కోర్టులో లో౦గిపోయిన నిత్యానంద,ఒక రోజు రిమాండ్
posted on Jun 13, 2012 @ 4:16PM
నిత్యానంద స్వామి బుధవారం బెంగళూరులోని రామనగర్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. మీడియాపై దాడి కేసులో పోలీసులు నిత్యానంద స్వామిపై ఇటీవల కేసు నమోదు చేశారు. ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. దాడి అనంతరం నిత్యానంద అదృశ్యమయ్యాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలించారు. బుధవారం ఆయనే స్వయంగా కోర్టుకు వచ్చి లొంగిపోయారు. కాగా నిత్యానంద స్వామీ ఆశ్రమంలో పోలీసులకు గంజాయి, మద్యం, కండోమ్స్ దొరికిన విషయం తెలిసిందే. కర్నాటకలోని ఆయన బిడదిలో నిత్యానందకు చెందిన ధ్యానపీఠంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రామనగర జిల్లా జాయీంట్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ కలెక్టర్ తదితరుల నేతృత్వంలో యాభై మంది పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్రమం ఆవరణలో గంజాయి, కండోమ్‌లు, మద్యం సీసాలు, పాశ్చాత్య సంగీత సిడిలు, తమిళ వారపత్రికలు పోలీసులకు దొరికాయి. మరోవైపు మంగళవారం హైకోర్టులో నిత్యానంద ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టు విచారణను వాయిదా వేసింది. నిత్యానందకు రామనగర్ కోర్టు ఒకరోజు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.