సాధించింది. కొన్ని ప్రాంతాల్లో ఈసారి చతుర్ముఖపోటీ తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి. సి.ఐ.టి.యు. ఈ చతుర్ముఖపోటీలో పై మూడు యూనియన్లతో పోటీపడుతుంది. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ సింగరేణి పరిశ్రమలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఇటీవల ముగిసిన ఉపఎన్నికల కన్నా సీరియస్ గా జరుగుతున్నాయి. యూనియన్లు అన్నీ తాము గుర్తింపు యూనియన్ గా ఎన్నికైతే కర్ముకులకు ఏమి చేయాలనుకుంటున్నాయో అజెండారూపంలో తెలిపే కరపత్రాలను కూడా పంపిణీ చేశాయి. ఇటీవల కార్మికులను నేరుగా కలిసిన యూనియన్ల నాయకులు ఇప్పటిదాకా తమ సంఘం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాయో విశాదీకరించాయి. దీంతో ఏ సంఘానికి ఓటు వేయాలనే అంశంపై కార్మికులు చర్చిస్తున్నారు. అంతేకాకుండా యూనియన్ అజెండాల్లో ఉన్న కీక అంశాలు కూడా ఈ చర్చల్లో నలుగుతున్నాయి. అయితే కొత్తగా తెలంగాణావాదాన్ని ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టేందుకు టి.బి.జి.కెన్. ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతీయతా బేధాలు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో మంచిది కాదని ఏ.ఐ.టి.యు.సి, ఐ.ఎన్.టి.యు.సి. తదితర యూనియన్లు కార్మికులకు వివరించాయి.

కర్నూలు జిల్లా ఎన్నికలకే రూ.30కోట్ల ఖర్చా?

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉపఎన్నికల్లో అభ్యర్థులు రూ.30కోట్ల వరకూ ఖర్చు పెట్టారని అంచనాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపుకోసం సుమారు 12కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఎమ్మిగనూరులో ఐదు కోట్ల రూపాయలు, ఆళ్లగడ్డలో ఏడు కోట్ల రూపాయలు ఆ పార్టీ ఖర్చు చేసిందని లెక్క తేలుతున్నాయి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తేలింది. ఈ రెండు పార్టీలు ఖర్చు చేసిన 20కోట్ల రూపాయలు పోను మిగిలినది కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఖర్చులో ఎక్కువ భాగం నేతలు వచ్చినప్పుడు చేసినదే. అదీ సిఎం రోడ్డుషో, వాయలార్ రవి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వంటివారు వచ్చినప్పుడు అయిన ఖర్చే ఎక్కువని తెలుస్తోంది. ఏమైనా రెండు నియోజకవర్గాల్లోనే 30కోట్ల రూపాయలు ఖర్చు అయితే మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఎంత ఖర్చు అయిఉండవచ్చు అనేది ఇట్టే అంచనా వేయవచ్చు. తెలుగువన్.కామ్ గతంలో చెప్పినట్లు ఆ ఖర్చు సుమారు 200కోట్ల రూపాయలు దాటే ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తేల్చేస్తున్నారు.

12 రోజుల్లో లక్షల సంపాదనకు మద్యం వ్యాపారుల ఆరాటం

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఎం.ఆర్.పి. ధరలకన్నా ఎక్కువకు జరగటంతో ఎసిబి సిండికేట్ లో పాత్రదారులపై విచారణ ప్రారంభించింది. ఈ దశలోనే తమ లైసెన్సులకు 13 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అనంతవ్యాపారులు ఎం.ఆర్.పి. ధరలకు అదనపు రేట్లకు అమ్మకాలు ప్రారంభించారు. ఉపఎన్నికలు ప్రారంభమైన తరువాత రెండు రుజులపాటు ప్రభుత్వం డ్రైడేలు ప్రకటించింది. దీన్ని ఆసరాగా చేసుకుని అనంత మద్యం వ్యాపారులు దొంగచాటు వ్యాపారం చేశారు. అప్పుడు బాటిల్ కు వందరూపాయలు కూడా అదనంగా తీసుకున్నారు. ఈ రెండు రోజుల్లో వచ్చిన ఆదాయం మళ్ళీ మద్యం వ్యాపారుల మనస్సు మార్చింది. ఎసిబి దాడి చేస్తుందన్న భయాన్ని వదిలేశారు. చివరి 13 రోజుల్లో అందినలాడికి దోచుకోవడానికి సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లాలో మొత్తం 234 మద్యందుకాణాలున్నాయి. 10 బార్లున్నాయి. తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, కదిరి, కళ్ళిచోరదుర్గం, గుత్తి, అనంతపురం రూరల్ మండలాల్లో మద్యం ఎం.ఆర్.పి. కన్నా అదనపు ధరలకు అమ్ముతున్నారు. కనీసం 30-40 రూపాయలు బాటిల్ పై అదనంగా అమ్ముతున్నారు. ఉపేన్న్కల్లో అయితే రూ. 60, 100, 150రూపాయలు కూడా అదనంగా అమ్మేశారు. దీంతో మళ్ళీ ఎం.ఆర్.పి. ధరలకన్నా ఎక్కువగా అమ్ముతున్నారని ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేస్తే స్పందన కరువైంది.

పరకాలలో గెలిచిన వాదం ఏది?

పరకాల అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో సమైక్యతాపార్టీలే గెలుపొందాయి. దానికి తాజా ఉదాహరణ చావుతప్పి కన్నులొట్టబోయిన టి.ఆర్.ఎస్. మెజార్టీయే. అదీ వెయ్యి ఐదొందల చిల్లర ఓట్లు మాత్రమే. ఈ ఫలితాన్ని ఉన్నదున్నట్టుగా ప్రకటించిన విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ పై అనవసరంగా చేతకాని వెయ్యిగొంతులు ఎకబికిన విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ప్రణాలికే లేని తెలంగాణా పార్టీలకు, ఉద్యమ సారధులకు ఉన్నది మాట్లాడితే ఉలుకు అన్నట్లుంది ఎంపి పొన్నం ప్రభాకర్ వైఖరి. ఆయన తన సిగ్గులేనితనాన్ని లగడపాటిపై కారుకూతలతో కాటేసేందుకు ప్రదర్శించారు. లగడపాటి అన్నట్టు 65శాతం సమైక్యవాద పార్టీలకే పరకాలలో ఓట్లు లబించాయి. అక్కడ అసలు తెలంగాణా వాదమన్నదే గెలవలేదన్నది నగ్నసత్యం. మాజీమంత్రి జీవన్ రెడ్డి కూడా రెచ్చిపోయారు. పైగా ఆయన ఓ సలహా కూడా పడేశారు. ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే తెలంగాణా వచ్చేస్తుందని జీవన్ రెడ్డి గొప్పగా శెలవిచ్చారు. వెనుకటికి ఎవడో పిచ్చికుదిరింది తలకు రోకలిచుట్టమన్నట్లు ఈ రాజీనామాలు చేస్తే వచ్చేది ఎన్నికలే కానీ, తెలంగాణా రాష్ట్రం మాత్రం రాదని మేథావులు చెప్పినా పాపం జీవన్ రెడ్డికి ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఇక టి.ఆర్.ఎస్.కి ఏమి మాట్లాడాలో తెలియని సారథి డైరెక్షన్ లో లగడపాటికి ఓ చిన్న హెచ్చరిక చేసి హమ్మయ్య ఆయన్ను బెదిరించేశాం. ఇక మనపని పూర్తయిందనుకుని చేతులు కడిగేసుకుంది.

కాలుష్యకాసారం కోటిపాం థర్మల్ ప్లాంట్?

రాష్ట్రప్రభుత్వం ఇటీవల కేంద్ర అనుమతితో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న కోటిపాం థర్మల్ విద్యుత్ ప్లాంటు కాలుష్యకాసారమని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అసలు ఈ ప్లాంటుకు కేంద్రం ఎలా అనుమతి ఇచ్చిందో అర్తంకావటం లేదని ఆందోళనకారులు ధ్వజమెత్తుతున్నారు. వీరికి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ మద్దతు ప్రకటించారు. కేంద్రంలో తాను మంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్లాంటు గురించే తన దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేంద్రం అనుమతి ప్లాంటు కోసం రూపొందించిన దస్త్రాల్లోని అంశాలను బహిరంగ పరచాలని ఆందోళనకారులతో పాటు ఆయనా డిమాండు చేస్తున్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం ప్లాంటుకు నీతి కేటాయింపులు, లైసెన్సు మంజూరు చేసింది. ఈ మంజూరు వల్ల త్వరలో ప్లాంటు నిర్మాణానికి యాజమాన్యం ఏర్పాట్లు చేసుకోనుంది. ఈ విషయం తెలిసిన కేంద్రమంత్రి, సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ తప్పిదానికి చుట్టుపక్కల ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ఆ లేఖ్యలో తెలియజేశానని చంద్రదేవ్ స్పష్టం చేశారు.

నాగావళి నీటి పంపకాల్లో రైతులకు అన్యాయం?

రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నాగావళి నదిపై ఆధారపడ్డ రైతులకు అన్యాయం జరుగుతోంది. న్యాయంగా వీరికి రావలసిన వాటాలో కూడా కొంత స్తీలుప్లాంటుకు కేటాయించటం ప్రభుత్వ దగాకోరుతనాన్ని చాటుతోంది. అసలు రైతు కోసం తామేన్నో పథకాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1978 లెక్కల ప్రకారం నాగావళి నదిలో 44టిఎంసిల నీరు విడుదలవుతుంది. దీనిలో 28టిఎంసిలు ఒడిశారాష్ట్ర వాటా కింద వదిలేయాలి. మిగిలిన 16టిఎంసిలే ఆంధ్రావాటా. అయితే దీనిలో జంఝావతి నదికి 8టిఎంసిలు వదలాలి. మిగిలినది 8టిఎంసిలు మాత్రమే రైతులు సాగుకు ఉపయోగించుకోవాలి. తోటపల్లికి ఈ నీరు వదిలితే బ్యారేజీ సామర్థ్యం 2.5టిఎంసిలు. ఇందులో 2టిఎంసిలు ప్లాంటుకు ప్రభుత్వం కేటాయించింది. చివరకి రైతుకు మిగిలిందేమిటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. త్వరలో సాగునీరు చాలక నాగావళిపై ఆధారపడ్డ రైతులు ఉద్యమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం చేసిన ఈ కేటాయింపులపై కేంద్రమంత్రి కిశోర్ చెంద్రదేవ్ గుర్రుగా ఉన్నారని సమాచారం. ఆయన ఈ విషయంపై సిఎంకు లేఖ రాసే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

మోపిదేవి అరెస్ట్ పై సిబీఐ వత్తిడి పెంచుతున్నబి.సి. సంఘాలు

వాన్ పిక్ వ్యవహారంలో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణను సిబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో తాజాగా ఆయన కథలో ఓ కొత్తమలుపు చోటు చేసుకుంటోంది. మత్స్యకారుడైన వెంకటరమణను వదిలేస్తారని ఇంతవరకూ ఎదురుచూసిన ఆయన బంధువులు రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారుల సంఘాలతో ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా బి.సి.సంక్షేమశంఘం కూడా ఈయనను కాపాడుకోవాలని కదిలింది. దీంతో ఈయనను కేసు నుంచి బయటపడేసేందుకు నిరసన కార్యక్రమాలు ఇకపై హోరెత్తనున్నాయి. అన్ని జిల్లాల సంఘాలను రాష్ట్రరాజధానికి రప్పించి బి.సి. అయినందునే మోపిదేవిని ఎరగా వాడారని ఆందోళనకు నేపథ్యాన్ని చూపుతున్నారు. జగన్ లాంటి చేపకోసం సిబీఐ ఎరగా వాడుకున్న తరువాత వెంకటరమణను ఎందుకు వదలలేదని ఆందోళనకారులు ప్రభుత్వాన్ని డిమాండు చేయనున్నారు. మే 24న మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. డానికి ముందు సిబీఐ అరెస్టు చూపేటప్పుడు జి.వో.లపై తనకేమీ తెలియదని, అప్పటి సిఎం రాజశేఖరరెడ్డి తనను పిలిపించుకుని ఫైలుపై సంతకం చేయించారని ఆరోపించారు. అరెస్టై మంత్రి పదవికి రాజీనామా చేశాక సిఎం కిరణ్ కు ఆయన ఒక లేఖ రాశారు. తనను వై.ఎస్.ఆర్. సిఎం కార్యాలయానికి పిలిపించుకుని కార్యదర్శి సమక్షంలో సంతకాలు తీసుకున్నారని తెలిపారు.     అయితే ఆ తరువాత జగన్ ను అరెస్టు చేశారు. జగన్ తో సన్నిహితునిగా చెంచల్ గూడ జైలులో ఉంటున్న మోపిదేవి తన బెయిల్ పిటీషన్ లో ఆరోపణలు మార్చారు. వై.ఎస్. ప్రస్తావన ఎక్కడా లేకుండా ప్రధానకార్యదర్శి తదితరులు ప్రతిపాదనలను పంపితే మంత్రివర్గం ముందుంచానని మోపిదేవి వివరించారు. మంత్రివర్గం చర్చించి ఈ నిర్ణయం తీసుకుందని నమోదు చేసిన అంశానికి పొంతన లేకుండా మోపిదేవి ఇంకా పలు అనుమానాలకు తావిచ్చారు. అయితే సిబీఐ కూడా మోపిదేవి కస్టడీలో ఉడడంతో అతి పెద్ద నేరమైన మనీ లాండరింగ్ వ్యవహారం చుట్టూ కేసును నడిపింది. ఈ దశలోనే ఈది జగన్ కేసులో విచారణ ప్రారంభించింది. తాజాగా జగన్ ను చెంచల్ గూడ జైలులోనే విచారించేందుకు అనుమతి తీసుకుంది. దీంతో ఆ విచారణలో ఈది జగన్ ను మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రశ్నిస్తుంది. దీంతో సిబీఐ వాన్ పిక్ వ్యవహారం తేల్చే అవకాశమే కనిపించటం లేదు. అందువల్ల మోపిదేవి విషయం తేలటానికి ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విచారణ జరగకుండా తనను ఖాళీగా ఉంచుకున్న సిబీఐ ఇంకా తాత్సారం చేసే అవకాశాలు ఉన్నాయని మోపిదేవి తన బంధువులకు తెలియజేశారు. దీంతో కొత్త మలుపుకు ఆయనే స్వయంగా బీజం వేసుకున్నట్లు అయింది. ఈ నిరసనల హోరు రాష్ట్రప్రభుత్వాన్ని కదిలిస్తే ఖచ్చితంగా బెయిల్ దొరికే అవకాశం ఉంటుందని వెంకటరమణ ప్లాన్. ఈ ప్లాన్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో తెరపైనే చూడాలి.

రెహమాన్ కు సంజాయిషీ నోటీసు

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల విజయానంతరం అత్యుత్సాహంతో రివాల్వర్ పేల్చిన రహమాన్ ను ఆ పార్టీ సంజాయిషీ కోరనున్నది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ అయిన రహమాన్ 15వ తేదీన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విజయోత్సవంలో తన లైసెన్స్ రివాల్వర్ తో అయిదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఆయనకు బెయిల్ దక్కిందిగానీ పార్టీ మాత్రం సంజాయిషీ కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న జిల్లా కన్వీనర్ల సమావేశంలో రెహమాన్ ను సంజాయిషీ కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విజయోత్సవాన్ని బీహార్ విజయోత్సవాలతో పోల్చడం, బీహార్ తరహా రాజకీయాలకు ఇది నాంది అని పలు పక్షాలనేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే రెహమాన్ పిస్టల్ మిస్ ఫైర్ అయిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. విజయోత్సవ గందరగోళంలో తన వద్దనున్న తుపాకీ పేలవచ్చని భావించిన రెహమాన్ పిస్టల్ ను చేయితో పైకెత్తి పట్టుకున్నారని, దీంతో తోపులాటలో తుపాకీ పేలిందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కేసు, సంజాయిషీ ఎల ఉన్నా రాష్ట్రరాజకీయాల్లో కొత్త సంస్కృతి ప్రారంభమైందని చెప్పవచ్చు.

దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం! యువరక్తమే పరిష్కార మార్గం?

సరిగ్గా 31ఏళ్ళ క్రితం ... ఓ తెలుగుతేజం రాజకీయ సంచలనానికి నాందీప్రస్తావన పలికింది. అదీ వెండితెర వెలుగుగా కీర్తిపతాకాన్ని పొందినా ప్రజాసేవకోసం రాజకీయ తెరంగ్రేటం చేసింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ప్రపంచవ్యాప్త మన్ననలు అందుకున్న నందమూరి తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి 1982లో తెలుగుదేశంపార్టీని నెలకొల్పారు. ఆయన ఎంత సంచలనంగా నిర్ణయం తీసుకుని పార్టీ స్థాపించారో అంతే సంచలన మైన స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించి గద్దెనెక్కారు. ముందునుంచి నటనతో పాటు ప్రజాజీవితానికి దగ్గరగా పనిచేసిన అనుభవాన్నీ రంగరించి పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఒంటిచేత్తో శాసించారు. ఆనాటి రామారావు ఒక సంచలనానికి వేదిక. ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ యావత్తు గెలిపించుకున్న ధృవతారగా కీర్తినందు కున్నారు. గద్దెనెక్కిన తొలినాళ్ళలోనే ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని పొందిన నాదెండ్ల భాస్కరరావును ప్రజాతీర్పుతో తిప్పికొట్టారు. కానీ, చివరకి తన సొంత అల్లుడు నారా చంద్రబాబు నాయుడు చేతిలో పరాభవానికి గురై తీవ్రవేదనతో కన్నుమూశారు. ఈ 31ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఆ పార్టీ మాత్రం చిరస్థాయిగానే నిలిచిపోయింది. అయితే ఎన్టీఆర్ లా ఒంటిచేత్తో గెలిపించుకునే సత్తా ఉన్న నాయకుని కొరతతోనే సతమతమవుతోంది. 14ఏళ్ళ అధికారం, 17ఏళ్ళ ప్రతిపక్షహోదాతో ఇప్పుడు తామేస్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు పొలిట్ బ్యూరో సభ్యుల ముందు పార్టీ నిలిచింది.   నాటి చరిష్మాగానీ, ఆకట్టుకునే పథకాలు కానీ ఇప్పుడు ఆ పార్టీకి లేవు. అందుకే 2012 ఉపఎన్నికల్లో ఎంతో జూనియర్ అనుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి దెబ్బకు కంగుతింది. 18 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన ఈ ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటీ సాధించాలేకపోవటానికి సరైన కారణం వెదికేందుకు కసరత్తులు చేస్తోంది. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ బొమ్మనే పూర్తిగా చెరిపేసింది. అంతేకాకుండా ఆయన కుటుంబానికీ ఈ పార్టీ దూరమైంది. ఎన్టీఆర్ ఏ పార్టీనైతే విమర్శించారో ఆ పార్టీలోనే అంటే కాంగ్రెస్ లో దగ్గుబాటి పురందరేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్నారు. ఈమె ఎన్టీఆర్ కుమార్తె. ఆయన భార్య లక్ష్మీపార్వతి ఇప్పుడు జగన్ పంచన చేరింది. ఆమె ఇప్పుడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు.   అలానే ఎన్టీఆర్ రూపురేఖలలో తీసిపోని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్, కుమారుడు హరికృష్ణ మరో కుమారుడు బాలకృష్ణ ఎవరూ కూడా పార్టీ తరపున ప్రచార బాధ్యతలు తీసుకోలేదు. బాబు రమ్మంటేనే ప్రచారానికి వస్తామని అంటున్నారు. ఇటీవల ఉపఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడులుకోవటమే కాకుండా కేవలం జగన్ పై దూషణలకె చంద్రబాబు పరిమితమయ్యారు. తమకున్న అజెండాను బయటపెట్టలేకపోయారు. ప్రత్యేకమైన హీమీలు ఇవ్వలేకపోయారు. స్థానికంగా ఉన్న సమస్యలు బయటపెట్టలేకపోయారు. స్థానికంగా ఉండే సీనియర్లకు పెద్దపీట వేసే ధోరణిని మరచిపోయారు. స్థానికంగా ఉండే స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు వంటివాటిని ఆకర్షించేందుకు కసరత్తులు చేయలేకపోయారు. తమకు మహిళలంటే ఉన్న గౌరవాన్ని చాతుకునేలా గతంలో ప్రసంగించిన చంద్రబాబు రాజకీయంగా ఎదిగి ఆ మహిళల గురించి మాట్లాడటమే మానేశారేమిటన్న ప్రశ్న చంద్రబాబు పర్యటించిన ప్రతీప్రాంతంలోనూ వినిపించింది.   ఇంకో విచిత్రమేమంటే రోడ్డుషో పేరిట చేసే ప్రసంగాల్లో సమగ్రతను కోల్పోయిన చంద్రబాబునే ఓటర్లు చూశారు. అప్పట్లో మాదిరిగా సమస్యలపై కూలంకుషంగా మాట్లాడే నేర్పున్న బాబును ఈసారి ఓటర్లు గమనించలేదు. అలానే ఎవరైనా పార్టీ మారితే సస్పెన్షన్, క్రమశిక్షణ తప్పదని హెచ్చరించే బాబు ఈ మధ్యనే బుజ్జగించటం మొదలుపెట్టారు. తనకు వయస్సు పెరుగుతోంది కాబట్టి బాబు సీరియస్ గా క్రమశిక్షణ వదిలేశారు. గతంలో ఈ క్రమశిక్షణకె జడిసి అభ్యర్థులూ, ప్రజలూ, ఉద్యోగులూ ఆయనకు సహకరించారు. అధికారం కోల్పోయాక ఆ గత అనుభవాన్ని మరిచిపోయిన చంద్రబాబు తన పార్టీ యువరక్తంతో నింపేందుకు ప్రయత్నిస్తేనే బాగుంటుంది. అలా అని తన కుమారుడు లోకేష్ ఒక్కరితోనే రాజకీయరంగ ప్రవేశం చేయించకుండా ఇంకా యువరక్తంతో పార్టీని నింపేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది. ఆసక్తి ఉన్న యువకులను చంద్రబాబు ముందుగా ఆహ్వానిస్తే రాజకీయాల్లో వారు రాణిస్తే ఆయన కూడా అధికారం పొందేందుకు అవకాశాలు ఉంటాయి కదా! మరి బాబేమిటో ఈ దిశగా ఆలోచించటం లేదంటున్నారు. ఉపఎన్నికల్లో దేశం ఓటమికి కర్ణుడి చావుకున్నన్ని కారణాలున్నాయి. ఏమైనా చరిష్మా ఉన్నవారికి దేశం స్వాగతం పలికితే బాగుంటుందని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.

తెలుగుదేశంలో ముదురుతున్న కుమ్ములాటలు

అనంతపురం తెలుగుదేశంపార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. టిడిపి అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ బలమైన అభ్యర్థి అయినా విజయం సాధించలేకపోవటానికి కొందరు కలిసిరాలేదని ఆగ్రహించిన కార్యకర్తలు అంతర్గత విభేదాలకు తెరలేపారు. ప్రచారంలో సహకరించని తెలుగుదేశం నేతల జాబితా రూపొందించి మరీ దాడుఅలకు ప్రణాలికలు వేస్తున్నారు. దీనికి కూడా ఉదాహరణ తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యదర్శి రాయల్ మురళీపై దాడి. ఆయన ప్రచారంలో సరిగ్గా పాల్గోనకపోవటం వల్ల ఓట్లు తగ్గాయని ఆ పార్టీలోని కొందరు ఆగ్రహించారు. ఆ కోపంలోనే రాయల్ మురళీ ఇంట్లో జీపుపై రాళ్ళు విసిరారు. జీపు అద్దాలు కూడా పగిలాయి. ఇంట్లో కూడా రాళ్ళు పడ్డాయి. దీంతో మురళీ భార్య రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను డబ్బు ఆశిచాకుండా పనిచేసినందుకే ఇటువంటి ప్రతిఫలం లభించిందని రాయల్ మురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ.నారాయణపురం నాయకులే ఈ పనిచేసి ఉంటారని ఆయన అనుమానిస్తున్నారు. బెట్టింగుల్లో నష్టం తట్టుకోలేక ఈ దాడులకు దిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఓట్లు పెరిగినా ఓటమి తప్పలేదా?

2012 ఉపఎన్నికల చిత్రంలో ఇదీ ఒక విచిత్రమే అనుకోవాలి. ఒక పార్టీకి ఓట్లు పెరిగినా ఓటమి తప్పలేదు. ఈ పార్టీ పదిస్థానాల్లో వై,ఎస్,ఆర్, కాంగ్రెస్ పార్టీ తో హోరా హోరీగా పోరాడిందే. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది అదే తెలుగుదేశం గురించేనని. ఎగ్జాట్లీ ... మీరు ఊహించింది నిజమే. తెలుగుదేశంపార్టీ తన క్యాడర్ ను పెంచుకునేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకుందన్నది జగమెరిగిన సత్యం. దీనికి అనంతపురం నియోజకవర్గంలో పరిస్థితే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీసిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఓట్లు పెరిగాయి. 2009 ఎన్నికల్లో తెలుగుదేశానికి 32వేల ఓట్లు పోలయ్యాయి.   2012 ఉపఎన్నికల్లో ఇదే పార్టీకి 40వేల చిల్లర ఓట్లు పోలయ్యాయి అంటే సుమారు 9వేల ఓట్లు ఈ పార్టీకి పెరిగినా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుపొందింది. రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నుంచి దేశంలోనే అత్యంత ధనికుడు దీపక్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తగ్గింది. అందుకే ఓటింగ్ తగ్గిందని పరిశీలకులు వెల్లడి చేస్తున్నారు. 2009లో తెలుగుదేశం అభ్యర్థి గోవిందరెడ్డికి 62,000ఓట్లు వచ్చాయి. 2012లో దీపక్ రెడ్డికి 40,000ఓట్లు పోలయ్యాయి. అంటే 20వేల ఓట్లు తగ్గాయి.

భయాందోళనల్లో మద్యం వ్యాపారులు!

మద్యం వాటాలు కలిగివున్న నేతల వివరాలు ఎసిబి వద్ద చాంతాడంత తయారైందని, ఇక విచారణ వేగిరం చేయటమే ఆలస్యమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్తగా మరికొందరు ఎమ్మెల్యేల పేర్లు విమర్శల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన పేర్లు కూడా ఎసిబి వదలటం లేదు. దీంతో మీకు మద్యం వ్యాపారంలో వాటా ఉంది కదా అని ఏ ఎమ్మెల్యేనైనా ప్రశ్నిస్తే ఉలిక్కిపడి ముందుగానే ఘాటైన సమాధానాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే తమ పేరు ఎక్కడ ఎసిబి జాబితాలోకి చేరుతుందో అన్న ఆందోళన వారికి ఎక్కువయింది. ఇలా ఆందోళనతో సవాల్ చేసేవారికి తాజా ఉదాహరణ ఎమ్మెల్యే తూంగుంట నర్సారెడ్డి. ఈయన తనకు 27శాతం మద్యం వ్యాపారాల్లో వాటా ఉందని తెలుగుదేశంపార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ ఛార్జి బూర్గుపల్లి ప్రతాపరెడ్డి నిరూపించలేకపొతే రాజకీయాలనుంచి తప్పుకోవాలని డిమాండు చేశారు.   తాను కలిసిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. తనకూ కరుణాకర రద్దీకి సర్పంచిగా పార్టీ తరపున పనిచేసిన అనుభందమున్నందునే కలిశానని, దీన్ని రాజకీయం చేసిన ప్రతాప్ రెడి తన సవాల్ స్వీకరించాలని డిమాండు చేశారు. నర్సారెడ్డి చేసిన డిమాండును ప్రతాప్ రెడ్డి స్వీకరించారో? లేదో? కానీ, దీన్ని పరిగణలోకి తీసుకుని సిబీఐ అసలు విషయం తేల్చాలని ఎమ్మెల్యే ప్రత్యర్థులు కోరుతున్నారు. పనిలో పనిగా ఈయన విషయం తెలిస్తే ఎమ్మెల్యేల పాత్రలపై ఉన్న అనుమానాలు కూడా తీరుతాయన్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇద్దరు నానిల ఆతృత!

ఉపఎన్నికల్లో విజయఢంకా మోగించిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు నానిలు ఇద్దరూ ఆతృతపడుతున్నారు. ఇంకా ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్న వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేసేందుకు తొందరపడుతున్నారు. ముందుగా జగన్ తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని వీరిద్దరూ రాజధానికి వెళ్ళారు. చెంచల్ గూడ జైలులో జగన్ ను కలిగిన తరువాత తమ రాజీనామాలను సమర్పించేందకు సిద్ధపడ్డారు. తెలుగుదేశంపార్టీ కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఇక తన ఆతృతను ఆపుకోలేక అభిమానుల పేరిట తానే స్వయంగా చేయించిన ఫ్లెక్సీలను లింగవరం ప్రాంతంలో ప్రదర్శించారు. ఈ ఫెక్సీల్లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి, జగన్ లతో నాని ఉన్న చిత్రం కనిపిస్తోంది. పేరుకు మాత్రం అభిమానుల ఫోటోలు, పేర్లు మాత్రం ఆ ఫ్లెక్సీల్లో కిందభాగాన రాయించారు.   ఇలా ప్రచారం జరిగాక ఆయన రాజధాని బయలుదేరి వెళ్ళారు. ఇక మరో ఎమ్మెల్యే ఆళ్ళ నాని విషయానికి వస్తే తనతోపాటు వెనుక వచ్చే కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నాయకులను లెక్కించే పనిలో మొన్నటివరకూ బిజీగా ఉన్నారు. తన వెనుక వచ్చేవారందరినీ సిద్ధం చేసుకున్న ఈ ఏలూరు ఎమ్మెల్యే ఫలితాలు వచ్చిన దగ్గరనుంచి జగన్ ను కలిసి తన సంతోషాన్ని పంచుకోవాలని ఆరాటపడ్డారు. అంతేకాకుండా తన రాజీనామా సమయం గురించి చర్చించాలని ఉత్సాహంగా రాజధానికి బయలుదేరుతున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.